Snake Dies After Bite| సాధారణంగా ఒక పాము మనిషికి కాటేస్తే ఆ మనిషి పాము విషం ప్రభావాన్ని బట్టి ఒక గంట నుంచి రెండు గంటల్లోపు చనిపోయే అవకాశం ఉంది. కానీ దీనికి భిన్నంగా ఒక మనిషిని కాటేశాక ఒక భయంకర విషం కలిగిన పాము చనిపోయింది. అది కూడా కేవలం అయిదు నిమిషాల్లోనే. ఈ ఘటన చాలా అరుదు అని నిపుణలు అభిప్రాయపడుతున్నారు. ఈ విచిత్ర ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లా ఖుడోసోడి గ్రామానికి చెందిన సచిన్ నాగ్‌పూరె అనే 25 ఏళ్ల యువకుడు ఒక కారు మెకానిక్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతడి కుటుంబానికి ఒక పొలం కూడా ఉంది. గత గురువారం అంటే జూన్ 19 ఉదయం సచిన్ తన పొలానికి ఉదయాన్నే వెళ్లినప్పుడు అక్కడ నడుస్తూ ఉండగా.. మొక్కల మధ్య నిద్రిస్తున్న ఒక నల్లని విషపూరితమైన పాముపై సచిన్ తెలియక కాలుమోపాడు. దీంతో ఒక్కసారిగా లేచిన ఆ సర్పం సచిన్ కాలుపై బలంగా కాటేసింది. ఈ ఘటన తరువాత సచిన్ గట్టిగా అరిచాడు. దీంతో ఆ పొలంలో ఉన్నవారు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఒక నల్లని పాము చూసి.. అది విషపూరితమైనదని చెప్పి.. వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.
అయితే అక్కడ మరో విచిత్రం జరిగింది. ఆ పాము అక్కడి నుంచి పారిపోలేదు. క్రమంగా ఆ పాము విలవిల్లాడుతూ అక్కడే ప్రాణాలు వదిలేసింది. ఇదంతా అయిదు నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. ఆ పాము చనిపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ పాము కాటేయడంతో సచిన్ ప్రాణాలకు ప్రామాదం పొంచి ఉండడం కారణంగా అతడిని వెంటనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సచిన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.
ఇలా ఒక విషపూరితమైన పాము మనిషిని కాటేయగానే చనిపోవడంపై.. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ రేంజర్ ధర్మెంద్ర బిసేన్ మాట్లాడుతూ.. ఇది చాలా చాలా అరుదుగా జరిగే ఘటన. ఒక విష సర్పం ఇలా మనిషిని కాటేయగానే చనిపోవడం వెనుక ఒక కారణం ఉందని తెలిపారు. ఆ పాము బలంగా కాటేసినప్పుడు దాని నోట్లో ఉండే విషపు సంచి రాపిడి వల్ల చిరిగిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే ఆ పాము వెంటనే మరణించే అవకాశం ఉంది. సచిన్ కేసులో కూడా ఇదే జరిగి ఉంటుందని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరోవైపు పాము మరణించడంపై సచిన్ మరో కారణం చెప్పాడు. అతని రక్తంలో కొన్ని మూలిక ఔషధాల ప్రభావం ఉందని దాని వల్లే పాము చనిపోయిందని అంచనా వేశాడు. తాను ప్రతిరోజు కొన్ని వన మూలికలతో చిడ్ చిడియా, పుల్సా, పిసుండి, జామూన్, మామిడి, తుఆర్, ఆజాన్, కారన్జీ, వేప లాంటి మూలికలతో పళ్లు తోముకుంటానని చెప్పాడు. ఇలా గత 7-8 సంవత్సరాలుగా చేస్తున్నానని చెప్పాడు.
Also Read: మహిళా ఉద్యోగి ఇంట్లో ఎవరూలేనప్పుడు దొంగ చాటుగా ప్రవేశించిన బాస్.. ఆమె రాగానే అండర్‌వేర్‌లో..
ఈ మూలికల ప్రభావం తన రక్తంలో ఉందని వాటి ప్రభావం కారణంగానే పాము చనిపోయిందని తెలిపాడు. ఆ మూలికల ప్రభావం కారణంగానే తనపై విషం సరిగా ప్రభావం చూపలేకపోయిందని అన్నాడు. ఆ పాముని ఫారెస్ట్ అధికారులు చెక్ చేయగా.. ఆ పాము డోంగర్‌బేలియా అనే విషపూరితమైన పాము అని తేలింది. ఈ పాము చాలా ప్రమాదకరమని.. పాము కాటు తరువాత మనిషి చనిపోయే అవకాశం చాలా ఎక్కువని చెప్పారు.