అదృష్టం మన పక్కనే ఉంటుంది. కానీ, దరిద్రం.. దాన్ని మన కంటికి కనిపించకుండా చేస్తుంది. సరిగ్గా ఇదే ఓ వృద్ధుడి విషయంలో జరిగింది. వయస్సు మీదపడటంలో వృద్ధాశ్రమంలో చేరిన ఓ పెద్దాయన.. అక్కడే కన్నుమూశారు. అతడికి వారసులు ఎవరూ లేకపోవడంతో అధికారులు అతడి ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని వేలం వేయడానికి ముందు.. ఇంటిని సోదా చేశారు. ఆ ఇంటిని వేలం వేస్తే.. రూ.30 లక్షలు కూడా రావని తొలుత భావించారు. కానీ, అప్పుడే ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఆ ఇంటి ద్వారా ప్రభుత్వానికి ఏకంగా రూ.30.20 కోట్లు వచ్చి పడ్డాయి. ఎలాగంటే?
పాల్ నార్సే అనే ఓ పెద్దాయన.. ఓ చిన్న గ్రామంలో సాదాసీదా జీవితం గడిపాడు. ఒంటరివాడు, పైగా వయస్సు మీద పడింది. దీంతో అధికారులు అతడిని వృద్ధాశ్రమానికి తరలించారు. అక్కడ చేరిన ఏడాది తర్వాత నార్సే 2024లో చనిపోయాడు. అప్పటి నుంచి అతడి ఇల్లు ఖాళీగానే ఉంది. స్థానికులు కూడా ఆ ఇంట్లోకి వెళ్లే సాహసం చేయలేదు. అతడికి వారసులు కూడా లేకపోవడంతో ప్రభుత్వమే.. ఆ ఇంటిని స్వాధీనం చేసుకుని వేలం వేయాలని అనుకుంది. ఈ సందర్భంగా ఓ నోటరీ అధికారి ఆ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ఇంటి గోడలో ఆయనకు ఊహించని నిధి దొరికింది.
అధికారి ఆ ఇంటిని సోదా చేస్తుండగా.. స్టోర్ రూమ్‌లో ఒక పెయింటింగ్ కనిపించింది. దాన్ని పక్కకు జరిపి చూడగా గోడలో బంగారు నాణేలు కనిపించాయి. అవి చాలా చక్కగా ఒకదానిపై ఒకటి పేర్చి ఉన్నాయి. ఒకటి కాదు.. వందకాదు.. ఏకంగా వెయ్యికి పైగా నాణేలు ఆ గోడలో ఉన్నాయి. వాటిలో పది ప్యాకెట్లు ఉండగా.. ఒక్కో ప్యాకెట్‌లో 172 బంగారు నాణేలు చిన్న ఇటుకల్లా పేర్చి ఉన్నాయి. అవి చాలా పురాతనమైన నాణేలు. అయితే, అవి ఆ పెద్దాయనే దాచి పెట్టాడా? మరెవ్వరైనా దాచిపెట్టారా అనేది తెలియరాలేదు. అంత విలువైన సొత్తును తన దగ్గర పెట్టుకుని ఆ పెద్దాయన ఎందుకంత దుర్భర జీవితం గడిపాడనేది కూడా అంతుబట్టని విషయం.
ఆ గోడలో దొరికిన నాణేలు సాధారణమైనవి కావు. ఇవి ఏకంగా 2000 సంవత్సరాల పురాతన నాణేలు. కాయిన్ ఎక్స్‌పర్ట్ థియరీ పార్సీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ నాణేలలో కొన్ని క్రీస్తుపూర్వం 336 – 323 మధ్య కాలానికి చెందిన ప్రాచీన ‘కింగ్డమ్ ఆఫ్ మాసిడోనియా’ నాటివి. అంటే ఈ నాణేలు దాదాపు 2,300 సంవత్సరాల కంటే పాతవి. ఫ్రాన్స్ రాజులైన లూయిస్ XIV, లూయిస్ XV, లూయిస్ XVI కాలానికి చెందిన బంగారు నాణేలు, నెపోలియన్ బోనపార్టే కాలం నాటి ఫ్రాంక్ నాణేలు కూడా ఇందులో ఉన్నాయి. ఫ్రాన్స్ చరిత్రకు అద్దంపట్టే అరుదైన నిధి ఇది’’ అని తెలిపారు.
పారిస్‌లోని ప్రముఖ వేలం సంస్థ ‘బ్యూసంట్ లెఫెవ్రే అండ్ అసోసియేట్స్’ ఆధ్వర్యంలో ఈ నాణేలను వేలం వేశారు. మొదట్లో ఈ నాణేల విలువ దాదాపు 2 మిలియన్ యూరోలు (సుమారు రూ. 21 కోట్లు) పలుకుతుందని అంచనా వేశారు. కానీ, వేలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాయిన్ కలెక్టర్లు వీటిని దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. దీంతో అంచనాలను మించి ఏకంగా 3 మిలియన్ యూరోలకు పైగా, అంటే సుమారు రూ. 30 కోట్ల 20 లక్షల రికార్డు ధరకు ఈ నాణేలు అమ్ముడుపోయాయి. వీటిలో ఉన్న ఏ ఒక్క నాణేన్ని వదలకుండా వాటిని కొనేశారంటే.. అవి ఎంత విలువైనవో అర్థం చేసుకోవచ్చు. పాపం.. పెద్దాయన ఇంట్లోనే కోట్ల నిధి పెట్టుకుని సాధారణ జీవితం గడిపేశాడు. అయితే, చివరి క్షణాల్లో కూడా ఆయన వాటి గురించి ఎవరికీ సమాచారం ఎందుకు ఇవ్వలేదు? అసలు ఆయనకు అవి తన ఇంట్లో ఉన్నాయనే సంగతి అతనికి తెలుసా? ఆ కలెక్షన్ ఆయనదేనా? లేదా ఆయన పూర్వికులదా? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: ఇద్దరు యువకులకు పెళ్లి చేసిన ఒడిశా వాసులు.. పాతికేళ్ల తర్వాత మళ్లీ, ఎందుకంటే?