ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్.. చివరకు డాగ్ స్క్వాడ్ కూడా మనకు తెలుసు. కానీ ర్యాట్ స్క్వాడ్ మీకు తెలుసా..? సైన్యంలో అసలు ఎలుకల్ని ఎలా ఉపయోగిస్తారో మీరు ఊహించగలరా..? మన దేశంలో ఈ ఆనవాయితీ లేదు కానీ, కాంబోడియా వంటి దేశాల్లో సైన్యం ఎలుకల్ని కూడా ప్రత్యేకంగా పెంచుతుంది. ఈ ర్యాట్ ఫోర్స్ వల్ల కాంబోడియా ఆర్మీకి చాలా ఉపయోగాలున్నాయి. సరిహద్దుల్లో శత్రు మూకలు దాచి పెట్టిన ల్యాండ్ మైన్ లను ఇవి గుర్తిస్తాయి. తద్వారా ఆర్మీ చేయాల్సిన పనిని ఇవి సులభంగా పూర్తి చేస్తాయి. ల్యాండ్ మైన్స్ ని వెతకడానికి అవసరమైన ట్రైనింగ్ ఇస్తే ఈ ఎలుకలే ఆ పని పూర్తి చేస్తాయి.
హీరో ర్యాట్స్..
కాంబోడియా సైన్యం పెంచే ఎలుకల్ని హీరో ర్యాట్స్ అంటారు. ఇవి సాధారణ రకం ఎలుకలు కావు. ఆఫ్రికన్ జెయింట్ పౌచ్డ్ ర్యాట్స్ ఇవి. మామూలు ఎలుకలకంటే ఇవి కాస్త పెద్దవి. అంటే దాదాపు పిల్లిలాగా ఉంటాయి. వీటి పొడవు దాదాపు 50 సెంటీమీటర్లు ఉంటుంది. దాదాపు అంతే పొడవున్న తోక కూడా ఉంటుంది. వాసన పసిగట్టడంలో ఇవి ఎక్స్ పర్ట్స్. సాధారణ ఎలుకలు ఇళ్లలో ఆహార పదార్థాలు ఎక్కడున్నాయో వాసనచూసి పసిగడతాయి. రాత్రి వేళల్లో ఇంట్లో తిరుగుతూ ఆహార పదార్థాలను తింటాయి. ఈ లక్షణమే యుద్ధరంగంలో కూడా సైనికులకు ఉపయోగపడుతుంది. అయితే ఈ హీరో ర్యాట్స్ కి అలాంటి శక్తి సామర్థ్యాలు మరింత ఎక్కువ. ఇవి పేలుడు పదార్థాలను వాసన చూసి పసిగడతాయి. అలా.. సరిహద్దుల్లో పాతిపెట్టిన ల్యాండ్ మైన్స్ ని ఇవి కనిపెడతాయి.
కాంబోడియా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్..
శత్రు దేశాలు ప్రయోగించే మిసైల్స్ కంటే ల్యాండ్ మైన్స్ వల్ల సైన్యానికి ఎక్కువ నష్టం జరుగుతుంది. సరిహద్దుల్లో శత్రు మూకలు ల్యాండ్ మైన్స్ ని పెట్టి ఉంచుతాయి. ఒకసారి దానిపై కాలు పెడితే.. ఇక వారి ప్రాణం పోయినట్టే లెక్క. అందుకే ల్యాండ్ మైన్స్, నేలలో దాచి ఉంచిన TNT వంటి పేలుడు పదార్థాలను కనిపెట్టేందుకు ప్రత్యేకంగా బాంబ్ స్క్వాడ్ ఉంటుంది. అయితే ఈ బాంబ్ స్క్వాడ్ ల్యాండ్ మైన్స్ ని కనిపెట్టే క్రమంలో కొన్నిసార్లు ప్రమాదాలకు గురి కావొచ్చు. కానీ అదే పని ఎలుకలతో చేయిస్తే.. ప్రమాదం జరిగినా సైన్యానికి ప్రాణ నష్టం ఉండదు. వాస్తవానికి ల్యాండ్ మైన్ పై ఎలుక ఎగిరి దూకినా అది పేలదు. వాటి బరువు అంత తక్కువగా ఉంటుంది. ఇక వాసనతో అవి ల్యాండ్ మైన్స్ ని పసిగడతాయి కాబట్టి.. సైన్యం వాటిని గుర్తించి నిర్వీర్యం చేస్తుంది. అందుకే సరిహద్దుల్లో కాంబోడియా సైన్యం ఇలాంటి ఎలుకల్ని పెంచుతుంది. ఉక్రెయిన్, ఇజ్రాయెల్ తోపాటు ఇతర యూరోపియన్ దేశాల్లో కూడా ర్యాట్ ఫోర్స్ ఉంది.
మెటల్ డిటెక్టర్లకు బదులుగా..
ఒక టెన్నిస్ కోర్ట్ వైశాల్యం ఉన్న ప్రాంతంలో మందుపాతరలను కనిపెట్టడానికి సైన్యానికి దాదాపు వారం రోజులు పడుతుంది. ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఎక్కువ. కానీ అదే పని ఎలుకలు చేస్తే 30నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేస్తాయి. ప్రమాదం జరిగే అవకాశం బాగా తక్కువ. ఒకసారి శిక్షణ ఇస్తే.. వాటి జీవితకాలంలో, అంటే 6 నుండి 8 సంవత్సరాల పాటు వీటి సేవల్ని వినియోగించుకోవచ్చు. ఖర్చు తక్కువ, ప్రాణ నష్టం ఉండదు, పైగా కచ్చితత్వమైన సమాచారం ఇస్తాయి. అందుకే ర్యాట్ ఫోర్స్ కి వివిధ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. యుద్ధాల్లోనే కాదు, ఈ ఎలుకలు మానవ లాలాజలంలో క్షయవ్యాధి సూక్ష్మ జీవుల్ని కూడా వాసనతో పసిగడతాయట. అందుకే కొన్ని సందర్భాల్లో వీటిని మెడికల్ ఫీల్డ్ లో కూడా ఉపయోగిస్తారు. కొన్ని ప్రదేశాల్లో మెటల్ డిటెక్టర్లు చేయలేని పనిని ఈ ఎలుకలతో పూర్తి చేస్తారు.
విమానాశ్రయాల్లో కూడా
ఇక ఇజ్రాయెల్ అయితే.. ఈ హీరో ర్యాట్స్ ని విమానాశ్రయాల్లో ఉపయోగిస్తోంది. ప్రయాణికుల లగేజీల్లో పేలుడు పదార్థాలను పసిగట్టడానికి వీటిని వాడుతున్నారు. ఉగ్రవాద ముప్పులను ముందగానే గుర్తించడానికి వీటిని ఉపయోగిస్తున్నారు. రష్యా కూడా ఇలాంటి ఎలుకలకు శిక్షణ ఇస్తోంది. ఇరాన్ మాత్రం వీటిని దాడులకోసం ఉపయోగించడం విశేషం. శత్రు స్థావరాల్లోకి చొరబడటానికి, అక్కడికి వెళ్లి పేలుడు పదార్థాలను పేల్చి, ఆత్మాహుతి దాడులు చేయడానికి ఈ ఎలుకలను ఉపయోగించేదట ఇరాన్ సైన్యం.
భారత సైన్యంలో తేనెటీగలు..
భారత్ విషయానికొస్తే మనకు ర్యాట్ ఫోర్స్ లేదు కానీ, హనీబీ ఫోర్స్ ఉంది. అంటే తేనెటీగల సైన్యం. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని కంచెల వద్ద మనం ఈ తేనెటీగలను వాడుతున్నాం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 32వ బెటాలియన్ ఎక్కువగా వీటిని ఉపయోగిస్తోంది. పశ్చిమ బెంగాల్ లోని నాడియా జిల్లాలో బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ముళ్ల కంచెలకు తేనెటీగల తొట్టెలను తగిలిస్తుంది భారత సైన్యం. ఎవరైనా ఆ కంచె దాటి రావాలని చూస్తే ఆ తేనెటీగలు వారిపై దాడి చేస్తాయి. అంటే అక్రమ చొరబాట్లను మన సైన్యం ఇలా అరికడుతోందనమాట. వీటికోసం ఆ సమీపంలోనే తేనెటీగల ఆహారానికి కావాల్సిన మొక్కలను కూడా సైన్యం పెంచుతోంది. ఇక BSF సిబ్బందికి తేనెటీగల పెంపకంలో శిక్షణ కూడా ఇస్తున్నారు.
సముద్ర జంతువులతో రక్షణ
ఎలుకలు, తేనెటీగలే కాదు.. అవకాశం ఉన్నప్పుడు ఏ జంతువునైనా యుద్ధరంగంలో ఉపయోగించుకోవడం మానవులకు అలవాటే. పురాతన కాలంలో ఏనుగుల్ని కూడా యుద్ధాల్లో ఉపయోగించేవారు. శత్రు రాజుల కోటలను ఎక్కేందుకు ఉడుములను పైకి పంపించేవారు. ఆధునిక యుగంలో అలాంటి అవసరాలు లేవు కాబట్టి వేర్వేరు జంతువులను యుద్ధ రంగంలోకి దింపుతున్నారు. ఎలుకల్ని, తేనెటీగల్ని ఆర్మీలో ఉపయోగిస్తే.. నేవీ మాత్రం సముద్ర జీవుల్ని తెరపైకి తెస్తోంది. అమెరికా నేవీ మెరైన్ మామల్ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. అంటే డాల్ఫిన్లు, సీల్స్ ని పోలి ఉండే సీ లయన్స్ ని అమెరికా నేవీ పెంచుతోంది. వీటి ద్వారా నేవీ ఆస్తులను పరిరక్షిస్తారు. రాడార్లకంటే ఎక్కువ సమర్థంగా రేడియో ధార్మిక తరంగాలను డాల్ఫిన్లు పసిగట్టగలవు. అందుకే వీటిని ఉపయోగిస్తారు. సముద్రం అడుగున ఉన్న పేలుడు పదార్థాలను కూడా ఇవి గుర్తిస్తాయి. సముద్రంలో దిగే డైవర్ల రక్షణ కోసం కూడా వీటిని ఉపయోగిస్తారు. రష్యా కూడా సముద్రం అడుగున నిఘా కోసం డాల్ఫిన్ లను ఉపయోగిస్తోంది.