Palak Paneer Lawsuit: అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్‌లో జరిగిన ఒక జాతి వివక్ష ఉదంతం, ఇద్దరు భారతీయ విద్యార్థుల సుదీర్ఘ పోరాటం తర్వాత సంచలన మలుపు తిరిగింది. కేవలం ‘పాలక్ పనీర్’ వేడి చేసినందుకు ఎదురైన అవమానంపై కోర్టుకెక్కిన ఈ విద్యార్థులు, ఏకంగా రూ. 1.8 కోట్ల (2,00,000 డాలర్లు) పరిహారాన్ని గెలుచుకున్నారు.
ఈ ఘటన సెప్టెంబర్ 2023లో జరిగింది. కొలరాడో విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తున్న ఆదిత్య ప్రకాష్ (34) తన మధ్యాహ్న భోజనమైన పాలక్ పనీర్‌ను డిపార్ట్‌మెంట్ మైక్రోవేవ్‌లో వేడి చేస్తుండగా, అక్కడి ఒక సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఆహారం ‘ఘాటైన వాసన’ వస్తోందని, ఇకపై మైక్రోవేవ్‌లో దానిని వేడి చేయవద్దని ఆమె ఆదేశించారు. దీనికి ఆదిత్య స్పందిస్తూ.. “ఇది కేవలం ఆహారం మాత్రమే, నేను వేడి చేసుకుని వెళ్ళిపోతాను” అని బదులిచ్చారు.
ఈ చిన్న వివాదం కాస్తా పెద్దదిగా మారింది. ఆదిత్య మరియు అతని భాగస్వామి ఊర్మి భట్టాచార్య (35) తమపై వివక్ష జరుగుతోందని ఆరోపించారు. దీనికి ప్రతిస్పందనగా విశ్వవిద్యాలయ యంత్రాంగం వారిపై ప్రతీకార చర్యలకు దిగిందని వారు కోర్టులో పేర్కొన్నారు. ఆదిత్యను సీనియర్ ఫ్యాకల్టీ పదేపదే మీటింగ్‌లకు పిలిచి, అతను సిబ్బందికి ‘అభద్రతా భావం’ కలిగిస్తున్నాడని ఆరోపించారు. ఊర్మిని ఎటువంటి వివరణ ఇవ్వకుండానే ఆమె టీచింగ్ అసిస్టెంట్ పదవి నుంచి తొలగించారు. పాలక్ పనీర్ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఊర్మి, మరికొందరు భారతీయ ఆహారం తిన్నందుకు వారిని అల్లర్లను ప్రేరేపిస్తున్నారని నిందించారు.
విశ్వవిద్యాలయం వారి మాస్టర్స్ డిగ్రీలను కూడా నిలిపివేయడంతో, ఈ జంట అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టులో సివిల్ హక్కుల దావా వేశారు. సుమారు రెండేళ్ల పాటు సాగిన ఈ చట్టపరమైన పోరాటం సెప్టెంబర్ 2025లో ఒక ఒప్పందంతో ముగిసింది. విద్యార్థులకు 2,00,000 డాలర్లు (సుమారు రూ. 1.8 కోట్లు) చెల్లించడానికి విశ్వవిద్యాలయం అంగీకరించింది. నిలిపివేసిన వారి మాస్టర్స్ డిగ్రీలను ప్రదానం చేసింది. అయితే, భవిష్యత్తులో వారు ఆ విశ్వవిద్యాలయంలో మళ్ళీ చదవడానికి లేదా పని చేయడానికి వీల్లేదని నిబంధన విధించింది.
ఈ నెలలోనే ఈ జంట భారత్‌కు తిరిగి వచ్చారు. తమ అనుభవంపై స్పందిస్తూ ఊర్మి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్వేగభరితమైన పోస్ట్ చేశారు. “ఈ ఏడాది నేను ఒక పోరాటం చేశాను. నా చర్మం రంగు, నా యాసతో సంబంధం లేకుండా.. నాకు నచ్చిన ఆహారం తినే స్వేచ్ఛ కోసం నేను పోరాడాను. అన్యాయం ముందు నేను తలవంచను.” అని ఆమె రాశారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వివక్షపై గళమెత్తిన ఈ భారతీయ విద్యార్థుల ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Read Also: కొత్త టెక్నాలజీ బ్యాటరీ లాంచ్ చేసిన ఓలా.. ధర, ఫీచర్స్ ఇవే