Bride Slaps Drunk Groom | పెళ్లి అనగానే అంతా సంతోషం, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. బంధువులు, మిత్రులంతా వధూ, వరులను ఆటపట్టిస్తూ పెళ్లిలో అంతా సరదా చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని సార్లు అపశృతి కూడా జరుగుతూ ఉంటుంది. ఇరువైపులా చిన్న చిన్న కారణాలకే గొడవలు, ఘర్షణలకు చివరి ఆ పెళ్లి తంతు ఆగిపోతుంది. తాజాగా అలాంటి విచిత్ర ఘటన ఒకటి జరిగింది. వివాహ కార్యక్రమంలో వధూవరులు పూలదండలు మార్చుకోవాల్సిన సమయంలో పెళ్లి కొడుకు అనూహ్యంగా పెళ్లి కూతురి స్నేహితురాలి మెడలో దండ వేశాడు. దీంతో పెళ్లిలో అంతా రచ్చ రచ్చ జరిగింది. చివరికి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఉత్తర్ ప్రదేశ్ లోని జరుగుతుంటాయి.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలి నగరానికి చెందిన రవీంద్ర కుమార్ అనే 26 ఏళ్ల యువకుడికి రాధా దేవి (21) అనే యువతితో కొన్ని రోజుల క్రితమే వివాహం నిశ్చయమైంది. అందుకోసం పెళ్లి కూతరు తండ్రి ముందస్తుగా రూ.2.5 లక్షలు కట్నం సమర్పించుకున్నాడట. ఆ తరువాత పెళ్లి రోజు ఉదయం మరో రూ.2 లక్షల కూడా ఇచ్చాడట. ఇంత ఇచ్చినా పెళ్లి కొడుకుకి, అతని తండ్రి ఆశచావలేదు. అందుకే పెళ్లి కార్యక్రమానికి కాసేపు ముందు తన స్నేహితులతో తనకు తక్కువ కట్నం సంబంధం ఇష్టం లేదని. మరీ ఇంత తక్కువ కట్నం తీసుకుంటే తన విలువు ఉండదని వాపోయాడు. కానీ అతని స్నేహితులు మాత్రం కాసేపట్లో పెళ్లి పెట్టుకని ఇప్పుడు ఇష్టం లేదంటే ఎలా? అని అతనికి నచ్చజెప్పారు.
కల్యాణ మండపంలో పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ మద్యం సేవిస్తుండగా.. ఈ సంభాషణ జరిగింది. దీంతో పెళ్లి కొడుకు కూడా ఆ మద్యం తాగాడు. స్నేహితులు ఎంత వద్దని చెప్పినా పట్టించుకోకుండా తాగేశాడు. ఇంకేముంది పెళ్లి కొడుకు గింగిరాలు తిరుగుతూ ఏడు అడుగులు వేసేందుకు వెళ్లాడు. అక్కడ ముందుగా ఉత్తర్ భారత సంప్రదాయాల ప్రకారం.. వధూ వరులు ఒకరి మెడలో మరొకరు పూల దండలు మార్చుకుంటారు. పెళ్లి కూతురు ముందుగా వరుడి మెడలో వలమాల వేసింది. ఆ తరువాత రవీంద్ర వంతు వచ్చినప్పుడు అతను తూలుతూ పెళ్లికూతురు పక్కన నిలబడి ఉన్న అమ్మాయి (వధువు స్నేహితురాలు) మెడలో దండ వేసేశాడు. ఇంకేముంది పెళ్లిలో అందరూ టీవి సీరియల్ లెక్క జూమ్ జూమ్ అంటూ షాకింగ్ సీన్ చూశారు.
Also Read: ఫ్రీగా గేదెలు వస్తాయి.. రెండో పెళ్లి చేసుకుంటా!.. భర్త ఉండగానే
కానీ ఈ షాక్ నుంచి ముందుగా తేరుకున్న పెళ్లికూతురు రాధా దేవి.. తన ఎదుట నిలబడి ఉన్న వరుడు రవీంద్రను చాచి గట్టిగా ఒకటి లెంప మీద కొట్టింది. దీంతో రవీంద్ర పక్కనే ఉన్న అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. పెళ్లికొడుకు కూడా తనకు అవమానం జరిగిందని కిందికి దిగేశాడు. దీంతో గొడవ ప్రారంభమైంది. పెళ్లి కూతురు బంధువులు కూడా తగ్గేదెలే.. అంటూ వారిపై ముష్టి ఘాతాలు కురిపించారు. ఈ క్రమంలో ఫంక్షన్ హాల్ లో ఉన్న కుర్చీలు, ఇతర వస్తువులు విరగొట్టారు. చివరికి ఇరువైపులా పెద్దలు కూర్చొని పరిస్థితి సర్దుబాటు చేయడానికి ప్రయత్నించారు. కానీ పెళ్లికొడుకు రవీంద్ర తండ్రి ఒక షరతు విధించారు. తమకు అదనంగా కట్నం కావాలని డిమాండ్ చేశాడు.
దీంతో చేసేది లేక.. పెళ్లికూతురు తండ్రి తన వల్ల కాదని పెళ్లి రద్దు చేసుకున్నాడు. ఆ తరువాత తన నుంచి కట్నం కింద తీసుకున్న డబ్బులు అన్నీ ఇచ్చేయాలని అడిగాడు. కానీ రవీంద్ర, అతని తల్లిదండ్రులు పెళ్లిలో తమకు జరిగిన అవమానానికి ఆ డబ్బులు సరిపోయాయని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత రాధా దేవి, ఆమె తండ్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తమ వద్ద తీసుకున్న కట్నం డబ్బులు తిరిగి ఇప్పించాలని పోలీసులకు కోరారు. పోలీసులు కట్నం ఆరోపణల కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ప్రస్తుతం పెళ్లికొడుకు రవీంద్ర, అతని స్నేహితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.