చాలా మంది అభిమానులు తమ హీరో మీద ఉన్న అభిమానాన్ని రకరకాలుగా చూపించుకునే ప్రయత్నం చేస్తారు. వారి బర్త్ డేలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొంత మంది రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తే, మరికొంత మంది అభాగ్యులకు అన్నదానం చేస్తారు. ఇంకొంత మంది విద్యార్థులకు పుస్తకాలు, రోగులకు పండ్లు పంపిణీ చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా ఓ మహేష్ బాబు అభిమాని కూడా ఇదే పని చేశాడు. కానీ, కాస్త డిఫరెంట్ గా చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ‘వారణాసి’ సినిమా టైటిల్ రిలీజ్ వేడుకకు ఆయన ఆడి కారులో వెళ్లాడు. ఆయన కారులో వస్తుండగా చాలా మంది అభిమానులు ఆయన కారును ఫాలో అయ్యారు. అయితే, ఆ కారుకు సంబంధించి ఓ అభిమాని ఏమైనా చలాన్స్ ఉన్నాయేమో చెక్ చేశాడు. ఏకంగా రెండు చలాన్స్ కనిపించాయి. రెండు కూడా హైదరాబాద్ పీవీ ఎక్స్ ప్రెస్ హైవే మీద వెళ్తుండగా విధించినవే. ఓవర్ స్పీడ్ కారణంగానే ఆ రెండు చలాన్స్ జారీ చేశారు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు. మొత్తం రూ.2000 చలాన్ విధించడంతో పాటు మరో రూ.70 యూజర్ ఛార్జెన్స్ విధించారు. మొత్తంగా రూ. 2070 ఫైన్ ను సదరు అభిమాని ఫోన్ పే ద్వారా చెల్లించాడు. చివరకు పేమెంట్ రిసీట్ తీసుకుని… దాని మీద ‘వియ్ లవ్ యు బాబు’ అని రాశాడు. ఈ పేమెంట్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
అటు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మహేష్ ఫ్యాన్సా? మజాకా? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది ఈ వీడియోను చూసి సీరియస్ అవుతున్నారు. “ఇంట్లో అమ్మకు ఎప్పుడైనా ఒక చీర కొనిపెట్టాడేమో అడుగు బ్రో” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “పిచ్చొళ్ల గురించి వినడమే కానీ, చూడ్డం ఇదే మొదటిసారి” అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. పిచ్చితనం అని మరికొంత మంది అంటే, ఆ డబ్బును ఎవరికైనా సాయం చెయ్యొచ్చు కదా అని మరికొంత మంది మండిపడుతున్నారు. “పాపం మహేష్ బాబు దగ్గర చలాన్లు కట్టుకునే డబ్బు లేదు. అందుకే ఈ అభిమాని సాయం చేశాడు” అంటూ మరికొంత మంది సటైర్లు వేస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Read Also: రాంగ్ రూట్ లో వచ్చి.. ఆటోను ఢీకొట్టి అడ్డగోలు వాదన, కిలో మీటరు మేర ట్రాఫిక్ జామ్!