Lottery Ticket Sale In India: దేశంలో లాటరీ టికెట్లను చట్టబద్దంగా అమ్మే రాష్ట్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. కేంద్రహోంశాఖ.. లాటరీల నియంత్రణ చట్టం 1998 సెక్షన్ 4లోని కొన్ని నిర్దిష్ట షరతులకు లోపబడి లాటరీలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతిస్తుంది. ప్రస్తుతం దేశంలో సుమారు 9 రాష్ట్రాల్లో లాటరీలను నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. షరతులకు లోబడి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాటరీలను నిర్వహించవచ్చని వెల్లడించింది.
లాటరీలు చట్టబద్దంగా అమ్మే రాష్ట్రాలు
ప్రస్తుతం దేశంలోని ఈ 9 రాష్ట్రాలు లాటరీలను చట్టబద్దంగా అమ్ముతున్నాయి. అవేంటంటే..
1.అరుణాచల్ ప్రదేశ్
2.గోవా
3.కేరళ
4.మహారాష్ట్ర
5.మిజోరం
6.నాగాలాండ్
7.పంజాబ్
8.సిక్కిం
9.పశ్చిమ బెంగాల్
లాటరీ నియంత్రణ నియమాలు
లాటరీల నియంత్రణ కోసం లాటరీల నియంత్రణ చట్టం 1998ని తీసుకొచ్చింది. నిబంధనలకు అనుగుణంగా లాటరీలను నిర్వహించుకునే అవకాశం రాష్ట్రాలకు ఉన్నట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది. అన్ని రాష్ట్రాలకు ఆన్ లైన్ లాటరీల నిర్వహణకు ఉపయోగించే హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ స్టాండర్డైజేషన్, టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ డైరెక్టరేట్(STQC) ద్వారా ధృవీకరించబడి ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆన్ లైన్ ద్వారా ఫ్రాడ్స్ జరుగుతున్న నేపథ్యంలో.. చాలా రాష్ట్రాలు ఆన్ లైన్ లాటరీల అమ్మకాన్ని నిషేధించాయి.
తెలుగు రాష్ట్రాల ప్రజలు లాటరీ టికెట్లు కొనవచ్చా?
ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ నియంత్రణ చట్టం ప్రకారం.. చట్టబద్దత ఉన్న రాష్ట్రాల్లోని లాటరీ టికెట్లను ఇతర రాష్ట్రాల్లో అమ్మకూడదు. అయితే, ఇతర రాష్ట్రాల ప్రజలు ఆయా రాష్ట్రాలకు వెళ్లి టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ వాళ్లు ప్రైజ్ మనీ గెలిస్తే అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి ప్రైజ్ మనీని పొందే అవకాశం ఉంటుంది. లాటరీ నియమాల ప్రకారం, లాటరీ డబ్బును క్లెయిమ్ చేసుకోవడానికి లాటరీ టికెట్ అనేది కచ్చితంగా ఉండాల్సందే. లాటరీని క్లెయిమ్ చేయడానికి లాటరీ ఆఫీస్ లో ఒరిజినల్ టికెట్ ను తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది.
లాటరీ అమౌంట్ ఎలా పొందాలంటే?
లాటరీ విజేత అసలు టికెట్ ను సంబంధిత అధికారులకు సమర్పించినప్పుడు మాత్రమే ప్రైజ్ మనీ అందిస్తారు. ఈ డబ్బును క్లెయిమ్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లలో లాటరీ గెలుచుకున్న ఒరిజినల్ టికెట్, ఫారమ్ నంబర్ VIIIలో స్టాంప్ చేసిన రసీదు, గెజిటెడ్ అధికారి సర్టిఫై చేసిన డాక్యుమెంట్ లేదంటే నోటరీ, 2 రీసెంట్ పాస్ పోర్ట్ సైజు ఫోటోలతో పాటు ఓ గుర్తింపు కార్డు ఉండాలి. గుర్తింపు కార్డులలో పాస్ పోర్ట్, రేషన్ కార్డ్, ఎలక్షన్ ఐడెంటిటీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. అన్ని ఆధారాలు సమర్పించిన తర్వాత డబ్బును విజేత బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేస్తారు. ఆదాయపు పన్ను, ఏజెంట్ కమీషన్ మినహాయింపు తర్వాత విన్నర్ మిగతా ప్రైజ్ మనీని పొందే అవకాశం ఉంటుంది. విన్నర్ లాటరీ గెలుచుకున్న టికెట్ డ్రా డేట్ నుంచి 90 రోజులలోపు సంబంధిత అధికారులకు సమర్పించాలి. 90 రోజుల వరకు టికెట్ ను సమర్పించకపోతే, దానిని చెల్లనిదిగా పరిగణించే అవకాశం ఉంటుంది.
Read Also: ఇదెక్కడి దొంగతనం రా బాబూ.. రైల్వే స్టేషన్ లో యువకుడికి ఊహించని షాక్!