Boycott OYO Trending | ఈతరంలో అందరూ తమ క్రియేటివిటీ చూపించుకోవాలని ఆరాటపడుతుంటారు. కానీ మతం, విశ్వాసం, సంస్కృతి అంశాల్లో మాత్రం క్రియేటివిటీ పేరుతో ఏ చిన్న మార్పుగాని, పోలీక గానీ ప్రజలు సహించరు. అలా ఎవరైనా చేస్తే.. వారు సంబంధిత వర్గం ఆగ్రహాన్ని గురికావాల్సి వస్తుంది. తాజాగా ఇదే కారణంతో ప్రముఖ హాస్పిటాలిటీ కంపెనీ ఓయో (OYO) వివాదంలో చిక్కుకుంది.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ ఎక్స్ లో బాయ్ కాట్ ఓయో పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీనికి కారణం ఓయో సంస్థ తాజాగా ఒక వెరైటీ ప్రకటన చేయడమే.
కుంభమేళా సందర్భంగా ఓయో సంస్థ ఇచ్చిన ఒక ప్రకటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓయో కంపెనీ తన తాజా ప్రకటనలో.. “దేవుడు అన్ని చోట్లా ఉంటాడు. అలాగే ఓయో కూడా” అని పేర్కొనడమే ఈ విమర్శలకు కారణం.
Also Read: లీటర్ పాలు రూ.180.. నెయ్యి కిలో రూ.4000.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూపర్ బిజినెస్
ఈ ప్రకటనలో దేవుడితో ఓయోను పోల్చడంపై నెటిజన్లు ఓయో యాజమాన్యంపై తీవ్రంగా మండిపడుతున్నారు. అలాగే.. హిందూ సంఘాల ప్రతినిధులు కూడా ఈ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓయోను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం వైరల్‌గా మారడంతో, ‘బాయ్‌కాట్‌ఓయో’ అనే హ్యాష్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీంతో ఓయో యజమాన్యం దిగొచ్చింది. ఈ అంశంపై ఓయో స్పందిస్తూ.. వివరణ ఇచ్చింది.
తమ ప్రకటనలో, అజ్మేర్, అయోధ్య, వారణాశి, ప్రయాగ్‌రాజ్, అమృత్‌సర్ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో తాము సేవలందిస్తున్నామని చెప్పేందుకే ఈ ప్రకటన ఇచ్చామని ఓయో స్పష్టం చేసింది. దేశంలో ఆధ్యాత్మిక పర్యటనను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రకటన ఇవ్వబడిందని.. ఎవరి మనోభావాలను కూడా దెబ్బతీయాలనే ఉద్దేశ్యం తమకు లేదని కంపెనీ యజమాన్యం తెలిపింది. తమ పత్రికా ప్రకటన వెనుక ఇదే ఉద్దేశ్యం ఉందని మరోసారి స్పష్టం చేసింది.
అలాగే, సంప్రదాయాలు, నమ్మకాలకు నిలువైన భారతదేశంలోని విశ్వాసాల పట్ల తమకు అపార గౌరవం ఉందని కంపెనీ చెప్పింది. ఈ సంవత్సరం చివరి కల్లా 12 ప్రధాన ఆధ్యాత్మిక నగరాల్లో 500 హోటళ్లను అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని ఓయో ప్రకటించింది.
కంపెనీలు తమ ప్రకటనల విషయంలో సున్నితమైన అంశాలను గమనించి జాగ్రత్తగా వ్యవహరించాలనే అవసరం ఉందని ఈ వివాదంతో అర్థమవుతోంది.
భారతదేశంలో మతం విషయంలోనే కాదు.. సంస్కృతి పట్ల కూడా ప్రజలు భావోద్వేగంగా ఉంటారు. పాశ్చాత్య దేశాల్లోని ఒక కామెడీ కార్యక్రమంతో అడిగిన ప్రశ్న.. ఇటీవల ఒక భారతీయ కామెడీ షోలో ఒక యూట్యూబర్ ప్రశ్నించాడు. ఆ ప్రశ్న చాలా అసభ్యమైన వ్యాఖ్యలుతో కూడుకుంది. దీంతో దేశవ్యాప్తంగా ఆ యూట్యూబర్ పై, ఆ కామెడీ షోపై కేసులు నమోదు అయ్యాయి. వివాదం ఎంత తీవ్రమైందంటే చాలా మంది ఆ యూట్యూబర్, ఆ షోలో పాల్గొన్న ప్రధాన సెలబ్రిటీలకు ప్రాణహాని తలపెడతామని హెచ్చరించారు.
ఈ కేసు సుప్రీం కోర్టు వరకూ చేరుకుంది. దేశ అత్యున్నత కోర్టు కూడా ఆ యూట్యూబర్ పై సీరియస్ అయింది. మరీ ఇంత దిగజారి వ్యాఖ్యలు చేయడం అవసరమా?.. అని నిలదీసింది.