Rajasthan News: తప్పులు చేసినవారికి పోలీసుల దగ్గర ట్రీట్‌మెంట్ వేరేగా ఉంటుందని చెబుతారు. సినిమాలు కూడా అలాగే చూపిస్తాయి. అదే తప్పు రౌడీ షీటర్ దగ్గర చేస్తే, ఆ శిక్షలు అత్యంత దారుణంగా ఉంటాయి. అదే చేశాడు ఓ రౌడీ షీటర్. ఓడ్రైవర్ చేసిన చిన్న తప్పుకు జీవితంలో కోలుకోని ట్రీట్‌మెంట్ ఇచ్చాడు. ఇంతకీ ఆ విషయం ఏంటో తెలుసుకుందాం.
రాజస్థాన్‌లోని బేవార్ జిల్లాలో తన దగ్గర పని చేసిన డ్రైవర్ చిన్న తప్పు చేశాడు. ఈ విషయం తెలిసి అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు రౌడీ సీటర్ తేజ్పాల్ సింగ్. వెంటనే డ్రైవర్‌ను పిలిచి తల కిందులుగా వేలాడ దీసి అత్యంత అమానుషంగా హింసించాడు. ఇకపై తప్పు చేయనని నెత్తి నోరూ మెత్తుకున్నా వినలేదు. పైగా దొంగకు కొట్టిన దెబ్బలపై ఉప్పు రుద్దాడు.
ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన ఫోన్‌లో షూట్ చేశాడు. దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఈ వ్యవహారంపై ఇంటా బయటా విమర్శలు తీవ్రమయ్యాయి. ఇలాంటి ట్రీట్మెంట్ ఎక్కడైనా ఉంటుందా? అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు సైతం ఈ విధంగా చేయరని అంటున్నారు.
ఇంతకీ ఆ దొంగ డ్రైవర్ చేసిన తప్పేంటి? కేవలం సిమెంట్ దొంగతనం చేశాడనే అనుమానంతో మాత్రమే ఈ శిక్ష వేశాడు. నిజంగా దొంగతనం గాని చేసి ఉంటే ఆ ట్రీట్‌మెంట్ మరో లెవల్‌లో ఉంటుందని అంటున్నారు. ఈ అమానుష ఘటనపై సమీపంలోని రాయ్‌పూర్ పోలీసులు నోరు విప్పారు.
ALSO READ: అఘోరీకి బెయిల్, మళ్లీ జైలుకే
డీజిల్, సిమెంట్ దొంగతనం చేశాడనే అనుమానంతో డ్రైవర్‌ను హింసించాడని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. రౌడీ షీటర్ తేజ్‌పాల్ ఒక ఫ్యాక్టరీని నడుపుతున్నాడు. దాదాపు రెండున్నర నెలల కిందట సిమెంట్ లోడుతో డ్రైవర్‌ను జైపూర్‌కు పంపాడని తెలిపారు. అక్కడ ఏం జరిగిందో, ఎవరు చెప్పాడో తెలీదని ఈ విధంగా హింసించాడని తెలిపారు.
బాధితుడు ఇంకా ఫిర్యాదు చేయలేదని, వెంటనే కేసు నమోదు చేస్తామని అంటున్నారు. ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది. అధికార బీజేపీపై దుమ్మెత్తి పోస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంతో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయని అన్నారు. మాఫియా పాలన ఇంకెంత కాలం సాగుతుందని ప్రశ్నిస్తున్నారు.