TDP vs Ysrcp: అధికార టీడీపీ- వైసీపీ మధ్య వీసీ రాజీనామాల వ్యవహారం హాట్ హాట్‌గా మారింది. ఈ అంశంపై ఒకరిపై మరొకరు దుమ్మెత్తు పోసుకుంటున్నారు. బలవంతంగా వీసీల చేత రిజైన్ చేయిందని వైసీపీ ఆరోపించగా, దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది అధికార పక్షం. ఇంతకీ రాజీనామాల వెనుక అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్దాం.
మంగళవారం శాసనమండలిలో వీసీల రాజీనామాలపై అధికార టీడీపీ-విపక్ష వైపీపీ మధ్య తీవ్ర దుమారం రేగింది. సభలో, బయట నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు సంధించుకున్నారు. ఈ వ్యవహారంపై ముదిరి గాలివానగా మారింది. పరిస్థితి గమనించిన అధికార ప్రభుత్వం, వైసీపీకి కౌంటర్ ఇచ్చింది. ఆధారాలతో సహా బయటపెట్టింది.
మంత్రి నారా లోకేష్‌ను వైసీపీ టార్గెట్ చేసింది. ఎలాగైనా మంత్రిని బదన్నాం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. దీనిపై టీడీపీ కౌంటరిచ్చింది. దురుద్దేశంతోనే ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఎక్స్ వేదికగా దుయ్యబట్టింది టీడీపీ.
వీసీల చుట్టూ రాజకీయాలు
గత ప్రభుత్వం హయాంలో యూనివర్శిటీలకు వైస్ ఛాన్సలర్లగా నియమితులైనవారిని రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులకు గురై రాజీనామాలు చేశారన్నది వైసీపీ ప్రధాన ఆరోపణ. కొంతమంది ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది టీడీపీ. అందుకు సంబంధించిన వివరాలను బయటపెట్టింది.
ALSO READ: పవన్ కు బొత్స కౌంటర్, అలాగైతే మేం సిద్ధమే
వీసీల రాజీనామాల లేఖలో తమపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని, తమను బెదిరించారని పేర్కొనలేదని ప్రస్తావించింది. ప్రభుత్వం, రాజ్యాంగబద్దమైన వ్యవస్థలపై రాజకీయ మనుగడ కోసం కట్టు కథలు అల్లుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని దుయ్యబట్టింది. కేవలం ఒక్క సామాజికవర్గం వారికే యూనివర్శిటీలను అప్పగించిన గత ప్రభుత్వం, యూనివర్శిటీలను సర్వనాశనం చేసిందని మండిపడింది.
కూటమి ప్రభుత్వంలో మంత్రి లోకేష్ ఎడ్యుకేషన్ సెక్టార్‌పై ఫోకస్ చేశారు. విద్యారంగాన్ని ప్రక్షాళన చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సంస్కరణలు శ్రీకారం చుట్టారు. ఉద్యోగాలు కల్పించటానికి తెస్తున్న పెట్టుబడులను చూసి ఓర్చుకోలేక వైసీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ప్రస్తావించింది.
ఇంతకీ వైసీపీ ఆరోపణలేంటి?
ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ద్వారా ఆ శాఖ మంత్రి లోకేష్.. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను రాజీనామా చేయమని ఒత్తిడి తెచ్చినట్లు ఆధారాలు బయటపెట్టింది వైసీపీ. మంత్రి ఆదేశాలతో ఛైర్మన్ స్వయంగా వీసీలను పిలిచి రాజీనామా చేయించారని పేర్కొంది. ఈ మేరకు ఓ వీసీ తన రాజీనామా లేఖలో స్పష్టంగా రాసినట్టు వివరించింది.
ఈ నేపథ్యంలో వీసీల రాజీనామా చేయాలంటూ ఎందుకు ఒత్తిడి తెస్తున్నారని శాసన మండలిలో వైసీపీ ప్రశ్నించింది. వీసీలను బెదిరించినట్లు ఆధారాలు చూపితే విచారణకు ఆదేశిస్తామన్నారని గుర్తు చేసింది. బెదిరింపులకు సంబంధించిన ఆధారాలను బయట పెట్టింది వైసీపీ.
ఈ విషయంలో ఏమాత్రం నిజాయితీ ఉన్నా వీసీల రాజీనామాలపై న్యాయబద్ధంగా విచారణ చేయించాలని డిమాండ్ చేసింది వైసీపీ. నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్నది ప్రధాన డిమాండ్. అప్పుడే వాస్తవాలు బయటికి వస్తాయి.. న్యాయం గెలుస్తుందని ఎక్స్ లో పేర్కొంది వైసీపీ. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.