తలనుండి విషము ఫణికిని.. అంటూ సుమతీ శతకంలో ఓ పద్యం ఉంటుంది. పాముకు తలలో విషం ఉంటుందని, తేలుకు తోకలో విషం ఉంటుందని, మానవుడికి నిలువెళ్లా విషమేనని ఆ పద్యం తాత్పర్యం. విష జంతువులు అంటే పాము, తేలు వెంటనే గుర్తొస్తాయి. అయితే కళ్లలో విషాన్ని నింపుకున్న జీవి ఒకటి ఉంటుందని మీకు తెలుసా..? అవును ఈ సృష్టిలో ఓ జీవికి కంటిలో విషం ఉంటుంది. తనకు ప్రాణాపాయం అనుకున్నప్పుడు ఆ విషాన్ని అది రక్తం రూపంలో చిమ్ముతుంది. తనను తాను కాపాడుకుంటుంది. అదే హార్న్డ్ లిజర్డ్. ఈ ప్రపంచంలో అతి పెద్ద బల్లి కొమొడో డ్రాగన్ అయితే, అత్యంత విషపూరితమైన బల్లి హార్న్డ్ లిజర్డ్.. అంటే కొమ్ముల బల్లి.
సాధారణంగా మనం ఇళ్లలో చూసే బల్లులు ప్రమాదకరమైన జంతువులు కాదు. కానీ బల్లి పడిన ఆహారం మాత్రం విషపూరితం అంటారు. అయితే స్వతహాాగ విషపూరితమైన బల్లులు కూడా ఉంటాయి. అవే ఉత్తర అమెరికాలోని కొమ్ముల బల్లులు. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన బల్లులు ఇవి. మనం ఇళ్లలో చూసే బల్లుల సైజ్ లోనే ఉన్నా.. వీటికి కొన్ని ప్రత్యేకతలుంటాయి. వీటి తలపై రెండు కొమ్ములు ఉంటాయి. శరీరంపై మచ్చలు సహజ రక్షకాలుగా ఉంటాయి.
9 సెంటీమీటర్లు మాత్రమే పొడవు ఉండే అమెరికన్ హార్న్డ్ లిజర్డ్స్ వాటి పరిమాణం కంటే చాలా పెద్దవైన మాంసాహారుల్ని సైతం తరిమికొడతాయి. ప్రకృతి వాటికి అత్యంత అసాధారణమైన రక్షణ యంత్రాంగాన్ని ఇచ్చింది. ఆ రక్షణ యంత్రాంగం కళ్లద్వారా పనిచేయడం ఇక్కడ విశేషం. వాటి కళ్ళ నుండి అవసరం అనుకున్నప్పుడు రక్తాన్ని బయటకు పంపుతాయి. ఈ ప్రక్రియను ఆటో హెమరేజింగ్ అని పిలుస్తారు. ప్రమాదం పొంచి ఉన్నప్పుడు మాత్రమే ఇవి తమ కంటి నుంచి విషాన్ని బయటకు చిమ్ముతాయి. సుమారుగా వాటి శరీర పొడవుకి 9 రెట్లు ఎక్కువ దూరం వరకు రక్తాన్ని వెళ్లేట్లు చేస్తాయి. అది కూడా టార్గెట్ మిస్ కాకుండా రక్తాన్ని ఏ జంతువుపై పడాలో దానిపైనే పడేట్లు చేస్తాయి.
కొమ్ముల బల్లి కళ్లలో రక్తం నిల్వ ఉండదు. అది తలనుంచి శరీరంలోకి వచ్చే రక్త ప్రవాహాన్ని ఒకచోటకు చేర్చడం ద్వారా కళ్లనుంచి బయటకు వచ్చేలా చేస్తుంది. అకస్మాత్తుగా దాని రక్తపోటు పెరుగుతుంది. దాని కళ్ళ చుట్టూ ఉన్న చిన్న రక్త నాళాలు పగిలిపోయి రక్తం బయటకు వేగంగా వస్తుంది. సాధారణంగా బల్లులు ప్రమాదం ముంచుకొస్తే తమ తోక తెగేట్టుగా ప్రవర్తిస్తాయి. అలా తెగిన తోక కొట్టుకుంటూ ఉంటుంది. దాన్ని చూసి ఇతర జీవులు భయపడిపోతాయి. అయితే కొమ్ముల బల్లి కళ్లనుంచి రక్తాన్ని చిమ్మడం కేవలం రక్షణ తంత్రం మాత్రమే కాదు. శత్రువుని కేవలం భయపట్టడానికి మాత్రమే కాదు. ఆ రక్తంలో విషపూరిత రసాయనాలు ఉంటాయి, ఆ రసాయనాలు.. ఆ బల్లులను తినాలనుకునే జీవులకు తీవ్ర హాని కలుగజేస్తాయి.
కళ్లనుంచి విషం చిమ్మే లక్షణంతోపాటు ఈ బల్లి తలపై రెండు కొమ్ములవంటి స్పైక్స్ ఉంటాయి. ఈ బల్లుల్ని ఏ ఇతర జంతువైనా తినాలని దగ్గరకు వస్తే వాటికి ఆ స్పైక్స్ గుచ్చుకుంటాయి. ఇక ఈ బల్లుల శరీరంపై ఉండే మచ్చలు కూడా వాటికి సహజ రక్షణగా నిలుస్తాయి. ఇలా ఈ కొమ్ముల బల్లి, ప్రకృతిలో ఓ ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థను కలిగి ఉంటుంది.