Mohali Momo Factory: హోటళ్లు, రెస్టారెంట్లు సహా ఇతర ఫుడ్ తయారీ ఫ్యాక్టరీల మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ, యాజమాన్యాల తీరులో మార్పు కనిపించడం లేదు. యథేచ్ఛగా కల్తీ పదార్థాలు, ప్రమాదకర నూనెలు, కుళ్లిపోయిన మాంసంతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. వినియోగదారుల జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగా ఓ ఫుడ్ ఫ్యాక్టరీ మీద ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు షాక్ అయ్యారు. ఈ తనిఖీలో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మురికి కూపంగా ఫుడ్ ఫ్యాక్టరీ
పంజాబ్ లోని మొహాలి పరిధిలో మౌటర్ అనే గ్రామం ఉంది. అక్కడ మోమోలు, స్ప్రింగ్ రోల్స్ తయారు చేసే ఫ్యాకర్టీ ఉంది. రెండేళ్లుగా ఈ ఫ్యాకర్టీని నడుపుతున్నారు. ఇక్కడి నుంచి రోజుకు సుమారు 2 క్వింటాళ్ల మోమోస్, స్ప్రింగ్ రోల్స్ ఛండీగఢ్, పంచకుల, మొహాలీలోని హోటళ్లు, దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. అయితే, ఇక్కడి నుంచి వచ్చిన తినుబండారాల గురించి ఫుడ్ సేఫ్టీ అధికారులకు తరచుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కంపెనీలో తనిఖీలు చేపట్టారు. అక్కడ ఉన్న పరిస్థితులను చూసి అధికారులు షాకయ్యారు. ఇలాంటి ఫుడ్ ఫుడ్ ప్రజలు ఎలా తింటున్నారు? అని ఆశ్చర్యపోతున్నారు.
మోమోస్, స్ప్రింగ్ రోల్స్ తయారీ ఫ్యాక్టరీలో పరిశుభ్రత అనేది లేదు. మొత్తం మురికి కూపంగా ఉన్నది. కుళ్లిపోయిన కూరగాయలు, పాడైన క్యాబేజీలు, నాణ్యత లేని ముడి పదార్థాలు దర్శనం ఇచ్చాయి. కిచెన్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. కడాయిలలో అపరిశుభ్రమైన నూనె పోసి ఉండగా, దాని చుట్టూ ఊగలు, దోమలు ముసిరి ఉన్నాయి. అప్పటికే తయారు చేసిన మోమోస్, స్ప్రింగ్ రోల్స్ ఎక్కడపడితే అక్కడ నేలమీదే పడేసి ఉన్నాయి. సాస్ ను పాత్రల్లో పోసి కనీసం మూతలు కూడా పెట్టలేదు. అత్యంత దారుణ పరిస్థితులను చూసి అధికారులు షాకయ్యారు.
If you eat Momos and Spring Rolls from street food vendors in Mohali, make sure to watch this video! Visuals from Mataur, Mohali, show locals raiding a place where momos and spring rolls were being prepared. These items were being supplied to various fast food stalls across… pic.twitter.com/r5nnGgymSj
— Gagandeep Singh (@Gagan4344) March 16, 2025
ఫ్రిజ్ లో కుక్క తల
అన్నింటి కంటే షాకింగ్ విషయం.. ఫ్రిజ్ లో కుక్కతల లభించింది. దాన్ని చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులు నివ్వెరపోయారు. కుళ్లిన మాంసం మధ్యలో కుక్క తల ఉండటం ఏంటని సిబ్బందిని ప్రశ్నించారు. అయితే, ఈ ఫుడ్ ఫ్యాక్టరీలో పని చేసే వాళ్లలో కొంతమంది నేపాల్ కు చెందిన వాళ్లు ఉన్నారని, వాళ్లు దాని మాంసం తిన్నారని చెప్పారు. అయినప్పటికీ, అధికారులు ఆ కుక్క తలను స్వాధీనం చేసుకుని, మోమోస్, స్ప్రింగ్ రోల్స్ లో దాని మాంసం కలిపారేమో అని తెలుసుకునే పనిలో పడ్డారు. కుక్క తలను పశు వైద్య అధికారుల దగ్గరికి పరీక్షల కోసం పంపించారు.
https://twtter.com/Gagan4344/status/1901874913604239540
ఫ్యాక్టరీ యజమానికి రూ. 22 వేల జరిమానా
అటు ఈ కంపెనీలో పని చేస్తున్న 8 మంది సిబ్బంది ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. వాళ్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ ఫ్యాక్టరీ నడుపుతున్న యజమానికి రూ. 22,000 జరిమానా విధించారు. అనధికారిక వధ, ప్లాస్టిక్ కవర్లలో మాంసం నిల్వ చేసినందుకు, పరిశుభ్రత పాటించనందుకు ఈ ఫైన్ వేశారు. ఈ ఫుడ్ ఫ్యాక్టరీకి సంబంధించి అధికారులు షేర్ చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఫుడ్ ప్రజలు ఎగబడి తింటున్నారా? అని షాక్ అవుతున్నారు.
Read Also: సగం బిర్యానీ తిన్నాక షాక్.. ప్లేట్ లో ఏం కనిపించిందంటే?