ఏ సందర్భంగా అందమైన పాట వింటే చాలు హాయిగా అనిపిస్తుంది. సంగీతం మన భావోద్వేగాలను ఆనందంగా మారుస్తుంది. బాధను తగ్గించుకోవడానికి గొప్ప మార్గంగా సంగీతాన్ని ఎన్నుకుంటారు. ఎంతోమంది మనశ్శాంతిగా జీవించడం కోసం ప్రతిరోజూ పాటలు వింటారు. అయితే చరిత్రలో ఒక పాట మాత్రం విచారానికి, బాధకు కారణమైంది. ఈ పాట విన్న తర్వాత 100 మందికి పైగా ప్రజలు ఆత్మహత్య చేసుకున్నట్టు చరిత్ర చెబుతోంది. ఈ పాట విన్న వెంటనే ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు నమోదయ్యాయి. ఆ పాట పేరు ‘గ్లూమీ సండే’.
తీవ్రంగా బాధపెట్టే పాట
గ్లూమీ సండే’ అనే పాటను హంగేరీకి చెందిన ప్రముఖ గాయకుడు రెజ్సో సిరీస్ తన ప్రియురాలు జ్ఞాపకార్థం 1933లో రాశాడు. 1935లో ఆ పాట ప్రజల్లోకి వచ్చింది. ప్రియురాలు తనను విడిచిపెట్టి వెళ్లడంతో రెజ్సో సిరీస్ తన బాధను, మాటల ద్వారా పాటగా మార్చాడు. ఈ పాటలోని సాహిత్యం ఎంతో బాధాకరంగా ఉంటుంది. హృదయాలను ద్రవించేలా చేస్తుంది. పాట విన్నాక హృదయం తీవ్రంగా కలత చెందుతుంది.
వరుసపెట్టి ఆత్మహత్యలు
గ్లూమీ సండే పాట విడుదలయ్యాక ఆత్మహత్యల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది. మొదట 1935లో ఒక చెప్పులు కుట్టే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు సూసైడ్ నోట్ లో గ్లూమి సండే పాటలోని చరణాలు రాసి ఉన్నాయి. ఆ తర్వాత కూడా చాలామంది ఆత్మహత్య చేసుకోవడం మొదలుపెట్టారు. దానికి గ్లూమీ సండే పాటే కారణమని బయటపడింది. ఆత్మహత్య కేసులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. చాలామంది నీటిలో దూకి, గన్ తో పేల్చుకొని ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఆత్మహత్యల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ఈ పాటను 1941లోనే నిషేధించారు. దీనికి సూసైడ్ సాంగ్ గా పేరు పడింది. అయితే 2003లో గ్లూమీ సండే అంటే పాటపై నిషేధాన్ని ఎత్తివేశారు. కానీ ఒక హెచ్చరికను మాత్రం ఆ పాట మొదలయ్యే ముందు వస్తుంది.
ఈ పాటపై పరిశోధనలు కూడా జరిగాయి. ఈ పాటను హంగేరియన్ భాషలో రాశారు. హంగేరీ దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఈ పాట విడుదలయ్యింది. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంటే ప్రజలు కూడా ఆర్థికంగా చితికిపోయి ఉంటారు. సామాజికంగా ఎన్నో ఇబ్బందులు పడతారు. ఆ సమయంలో వారిపై ఒత్తిడి కూడా ఉంటుంది. డిప్రెషన్ బారిన త్వరగా పడే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో గ్లూమీ సండే పాట రావడం వారిని మరింత దుఃఖంలోకి నెట్టింది.
ఈ పాట జీవితంలోని సమస్యలను, నిరాశలను, పేదరికాన్ని, యుద్ధాన్ని, ఒంటరితనాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. దాంతో ప్రజలు ఆ పాటలో తమను తామే ఊహించుకొని విపరీతంగా బాధపడ్డారు. తీవ్రమైన డిప్రెషన్ కు లోనయ్యారు. చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక పాట ఇలా మనుషుల ప్రాణాలు తీస్తుందని ఎవరూ అనుకోలేదు. అందుకే చరిత్రలో ఈ హంగేరీ పాట నిలిచిపోయింది.