Telegram CEO 100 Children| టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన బిలియనీర్ పావెల్ డురోవ్.. తాజాగా షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. తనకు పుట్టిన 100 మందికి పైగా పిల్లల పేరిట తన ఆస్తి మొత్తం రాశానని చెప్పాడు. ఫ్రాన్స్‌కు చెందిన లే పాయింట్ మ్యాగజైన్‌తో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. 100 మందికి పైగా పిల్లలకు తాను తండ్రినని వారందరికీ తన సంపదను పంచాలని నిర్ణయించినట్లు చెప్పాడు. 40 ఏళ్ల వయసు ఉన్న పావెల్ ఇంటర్‌వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో ప్రస్తుతం కొన్ని అనిశ్చితులు నెలకొని ఉన్నాయని.. ఈ కారణంగానే తాను ఇప్పటికే తన వీలునామా రాసినట్లు ఆయన తెలిపారు. డురోవ్ కు పెళ్లి కాలేదు. అయితే ఆయనకు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారితో ఆయనకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. వారితో పాటు.. స్పెర్మ్ డొనేషన్ (వీర్య దానం) ద్వారా 12 దేశాలలో 100 మందికి పైగా పిల్లలు జన్మించారని చెప్పాడు. తనకు సహజంగా జన్మించిన పిల్లలైనా లేదా డొనేషన్ ద్వారా జన్మించిన పిల్లలైనా అందరికీ ఒకే హక్కులు ఉన్నాయని, వారి మధ్య ఎలాంటి భేదం లేదని ఆయన స్పష్టం చేశారు.
106 మంది పిల్లలకు 17 బిలియన్ డాలర్ల సంపద
డురోవ్ తన 106 మంది పిల్లలకు తన 17 బిలియన్ డాలర్ల సంపదను వారసత్వంగా ఇవ్వాలని చెప్పారు. అయితే, తన ఆస్తి నుంచి వచ్చే సంపద తన పిల్లలకు 30 ఏళ్ల తరువాత మాత్రమే డబ్బు అందుతుందని స్పష్టం చేశారు. తన పిల్లలు తమ సొంత కృషితో జీవితంలో ముందుకు ఎదగాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. సంపదపై ఆధారపడకుండా స్వతంత్ర వ్యక్తులుగా ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయం వారిని క్రమశిక్షణతో, స్వయం సమృద్ధితో జీవించేలా ప్రోత్సహిస్తుందని పావెల్ విశ్వాసం.
టెలిగ్రామ్ వివాదాలు
టెలిగ్రామ్.. ప్రపంచంలోని అత్యంత ప్రముఖ మెసేజింగ్ యాప్‌లలో ఒకటి, 1 బిలియన్ కంటే ఎక్కువ యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది. అయితే, డురోవ్ ఈ యాప్‌కు సంబంధించి కొన్ని చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటు్నాడు. టెలిగ్రామ్‌లో బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ పంపిణీ, యాప్ ద్వారా డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయని ఫ్రెంచ్ అధికారులు కేసు నమోదు చేశారు. అలాగే, చట్టపరమైన సమాచారం లేదా డాక్యుమెంట్లను అందించడంలో టెలిగ్రామ్ సహకరించలేదని వారు ఆరోపించారు. ఈ ఆరోపణలను డురోవ్ ఖండించాడు.
Also Read: చనిపోయిన విష సర్పం..మనిషిని కాటేసిన 5 నిమిషాల్లోనే.. అతడి రక్తంలో ఏముందంటే
పావెల్ డురోవ్ జీవనశైలి
40 ఏళ్ల డురోవ్ తన ధైర్యమైన, ఆశ్చర్యకరమైన చర్యలకు ఫేమస్. ఇటీవల ఈస్టర్ సందర్భంగా.. తన 11.1 మిలియన్ ఫాలోవర్లకు టెలిగ్రామ్‌లో ఒక మెసేజ్ ఇచ్చాడు. అందులో ఆయన చొక్కా లేకుండా కనిపించాడు. ప్రతి ఉదయం ఆయన 300 పుష్-అప్స్, 300 స్క్వాట్స్ చేస్తూ తనకు తాను టార్గెట్స్ పెట్టుకుంటానని చెప్పాడు. అలాగే, ఆయన మద్యం, కాఫీ, టీలకు దూరంగా ఉంటానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ జీవనశైలి ఆయన శారీరక, మానసిక దృఢత్వాన్ని ప్రతిబింబిస్తుంది.