BIG TV LIVE Originals: చారిత్రక భవనాలు మంటల్లో చిక్కుకుని కాలిపోతే.. ఎవరైనా బాధపడుతారు. అయ్యో, ఎందుకు ఇలా జరిగింది? అని ఆవేదన వ్యక్తం చేస్తారు. కానీ, తాజాగా అమెరికాలో ప్రముఖ వెడ్డింగ్ డెస్టినేషన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎన్నో వేలాది జంటలు ఒక్కటైన ఆ ప్రదేశం కాలి బూడిద అయ్యింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ఫైర్ ఇంజిన్లు సైతం ఆర్పలేకపోయాయి. కొద్ది గంటల్లో వివాహ వేదిక సహా ఆ ప్రాంతం అంతా కాలిపోయింది. ఆ వివాహ వేదిక కాలిపోవడం వల్ల ప్రజలు బాధపడాల్సింది పోయి.. సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. ఎందుకలా.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
నోట్ వే ప్లాంటేషన్ ప్రమాదం పట్ల ప్రజల సంబురాలు
అమెరికాలోని లూసియానా ప్రాంతంలో నోట్ వే ప్లాంటేషన్ అనే ప్రముఖ రిసార్ట్ ఉంది. అక్కడ ఇప్పటి వరకు ఎన్నో పెళ్లిళ్లు జరిగాయి. వేల జంటలు ఒక్కటయ్యాయి. పలు ఇతర కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మే 15న నోట్ వే ప్లాంటేషన్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో వివాహ వేదికతో పాటు పరిసర ప్రాంతాలు మంటల్లో కాలి బూడిద అయ్యాయి. ఈ వివాహ వేదిక కాలిపోవడంతో నల్లజాతి అమెరికన్లు సంబురాలు చేసుకున్నారు. బాగా అయ్యిందంటూ వేడుకలు నిర్వహించుకున్నారు. ఒక చారిత్రక భవనం కాలిపోతే సంబరాలు ఏంటి? అని చాలా మందికి అనుమానం కలగవచ్చు. కానీ, అక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
న్యాయం జరిగిందంటున్న నల్ల జాతీయులు
నోట్ వే ప్లాంటేషన్ కాలిపోవడం పట్ల నల్లజాతీయు సంబురాలు జరుపుకోవడం వెనుక పెద్ద కథ ఉంది. ఈ భవంతి 1859లో చక్కెర తోటల వ్యాపారి జాన్ హాంప్డెన్ రాండోల్ఫ్ నిర్మించారు. ఆయన వందలాది మంది ఆఫ్రికన్లను బానిసలుగా మార్చుకుని తన చెరుకు తోటలలో పని చేయించుకునే వాడు. ఆఫ్రికన్ల బలవంతపు శ్రమతోనే నోట్ వే ప్లాంటేషన్ భవనాన్ని కూడా నిర్మించాడు. అమెరికా సౌత్ లో మిగిలి ఉన్న అతి పెద్ద పురాతన భవనం ఇదే. మొత్తం 53,000 చదరపు అడుగులకు పైగా ఈ భవంతి విస్తరించి ఉంది. ఈ చారిత్రాత్మక ప్రదేశాన్ని నల్ల జాతీయులు తమ పూర్వీకుల చెమటలో నిర్మించారని భావిస్తారు. తమ చెమట చుక్కలతో నిర్మించిన ఈ భవనాన్ని పెళ్లి వేడుకల కేంద్రంగా మార్చడాన్ని తట్టుకోలేకపోతున్నారు. తాజాగా ఈ రిసార్ట్ మంటల్లో కాలి బూడిద కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆనందంలో డ్యాన్సులు చేస్తున్నారు.
కొంత మంది అమెరికన్లు చారిత్ర భవనం కాలిపోవడం పట్ల బాధపడుతున్నా, చాలా మంది నల్లజాతీయులు మాత్రం ఈ ఘటన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు తమ కోపం చల్లారిందంటున్నారు. ప్రజలను మోసం చేసి కట్టిన కట్టడాలు ఎప్పటికైనా కూలిపోక తప్పదు అని చెప్పేందుకు నోట్ వే ప్లాంటేషన్ రిసార్ట్ ఓ నిదర్శనం అంటున్నారు. కాస్త ఆలస్యం జరగవచ్చు. కానీ, అన్యాయంపై న్యాయం ఎప్పటికైనా విజయం సాధించడం ఖాయం అంటున్నారు. సోషల్ మీడియా అంతా ఇప్పుడు నోట్ వే ప్లాంటేషన్ చర్చే జరుగుతోంది.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: ఈ ఒక్కడికే 1700 గదుల భవనం.. ఖరీదైన 600 రోల్స్ రాయిస్ కార్లు.. అంత సంపాదన ఎలా?