Naagin Rumours: ఉత్తర్ ప్రదేశ్ లోని ఔరైయా జిల్లాలో ఓ యువతి అదృశ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆమె నిద్రించిన మంచంపై 5 అడుగుల మేర కుబుసం ఉండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆ 20 ఏళ్ల యువతి నాగినిగా మారిపోయి.. ఇంటి నుంచి వెళ్లిపోయిందన్న పుకార్లు ఒక్కసారిగా గ్రామంలో వ్యాపించాయి. అయితే రంగంలోకి దిగిన పోలీసులు.. యువతి కోసం గాలిస్తున్నారు.
ఔరైయా జిల్లాలోని సింగన్ పూర్ గ్రామంలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 20 ఏళ్ల యువతి ఎప్పటిలాగే ఇంట్లోని తన గదిలోకి వెళ్లి నిద్రించింది. ఉదయం ఆమె గదిలోకి వెళ్లి తల్లి చూడగా.. మంచంపై యువతి కనిపించలేదు. పైగా ఆమె ఒంటిపై ఉన్న బంగారు వస్తువులు, బట్టలు మంచంపై పడి ఉన్నాయి. వాటి పక్కన 5 అడుగుల పొడవైన పాము చర్మం (కుబుసం) కూడా కనిపించింది. అది చూసి యువతి తల్లి.. ఒక్కసారిగా ఖంగు తింది.
యువతి అదృశ్యమైన వార్త స్థానికంగా దావానంలా వ్యాపించింది. యువతి మంచంపై కుబుసం ఉందని తెలిసి ఆమె పాముగా మారిపోయిందంటూ వదంతులు విస్తరించాయి. సదరు యువతి నాగినిగా మారి.. ఇంటి నుంచి వెళ్లిపోయిందంటూ గ్రామంలో పెద్ద ఎత్తున పుకార్లు చెలరేగాయి. దీంతో సింగన్ పూర్ గ్రామంలో నాగిని అంశం తీవ్ర కలవరాన్ని సృష్టించింది.
Also Read: Ponnam Prabhakar: మున్సిపల్ ఎన్నికల్లో.. గెలుపు కాంగ్రెస్ పార్టీదే.. మంత్రి పొన్నం ధీమా
తమ బిడ్డ అదృశ్యం కావడంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో స్థానిక పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారి మనోజ్ గంగ్వార్ మాట్లాడుతూ.. యువతి ఆచూకి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే యువతి పాముగా మారిందన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. సదరు యువతి ఇంటి నుంచి పారిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అందరినీ తప్పుదోవ పట్టించేందుకు ఇలా పాము కుబుసం పెట్టి డ్రామాకు తెరలేపి ఉండొచ్చని అంచనా వేశారు. యువతి ఫోన్ రికార్డ్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు మనోజ్ గంగ్వార్ వివరించారు.
Also Read: Front Load vs Top Load: వాషింగ్ మిషన్లలో ఎందుకీ తేడా? ప్రత్యేకతలు ఏంటి.. రెండింటిలో ఏది బెస్ట్?