Butterfly effect: ‘బటర్‌ఫ్లై ఎఫెక్ట్’ దీని గురించి చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు. చిన్న సీతాకోకచిలుక తన రెక్కలు ఆడించడం వల్ల దూరంగా ఒక పెద్ద తుఫాను రావచ్చు అని ఎప్పుడైనా విన్నారా? ఇది కేవలం కథ కాదు, ఇందులో కొంత శాస్త్రీయ కారణం ఉంది! దీన్ని బటర్ ఫ్లై ఎఫెక్ట్ అంటారు. ఈ ఆసక్తికరమైన అంశం గురించి తెలుసుకోవాలంనుందా.. అయితే ఈ ఆర్టికల్‌ను పూర్తిగా చదవాల్సిందే..
బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటే?
ఈ సిద్ధాంతం చెబుతోంది ఏమిటంటే, చిన్న చిన్న మార్పులు లేదా సంఘటనలు కూడా పెద్ద ఫలితాలను తెచ్చిపెట్టవచ్చు. ఉదాహరణకు, ఒక చోట చిన్న గాలి మార్పు వాతావరణంలో పెద్ద తేడాలను సృష్టించవచ్చు. ఇది వాతావరణం, ఆర్థిక వ్యవస్థ, లేదా సమాజం వంటి సంక్లిష్ట వ్యవస్థలలో జరుగుతుందట.
ఎలా పనిచేస్తుంది?
బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అనేది కేయాస్ థియరీలో భాగం. ఈ సిద్ధాంతం ప్రకారం, కొన్ని వ్యవస్థలు చిన్న మార్పులకు చాలా సున్నితంగా ఉంటాయి. ఒక చిన్న మార్పు, ఉదాహరణకు వాతావరణంలో ఒక డిగ్రీ ఉష్ణోగ్రత తేడా, కాలక్రమంలో పెద్ద తుఫాను లేదా వర్షాన్ని మార్చగలదని సైంటిస్ట్‌లు చెబుతున్నారు. ఇలాంటి వ్యవస్థలలో దీర్ఘకాలిక అంచనాలు వేయడం చాలా కష్టం.
నిజమేనా?
సీతాకోకచిలుక వల్ల తుఫాను వస్తుందని చెప్పడం కాస్త అతిశయోక్తి అయినప్పటికీ, ఈ సిద్ధాంతం శాస్త్రీయంగా ఆధారాలతో నిరూపితమైనదే. 1960లలో వాతావరణ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ లోరెంజ్ తన పరిశోధనలో చిన్న డేటా మార్పులు పెద్ద తేడాలను తెచ్చాయని కనుగొన్నారు. ఈ సిద్ధాంతం వాతావరణ శాస్త్రం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం వంటి రంగాలలో బాగా అధ్యయనం చేయబడింది. అయితే, నిజ జీవితంలో ఒక నిర్దిష్ట కారణం ఏ పెద్ద ఫలితానికి దారితీసిందో ఖచ్చితంగా చెప్పడం కష్టం.
బటర్‌ఫ్లై ఎఫెక్ట్ ఎఫెక్ట్ నిజం అని చెప్పడానికి ఒక సంఘటన కూడా జరిగింది. 2003లో అమెరికాలోని ఒహాయోలో ఒక విద్యుత్ తీగ చెట్టు కొమ్మకు తగిలింది. ఈ చిన్న పొరపాటు, చెట్లు సరిగ్గా కత్తిరించకపోవడం భారీ విద్యుత్ కోతకు దారితీసింది. కొన్ని గంటల్లోనే అమెరికా ఈశాన్య రాష్ట్రాల్లో 5.5 కోట్ల మంది కరెంటు లేకుండా చీకట్లో మునిగిపోయారు. రవాణా ఆగిపోయింది, వ్యాపారాలు మూతపడ్డాయి, నీటి సరఫరా ఆగిపోయింది. ఒక్క చిన్న తీగ తగిలిన ఘటన, 6 బిలియన్ డాలర్ల నష్టానికి దారితీసింది. ఇది బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌కి నిజమైన ఉదాహరణ. ఒక చిన్న సంఘటన ఎలా పెద్ద అల్లకల్లోలం సృష్టించగలదో చూపించింది.
మనిషి జీవితంలో దీని ప్రభావం?
ఈ సిద్ధాంతం మనకు చిన్న నిర్ణయాలు, చిన్న చర్యలు కూడా పెద్ద మార్పులకు దారితీయవచ్చని గుర్తు చేస్తుంది. ఒక చిన్న సహాయం, ఒక మాట, లేదా ఒక చిన్న మార్పు కూడా ఎవరి జీవితంలోనో పెద్ద తేడా తెచ్చవచ్చు. కాబట్టి, మనం చేసే ప్రతి చిన్న పని కూడా ముఖ్యమే! ఈ సీతాకోకచిలుక ప్రభావం మనకు శాస్త్రం ఎంత ఆసక్తికరంగా ఉంటుందో, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో చెబుతుంది.