అర్థరాత్రి వేళ మందు బాబులు రోడ్ల మీద చేసే నానా హంగామా గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. రేసింగ్ బైకులు, స్పోర్ట్స్ కార్ల మీద ఓ రేంజ్ లో దూసుకెళ్తూ ఇతర వాహనదారులను భయ భ్రాంతులకు గురి చేస్తారు. కొంత మంది తప్పతాగి అనేక రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా దుండిగల్ సమీపంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. శంబీపూర్ సమీపంలో పీకల దాకా తాగి ఇద్దరు యువకులు కారును అడ్డదిడ్డంగా నడిపారు. చివరకు కారును ఓ గోడ ఎక్కించారు.
గోడ ఎక్కిన కారు, నెట్టింట వీడియో వైరల్
అర్థరాత్రి సమయంలో ఇద్దరు యువకులు మద్యం సేవించి కారును అతివేగంగా నడిపారు. శంభీపూర్ కు రాగానే కారు అదుపు తప్పి, డివైడర్ ను ఢీకొట్టింది. వేగం ఎక్కువగా ఉండటంతో కారు జంప్ చేసి రోడ్డు పక్కనే ఉన్న ఇంటి గోడ మీద పడింది. ఈ ప్రమాద సమయంలో శబ్దం ఎక్కువగా రావడంతో ఇంట్లోని వాళ్లు బయటకు వచ్చారు. ఈ ఘటన చూసి, అంతా షాకయ్యారు. కారులోని ఇద్దరు యువకులకు గాయాలైనట్లు తెలిపారు.
కారును క్రేన్ తో కిందికి దింపిన పోలీసులు
ఇంట్లోని వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో కారును దింపారు. కారులోని యువకులు మద్యం మత్తులో ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నిద్ర మత్తులో కారు బీభత్సం.. ఏకంగా ఇంటి గోడపైకి ఎక్కించిన వ్యక్తి
మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
క్రేన్ సహాయంతో కారును దించిన ట్రాఫిక్ పోలీసులు pic.twitter.com/9MmVmrCaAh
— BIG TV Breaking News (@bigtvtelugu) July 25, 2025
ఫన్నీగా కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు
ఈ వీడియో కాసేపట్లోనే సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “పార్కింగ్ చేయడానికి ఎక్కడా స్థలం లేదా అన్నా, గోడ ఎక్కించావు?” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “అలా ఎలా ఎక్కించావు బ్రో” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “పీకల దాకా తాగితే, గోడ ఏముంది? ఏకంగా బిల్డింగే ఎక్కించవచ్చు” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.