Bonacaud Bungalow: సాధారణంగా ఎవరినైనా నీకు దెయ్యం అంటే భయమా? అని అడిగినప్పుడు.. అవతలి వ్యక్తి నాకేం భయం లేదు, నేను అస్సలు దెయ్యాలు ఉన్నాయని నమ్మను అని అంటాడు. అయితే మనం భయాన్ని నమ్మకపోయినా, దానికి మన మీదున్న పట్టును మాత్రం కాదనలేం. ‘దెయ్యాలు లేవు’ అని చెప్పుకుంటూనే, చీకట్లో ఓ శబ్దం వింటే గుండె దడ వేగంగా పెరుగుతుంది. అలాగే భయపడతామని తెలిసినా హారర్ సినిమాల్ని చూడాలని మనసు ఉబలాటపడటానికి కారణం కూడా ఇదే. మనమంతా చూసిన హర్రర్ కథలు ఎక్కువగా ఊహలో పుట్టినవే. కానీ ఇప్పుడు చెప్పబోయే కథ అలా కాదు. ఇది సినిమా కోసం రాసిన స్టోరీ అంతకన్నా కాదు. నిజంగా జరిగిన సంఘటనలతో ముడిపడిన భయానక నిజం. మన దేశంలోనే ఉన్న ఒక పాత బంగ్లా చుట్టూ తిరిగే ఈ కథేంటో తెలుసుకుందాం.
కేరళలోని అగస్త్య పర్వత శ్రేణిలో, దట్టమైన పచ్చని అడవుల మధ్య ఒక పాతబడ్డ బంగ్లా ఉంటుంది. దీనినే ‘భూత్ బంగ్లా’ అని కూడా పిలుస్తారు. ఈ బోనాకాడ్ బంగ్లాను 1951లో బ్రిటిష్ పాలన కాలంలో నిర్మించారు. అప్పట్లో ఈ ప్రాంతంలో టీ తోటలను నిర్వహించే ఒక బ్రిటీష్ వ్యక్తి.. తన కుటుంబంతో కలిసి ఇక్కడ నివసించేందుకు ఈ బంగ్లాను కట్టించాడని చెబుతారు. స్థానికులు దీన్ని 25 GB బంగ్లా అనే పేరుతో కూడా పిలుస్తారు.
అన్నీ సాధారణంగానే సాగుతున్న సమయంలో.. ఆ బ్రిటీష్ వ్యక్తి చిన్న కుమార్తె ఒక రోజు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఆ సంఘటన ఆ కుటుంబాన్ని పూర్తిగా కుదిపేసింది. ఆ విషాదం తర్వాత అతను తన భార్యతో కలిసి హడావుడిగా లండన్‌కు వెళ్లిపోయాడని కథలు చెబుతాయి. ఆ క్షణం నుంచే ఈ బంగ్లా చుట్టూ వింత వింత కథలు మొదలయ్యాయని స్థానికులు అంటారు.
ఆ బాలిక మృతి చెందిన తర్వాత ఈ ప్రాంతంలో పుకార్లు వేగంగా వ్యాపించాయి. రాత్రి వేళల్లో బంగ్లా కిటికీల దగ్గర ఓ అమ్మాయి నీడ కనిపిస్తుందని, అద్దాలు పగిలినట్టుగా శబ్దాలు వినిపిస్తాయని, ఆ అమ్మాయి ఏడవటం వంటి అరుపులు వినిపిస్తాయని చెబుతుంటారు. కొందరయితే బంగ్లాలో స్పష్టంగా దెయ్యం కనిపించిందని కూడా చెప్పుకున్నారు. ఈ కథలన్నీ కలిసి బోనాకాడ్ బంగ్లాను భయానక స్థలంగా మార్చేశాయి.
ఒకసారి కట్టెలు ఏరుకునేందుకు ఆ బంగ్లా దగ్గరకు వెళ్లిన ఓ స్థానిక యువతి.. అక్కడి నుంచి తిరిగి వచ్చాక పూర్తిగా మారిపోయిందని చెబుతారు. అస్సలు చదువుకోలేని ఆమె అకస్మాత్తుగా ఇంగ్లీషులో ఫ్లూయెంట్‌గా మాట్లాడటం మొదలుపెట్టడమే కాదు.. చదవగలనని, రాయగలనని చెప్పడం గ్రామస్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో చనిపోయిన ఆ బాలిక ఆత్మ ఆమెపై ఆవహించిందనే నమ్మకం స్థానికుల్లో మరింత బలపడింది.
బోనాకాడ్ ప్రాంతం కేరళ రాజధాని తిరువనంతపురానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రభుత్వం విధించిన కఠినమైన ఆంక్షల వల్ల అక్కడ హోటళ్లు, రిసార్ట్‌లు లేవు. ప్రస్తుతం బంగ్లా తలుపులు, కిటికీలు పూర్తిగా పాడైపోయి, కొన్ని చోట్ల చెక్క పలకలతో మూసివేసినట్టుగా కనిపిస్తుంది. అక్కడి ప్రజలు నేటికీ ఏమంటారంటే.. పగటిపూట బయటకు వెళ్లిన ఆ దెయ్యం, రాత్రి అయితే తప్పకుండా బంగ్లాకు తిరిగి వస్తుందట.
ఈ బంగ్లా వెనుక మరొక భయానక కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ ప్రదేశాన్ని గుర్తించేందుకు మొదట కరింతందన్ అనే గిరిజన యువకుడి సహాయం తీసుకున్నాడని చెబుతారు. ఆ తర్వాత ఆ బ్రిటిష్ ఇంజినీర్ అతన్ని మోసం చేసి చంపేశాడని స్థానిక కథనం. దానికి ప్రతీకారంగా కరింతందన్ ఆత్మ దెయ్యంగా మారి, ఆంగ్లేయుడి కుమార్తెను హతమార్చిందని చాలామంది నమ్ముతారు. ఇప్పటికీ ఆ గిరిజన యువకుడి ఆత్మ బోనాకాడ్ అడవుల్లో తిరుగుతుందన్న నమ్మకం అక్కడ బలంగా ఉంది.