Parotta Gravy Consumer Complaint| ఎక్కడైనా హోటల్ లేదా రెస్టారెంట్‌కు వెళితే.. కస్టమర్లకు ఇడ్లీతో పాటు చట్నీ, సాంబర్, లేదా రైస్ తీసుకుంటే కాస్త కర్రీ, బిర్యానీతో గ్రేవీ ఉచితంగా ఇస్తారు. ఈ చట్నీలు, గ్రేవీలు కాంప్లిమెంటరీ. వీటికి జనాలు బాగా అలవాటు పడిపోయారు. నిజానికి అవన్నీ ఫ్రీ కాదు. బిల్లులో వాటికి కూడా కలిపే తీసుకుంటారు. ఒకవేళ ఏదైనా హోటల్ వారు గ్రేవీలు, చట్నీలు ఇవ్వకపోతే కస్టమర్లు అడిగి మరీ తీసుకుంటారు. ఇవ్వకపోతే ఎలా తినాలి? అని గొడవ చేస్తారు. అలాంటి గొడవే ఒకటి కేరళలో జరిగింది. ఈ గొడవలో హోటల్ వారు ఎంతకూ వినకపోవడంతో వారికి బుద్ధి చెప్పాలని సదరు కస్టమర్ కోర్టు కెక్కాడు. కానీ కోర్టు అతనికి షాకిచ్చింది. హోటల్ యజమాన్యానికి అనుకూలంగా తీర్పు చెప్పింది.
వివరాల్లోకి వెళితే.. నవంబర్ 2024లో ఎర్నాకులం నివాసి ఒకరు తన స్నేహితులతో కలిసి కొలెంచేరి ప్రాంతంలోని ఒక హోటల్‌కు వెళ్లారు. వారు మటన్ ఫ్రై, పరోటా ఆర్డర్ చేశారు. అయితే హోటల్ యజమాన్యం వారికి పరోటాతో పాటు మటన్ ఫ్రై ఇచ్చారు. కానీ రెగులర్ గా పరోటాతో పాటు ఇచ్చే కాంప్లిమెంటరీ గ్రేవీ ఇవ్వలేదు. దీంతో ఆ కస్టమర్లు గ్రేవీ కూడా ఇవ్వమని వెయిటర్ ను కోరారు. కానీ హోటల్ యజమాని, గ్రేవీని ఉచితంగా ఇవ్వడం తమ విధానం కాదని చెప్పారు. దీంతో కస్టమర్, యజమాన్యం మధ్య వాగ్వాదం జరిగింది.
హోటల్ యజమాన్యం తీరుపై అసహనంతో సదరు కస్టమర్ కున్నతునాడు తాలూకా సప్లై ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. సప్లై ఆఫీసర్ మరియు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఈ ఫిర్యాదుపై విచారణ జరిపారు. వారి నివేదిక ప్రకారం, ఆ రెస్టారెంట్‌లో గ్రేవీని ఉచితంగా అందించే అలవాటు లేదని తేలింది. ఈ నివేదిక తర్వాత, ఫిర్యాదుదారుడు ఈ విషయాన్ని కన్స్యూమర్ కమిషన్‌కు (కోర్టు) తీసుకెళ్లారు.
కమిషన్ ఈ కేసును పరిశీలించింది. కమిషన్ అధ్యక్షుడు డి.బి. బిను, సభ్యులు వి. రామచంద్రన్, టి.ఎన్. శ్రీవిద్యతో కూడిన బెంచ్ ఈ ఫిర్యాదును స్వీకరించలేమని తీర్పు ఇచ్చింది. రెస్టారెంట్ యజమాని ఉచితంగా గ్రేవీ ఇస్తామని ఎప్పుడూ వాగ్దానం చేయలేదని, అలాగే గ్రేవీ కోసం కస్టమర్ల నుండి బిల్లులో డబ్బులు కూడా వసూలు చేయలేదని కమిషన్ పేర్కొంది. అందువల్ల, ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టేందుకు ఎలాంటి ఆధారం లేదని కమిషన్ తేల్చింది. ఈ తీర్పు రెస్టారెంట్‌కు అనుకూలంగా వచ్చింది. రెస్టారెంట్‌లు తమ విధానాలను స్పష్టంగా చెప్పడం ద్వారా ఇలాంటి సమస్యలను నివారించవచ్చని, కస్టమర్లు కూడా రెస్టారెంట్‌లోని నియమాలను అర్థం చేసుకోవడం ముఖ్యమని కూడా కమిషన్ పేర్కొంది.
Also Read: యువకుడి తలపై పెద్ద కాక్రోచ్.. తొలగించడానికి వెళ్లిన యువతికి షాక్.. అది సామాన్యమైనది కాదు
రెస్టారెంట్‌లు తమ మెనూలో ఏమి ఉచితంగా ఇస్తారు, ఏది ఇవ్వడం లేదో ముందే చెప్పడం వల్ల ఇలాంటి గందరగోళం నివారించవచ్చు. ఎందుకంటే కొన్ని రెస్టారెంట్లు గ్రేవీలు, కర్రీలు, చట్నీల కోసం వేరుగా డబ్బులు వసూలు చేస్తాయి.