Cashless Village: ఇదొక రహస్య గ్రామం. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 124 దేశాలకు చెందిన వారు ఇక్కడ ఉంటారు. ఒక్క వస్తువు కొనరు.. మద్యం ముట్టరు.. సిగరెట్ త్రాగరు.. ఒక్క చెడు అలవాటు ఉండదు. మొత్తం మీద వీరి జీవనశైలి ఓ వెరైటీ. సమాజానికి చాలా దూరంగా ఉంటూ, ఎన్నో రకాలుగా ఆదర్శంగా నిలుస్తున్న ఈ గ్రామం గురించి అందరూ తెలుసుకోవాల్సిందే. ఇంతకు మన దేశంలో మనకు తెలియకుండా ఇంత వెరైటీ గ్రామం ఎక్కడ ఉందని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవండి.
ఈ గ్రామానికి వెళ్లిన వారు మళ్లీ రావడం కష్టమే. ఎందుకంటే అక్కడి వాతావరణం అటువంటిది. అక్కడి పలకరింపులు వేరు. అంతేకాదు బాబు.. ఇక్కడ బ్రతకాలంటే డబ్బులు కూడా అవసరం లేదు. అలాంటి గ్రామం ఇది. ఇంతకు ఎక్కడ ఉందంటే.. తమిళనాడు, పుదుచ్చేరికి సమీపంగా వెలసిన గ్రామమే ఇది. ఈ గ్రామం పేరు అరోవిల్లే.
గ్రామానికి పునాది ఓ వెరైటీ..
తమిళనాడులో, పుదుచ్చేరికి సమీపంగా వెలసిన అరోవిల్లే అనే గ్రామం సమకాలీన ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇది కేవలం ఓ గ్రామం కాదు.. ఓ భావన. ఇది ఓ వింత ప్రయోగం కాదు.. ఓ జీవన తత్వం. 1968 ఫిబ్రవరి 28న ఫ్రెంచ్ ఆధ్యాత్మిక గురువు శ్రీ అరవిందో ఆశ్రమం సహ స్థాపకురాలు మిర్రా అల్ఫాసా తన స్వప్నంగా భావించిన ప్రపంచ సమాజంను స్థాపించాలన్న లక్ష్యంతో అరోవిల్లేను ప్రారంభించారు. ప్రారంభ వేడుకలో 124 దేశాల నుండి వచ్చిన యువతులు తమ తమ దేశాల మట్టిని ఒక కమలాకార గుంతలో పోసి, ఏకత్వానికి సంకేతం నిలిపారు. దీని ఉద్దేశం.. దేశం ఏదైనా మనుషులు ఒక్కటేనని చాటి చెప్పడమే.
మాతృమందిర్..
అరోవిల్లే లో వింతగా చెప్పుకోదగ్గది మాతృమందిర్. ఇది గోల్డెన్ గ్లోబ్ ఆకారంలో ఉండే ధ్యాన మందిరం. ఇందులో అద్దాలతో కట్టిన, ప్రపంచంలోనే అతిపెద్ద గ్లోబ్ క్రిస్టల్ ఉంది. ఇది మతానికో లేదా మతప్రచారానికో కేంద్రము కాదు, కానీ మానవుడు తన అంతరాత్మను అన్వేషించుకునే ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంది.
ఇక్కడి ప్రజల జీవనశైలి
ఇక్కడ నివసించేవారు అరోవిల్లియన్లుగా పిలవబడతారు. వీరు ప్రపంచంలోని 60కు పైగా దేశాల నుంచి వచ్చి, భిన్నమైన భాషలు, సంస్కృతులు కలిగినవారైనా, సమానత్వం, సహజీవనం విలువలపై దృష్టి సారించి జీవిస్తున్నారు. ఇక్కడ మద్యం, సిగరెట్లు, సొంత భూమి, రాజకీయాలకూ చోటులేదు. ప్రతి ఒక్కరూ తాము ఇష్టపడే రంగంలో వ్యవసాయం, విద్య, కళలు, నిర్మాణం, ఆరోగ్యం మొదలైన వాటిలో పనిచేస్తారు.
డబ్బు ముఖ్యం కాదు
ఇక్కడ కొంతవరకు క్యాష్‌లెస్ కమ్యూనిటీ తరహాలో వ్యవస్థ ఉండడం విశేషం. ఒకరి పని ఇంకొకరి సేవనే సూత్రంతో జీవనం సాగుతుంది. అరోకార్డ్ అనే ప్రత్యేక గుర్తింపు కార్డు ద్వారా అవసరమైన సేవలు పొందుతారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల నుండి వచ్చిన నిధులతో సామూహిక అవసరాలు నెరవేర్చుకుంటారు.
అప్పట్లో ఎడారి.. ఇప్పుడు స్వర్గం
1968 నాటికి ఈ ప్రాంతం పూర్తిగా బీడుగా ఉండేది. అయితే స్థానికులు, విదేశీయుల కలయికతో 30 లక్షలకుపైగా చెట్లు నాటగా, ఈ ప్రదేశం ఇప్పుడు పచ్చదనంతో నిండి ఉంది. హరిత పథకాలతో పాటు గోబార్ గ్యాస్, సోలార్ ప్యానెల్స్ వాడకం అరోవిల్లే ప్రత్యేకత.
Also Read: Tiny Mobile Prisoners: సిగరెట్ లైటర్ సైజులో మొబైల్.. క్రిమినల్స్ కోసం స్పెషల్!
వింతలు..
అరోవిల్లే లో నాణ్యమైన రోడ్లు మీకు కనిపించవు. ఇక్కడ అందరూ సైకిల్ వాడతారు. ఇక్కడి గదులు ముడి ఇటుకలతో నిర్మితమై ప్రకృతికి దగ్గరగా ఉంటాయి. పాఠశాలలు పరీక్షలు లేకుండా, విద్యార్థుల మనోభావాలను గుర్తించి నేర్పేలా ఉండటం విశేషం. ప్రతి కుటుంబానికి డబ్బు అవసరం లేకుండానే అన్నీ అవసరాలు సమకూరే విధంగా జీవన విధానం రూపొందించబడింది.
ఆతిథ్యం.. సందర్శకులకు స్వాగతం
అరోవిల్లేను సందర్శించదలచిన వారికి ప్రత్యేకమైన గైడ్‌డ్ టూర్లు, వాలంటీర్ అవకాశాలు, ధ్యానం, ప్రకృతి నివాసాల అనుభవం అందుబాటులో ఉంటాయి. మాతృమందిర్‌ను బయటనుంచి చూడవచ్చు, అయితే ధ్యానానికి ముందుగానే అనుమతి తీసుకోవాలి. ఈ శతాబ్దంలో, స్వార్థం, అసమానతల మధ్య ఒకతత్వాన్ని సాధించాలంటే అరోవిల్లే స్ఫూర్తిగా నిలుస్తుంది.