India First AI Teacher: ఈ టీచరమ్మ వస్తే ఆ స్కూల్ లో అందరూ సైలెంట్ గా ఉండాల్సిందే. స్టూడెంట్స్ అయితే మేడమ్ కోసం ఒకటే ఎదురుచూపులు. క్లాసులు స్టార్ట్.. మేడమ్ ఆపకుండా క్లాస్ తెగ చెప్పేస్తుంది. ఆమె చదువు చెప్పే స్టైల్ చూసి, అందరూ వావ్ అనేస్తున్నారు. ఔను.. ఇది నిజం. అయితే ఈ టీచరమ్మ ఎవరని అనుకుంటున్నారా? ఈమె ఎవరో కాదు ఒక రోబో టీచర్.
కేరళలోని ఒక ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు దేశమంతా చర్చకు కేంద్రబిందువవుతోంది. అక్కడ క్లాస్‌రూమ్‌లో పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్ మనుషులు కాదు.. ఒక రోబో. అది కూడా ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టీచర్ రోబో ‘ఐరిస్’ (IRIS). భారత్‌లో ఇదే తొలి ఏఐ టీచర్ రోబోగా నిలిచింది. పిల్లలకు పాఠాలు నేర్పించడంలో, సందేహాలు నివృత్తి చేయడంలో కూడా ఇది సమర్థంగా పనిచేస్తోంది.
2024లో ప్రారంభమైన ఈ ప్రయోగం కేరళలోని తిరువనంతపురంలోని కన్వెంటు స్కూల్‌లో మొదలైంది. ఈ స్కూల్ విద్యలో కొత్తపుంతలు తొక్కేందుకు ముందుకొచ్చింది. సాంకేతికతను పిల్లలకు సమర్థంగా అందించాలనే లక్ష్యంతో Makerlabs అనే స్టార్ట్‌అప్ కంపెనీ సహకారంతో ఈ ఐరిస్ రోబోను క్లాస్‌రూమ్‌కు పరిచయం చేశారు. దీని డిజైన్ కూడా పూర్తిగా మన దేశ పౌరులు తయారు చేశారు.
ఈ రోబో స్పెషాలిటీ ఇదే!
ఐరిస్ రోబోకు 4 చక్రాలు ఉంటాయి. ఇది క్లాస్‌రూమ్‌లోకి చక్కగా ప్రవేశించి, విద్యార్థుల ముందు నిలబడి బోధన చేపడుతుంది. ఇది మొత్తం 8 భాషల్లో మాట్లాడగలదు. పిల్లల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని బోధన రీతిని మార్చగలదు. ఇక ఏఐ సపోర్ట్‌తో పిల్లల ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. కనెక్టెడ్ స్మార్ట్ స్క్రీన్, ఇంటర్నెట్ డేటాబేస్ ఆధారంగా లైవ్ సమాచారంతో కూడా పని చేస్తుంది.
పిల్లల మానసిక స్థితిని అంచనా వేసి వారిలో ఆసక్తి రేకెత్తించేలా బోధన చేయగలగడం, ఆటల ద్వారా నేర్పడం వంటి ప్రత్యేకతలు ఈ రోబోకు ఉన్నాయి. ఇది పిల్లల మాటలు అర్థం చేసుకునేలా తీర్చిదిద్దబడింది. facial expressions, voice tone వంటివి చదివి అందుకు తగిన స్పందన ఇస్తుంది. దీంతో పిల్లలూ, తల్లిదండ్రులూ, టీచర్లూ ఆశ్చర్యపోతున్నారు. ఒక రోబో అంటే భయపడాల్సిన అవసరం లేదని, అది కూడా ఓ ఫ్రెండ్లీ టీచర్ గా పనిచేస్తుందని విద్యార్థులు చెబుతున్నారు.
Also Read: Rail Coach Restaurant: ఆ రైల్వే స్టేషన్‌కి పరుగులు.. ట్రైన్ కోసం కాదు.. తిండికోసం!
పిల్లలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకునే వయసులోనే ఇలాంటి రోబో టీచర్లతో పరిచయం అవ్వడం వల్ల, భవిష్యత్తులో విద్యా రంగంలో ఏఐ ఎలా ఉపయోగపడుతుందో ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం దక్కుతోంది. ఇక టీచర్లకు ఇది అసిస్టెంట్‌లా పనిచేస్తుంది. పాఠాలు అర్థం కాలేకపోతున్నప్పుడు మరో కోణంలో, మరింత చక్కగా వివరిస్తుంది.
అయితే ఇందులో ఓ చర్చనీయాంశం కూడా ఉంది. మనుషుల స్థానాన్ని రోబోలు తీసుకుంటున్నాయా? టీచర్ల అవసరం లేకుండా పోతుందా? అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ ఈ స్కూల్ యాజమాన్యం మాత్రం ఐరిస్ రోబో టీచర్లకు ప్రత్యామ్నాయం కాదు. అది ఒక యంత్రం మాత్రమే. టీచర్ దగ్గర ప్రేమ, అనుభవం ఉంటుంది. రోబో దగ్గర సమాచారం ఉంటుంది. రెండూ కలిసే పిల్లల ఎదుగుదలకు దోహదపడతాయని తెలుపుతున్నారు.
ఇప్పటికే పలుచోట్ల నుండి ఇతర స్కూల్స్ కూడా ఇలాంటి ఏఐ టీచర్ రోబోలను అంగీకరించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ముఖ్యంగా పెద్ద నగరాల్లో ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలు ఈ టెక్నాలజీని పరిశీలిస్తున్నాయి. త్వరలోనే మరిన్ని రాష్టాలలో ‘ఐరిస్’ లాంటి రోబోలు క్లాస్‌రూమ్‌లలో కనిపించొచ్చునని సమాచారం.
ఈ ప్రయోగం విద్యారంగంలో సాంకేతిక విప్లవానికి నాంది కాబోతుందా? లేక టీచర్ పాత్రను కొత్త కోణంలో నిర్వచించబోతుందా? సమయం చెప్పాల్సిన విషయమే. కానీ ప్రస్తుతం మాత్రం ‘ఐరిస్’ అనే రోబో చిన్నారులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది.. పిల్లల కలల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళుతోంది!