Miss World 2025 Winner: ఒక్కసారి ఊహించండి.. 16 ఏళ్ల వయస్సులో బ్రెస్ట్ లంప్ అరుదైన వ్యాధి వచ్చిందని డాక్టర్లు చెబితే? ఎంత భయంగా ఉంటుంది! కానీ, అదే వయసులో ఆ గడ్డను తొలగించే ఆపరేషన్ చేయించుకుని, తర్వాతి కొన్నేళ్లలో ప్రపంచ అందాల తలుపులు తట్టి మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంటే? ఇదే అసలు మిస్టరీ థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్ శ్రీ జీవితంలో.
ఫుకెట్‌లో జన్మించిన ఓపల్ చిన్ననాటి నుంచే తెలివిగా, ఆసక్తిగల యువతి. పాఠశాల చదువుల్లోనూ, భాషల్లోనూ ఆమెకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. ఇంగ్లీష్, థాయ్, చైనీస్ భాషల్లో మాట్లాడగలగడం ఆమెకు ప్రత్యేకంగా నిలిచింది. బ్యాంకాక్‌లోని ప్రముఖ స్కూల్‌లో చదివిన ఆమె ప్రస్తుతం థామసాట్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో బాచిలర్స్ డిగ్రీ చేస్తున్నది. చదువుల్లో ఆమెకు ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ, ఆరోగ్య సమస్యలు మాత్రం ఆమెను చిన్ననాటి నుంచే బాధించాయి.
బాల్యం..
ఓపల్ 2003 సెప్టెంబర్ 20న థాయిలాండ్‌లోని ఫుకెట్ నగరంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు హోటల్ వ్యాపారంలో ఉన్నారు. చిన్ననాటి నుంచే ఆమె మల్టీ లాంగ్వేజ్ వాతావరణంలో పెరిగారు. ఫలితంగా థాయ్, ఇంగ్లీష్, చైనీస్ భాషల్లో ప్రావీణ్యం సాధించారు. బ్యాంకాక్‌లోని ట్రియామ్ ఉదోమ్ సుక్సా స్కూల్‌లో చైనీస్ స్టడీస్‌లో మేజర్ చేశారు. ప్రస్తుతం థామసాట్ యూనివర్సిటీలో పాలిటికల్ సైన్స్‌లో ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో బాచిలర్స్ డిగ్రీ చేస్తున్నారు.
16 ఏళ్లకే ఆపరేషన్..
16ఏళ్ల వయస్సులో ఓపల్‌కు బ్రెస్ట్‌లో ఓ గడ్డ (లంప్) కనిపించింది. కుటుంబసభ్యులు వెంటనే డాక్టర్లను సంప్రదించారు. ఆ గడ్డ అనేది ప్రాథమిక దశలో ఉండటం వల్ల హానికరం కాదు అని తేలింది. కానీ ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఓపాల్ చిన్నదే. అయినా ధైర్యంగా ముందుకు వచ్చి ఆ ఆపరేషన్‌ను ఎదుర్కొంది. ఈ అనుభవమే ఆమె జీవితాన్ని మలిచింది.
ఆమె మనస్సులో ఓ ఆలోచన వచ్చింది.. ఇదే స్థితి మరో అమ్మాయికి వస్తే, ఆమెకు ఎలా చెప్పాలి? ఏమి చేయాలి? అలాంటి వారికి సహాయం చేయాలంటే ఏం చేయాలి? అంటూ.. ఆ ఆలోచనలే ఆమెను Opal For Her అనే ప్రచారాన్ని ప్రారంభించడానికి దారితీశాయి. ఈ ప్రచారం ద్వారా ఆమె బ్రెస్ట్ ఆరోగ్యం, ముందస్తు పరీక్షల అవశ్యకత, యువతిలో అవగాహన పెంపుదలపై చైతన్యం పెంచేందుకు పని చేస్తోంది. ఒక సమస్యను అవకాశం చేసిన ఓపల్ ఇక్కడే ఆగలేదు.
అందాల పోటీలు అంటే బహుశా కొన్ని దేశాలకు పరిమితం అయ్యే ఆట అని అనుకునే వారికి, ఓపాల్ చూపించింది. అందం అనేది శరీరంతో పాటు ఆత్మదీ కావాలని ఆమె నిరూపించి 2024లో మిస్ యూనివర్స్ థాయిలాండ్ టైటిల్ గెలుచుకుంది. తర్వాత అదే సంవత్సరంలో మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొని మూడవ రన్నర్-అప్‌గా నిలిచింది. కానీ ఆమె లక్ష్యం అక్కడ ఆగలేదు.
Also Read: Miss World 2025: మిస్ వరల్డ్‌ను గెలుచుకున్న థాయిలాండ్ సుందరీ..
2025లో మిస్ వరల్డ్ థాయిలాండ్ టైటిల్ గెలిచిన ఆమె, మే 31న హైదరాబాద్‌లో జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీలో విజేతగా నిలిచింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 108 మంది అందాల రాణులను ఆమె ఎదిరించి, తన తెలివి, సమాజంపై చూపిన కృతజ్ఞతతో, తన హృదయాన్ని ముందు పెట్టి మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుంది. ఓపల్ విజయం కేవలం అందానికి కాకుండా, ఆత్మవిశ్వాసానికి గుర్తింపుగా నిలిచింది.
ఓ చిన్న వయసులో ఎదురైన ఆరోగ్య సమస్యను భయపడకుండా ఎదుర్కొని, దానినే తన బలంగా మార్చుకుని, ఆ అనుభవాన్ని వేలమంది యువతులకు చేరవేసే ఉద్యమంగా మార్చిన ఓపల్ జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. మిస్ వరల్డ్ గెలవడం ఆమె జీవితంలో ఘనత మాత్రమే కాదు, ఆమె లాంటి యువతులు ఎలా ఉండాలో చూపించే మార్గదర్శకత కూడా.
ఒక్కమాటలో చెప్పాలంటే.. ఓపల్ కథ ఒక ఆపరేషన్‌తో మొదలై, ఓ ప్రపంచ విజయంతో ముగిసింది కాదు.. ఇంకా ఎన్నో అమ్మాయిల జీవితాల్లో వెలుగును నింపేందుకు ఆమె ప్రయాణం కొనసాగుతోంది. మిస్ వరల్డ్ కిరీటానికి మించిన గౌరవం అదే!