Viral Video : పెళ్లంటే కొబ్బరి బొండాం తప్పనిసరి. అందంగా అలంకరించిన బొండాలు.. వధూవరుల చేతిలో మరింత అందంగా ఒదిగిపోతాయి. వివాహానికి వచ్చిన బంధువులకూ బొండాలు ఇవ్వడం కొన్నిచోట్ల ఆనవాయితీ. అయితే, ఓ ఫ్యామిలీలో మాత్రం విచిత్రమైన సంప్రదాయం ఉంది. కొబ్బరి బొండాన్ని పెళ్లికొడుకు తలపై పగలగొడతారు. బొండాం అయినా పగలాలి.. తలైనా పగలాలి.. అనే రేంజ్‌లో ఉందా ఉదంతం. ఆ వీడియో చూస్తే గూస్‌బంప్సే.
ఇదేం కల్చర్..?
కొబ్బరి కాయ కాదు.. ఏకంగా కొబ్బరి బొండాంతోనే తల మీద కొట్టే విడ్డూరం అది. కొబ్బరి బొండాం అంటే చాలా బరువే ఉంటుంది. దానితో కొడితే ఇంకేమైనా ఉందా? చేతిలో ఉన్న బొండాం జారి కాలి మీద పడితేనే వామ్మో అనాల్సిందే. అలాంటిది తల మీద కొడితే ఇంకెలా ఉంటుంది? తల పగిలిపోదూ? కానీ, వాళ్లు అదేమీ పట్టించుకొనే టైప్ కాదు. మా కల్చర్ ఇంతే. తలమీద బొండాం పగలగొట్టాల్సిందే అంటున్నారు. అది వాళ్లకు ఏళ్లుగా వస్తున్న సంప్రదాయమట. ఆ విషయం ముందుగా తెలుసో లేదో కానీ.. ఆ ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో ఓ యువకుడికి పెళ్లి ఫిక్స్ అయింది. పీటల మీద పెళ్లి తంతు మొదలైంది. అప్పుడు కనిపించింది ఆ కొబ్బరి బొండాం సీన్.
తలపై కొబ్బరి బొండాం పగిలేనా..?
సంప్రదాయం కదాని.. ఏదో ఫార్మాలిటీకి సుతిమెత్తగా తలకి మొట్టికాయ వేసినట్టు కొట్టడం కాదు. కొడితే కొబ్బరి బొండాం పగలాల్సిందే. తల మీద కొబ్బరి బొండాం పగలగొట్టడమంటే మాటలా? కొబ్బరి కాయ పగలాలంటేనే చాలా కష్టం.. అలాంటిది కొబ్బరి బొండాం రెండు ముక్కులు కావాలంటే..? అతని తలకాయ ఉంటుందా..?
పెళ్లికొడుకు షాక్..
పాపం ఆ పెళ్లి కొడుకు.. అప్పటికే పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. అప్పటికప్పుడు ఈ పెళ్లి తనకు వద్దంటూ లేచి పారిపోలేడు. అలాగని కొబ్బరి బొండాం దెబ్బలను కాచుకోలేడు. ఏం చేయాలో ఆలోచించే టైమ్ కూడా అతనికి ఇవ్వలేదు పెళ్లివాళ్లు. అతనిపై కాస్త జాలి చూపించి.. మరీ పెద్ద సైజు బొండాం కాకుండా.. కాస్త మీడియం సైజ్ లేత కొబ్బరి బొండాం తీసుకొచ్చారు. తల మీద కొట్టేందుకు సిద్ధమయ్యారు. అది చూసి పెళ్లి కొడుకు గుండె ఢమాల్. వామ్మో.. బొండాంతో తల మీద కొట్టడం ఏంట్రా దేవుడా అనుకున్నాడు. ఇక ఆ తంతు మొదలైపోయింది.
వరుడుకి కౌంట్‌డౌన్..
వరుడి తలపై మొదట కాస్త మెళ్లిగానే ఓ దెబ్బ కొట్టాడు వధువు తరుపు బంధువు. అలా కొడితే పగులుతుందా? రెండో దెబ్బకు కాస్త డోస్ పెంచాడు. అయినా పగలలేదు. మూడో దెబ్బ మరింత గట్టిగా కొట్టాడు. బొండాం పగలలేదు కానీ.. పెళ్లికొడుతు తలకు నొప్పి బాగానే తెలిసొచ్చింది. వామ్మో.. ఇది నావల్ల కాదని లేచిపోదామంటే అందరి ముందూ పరువు పోతుందేమో అనుకున్నాడు. పంటి బిగువున నొప్పి భరించసాగాడు. లేని ధైర్యం తెచ్చిపెట్టుకుని.. బాడీని బిగించి పట్టుకున్నాడు. అంతలోనే అతని తలపై నాలుగో దెబ్బ కూడా కొట్టేశాడు. టప్ మని సౌండ్ వచ్చింది కానీ, బొండాం పగలలేదు. ఐదో దెబ్బ మరింత ఈడ్చి కొట్టాడు. తల బొప్పి కట్టిందే కానీ.. బొండాంకు చీలిక కూడా రాలేదు. వరుడికి నొప్పి మామూలుగా లేదు. అసలే సున్నితమైన తలకాయ. ఆ కొబ్బరికాయ దెబ్బలను తట్టుకునేనా?
నోట్ల వర్షం.. దెబ్బలకు ఢాం..
కొట్టే అతను ఇక కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఐదు దెబ్బలు కొట్టినా ఇంకా బొండాం పగలలేదని మనోడు పంతానికి పోయినట్టున్నాడు. ఆ తర్వాత టపీ టపీ టపీ మంటూ మరో మూడు దెబ్బలు గట్టిగా కొట్టాడు. అయినా, నో యూజ్. ఎనిమిది దెబ్బలకు కూడా బొండాం ఇంకా పగలలేదు. పెళ్లికొడుకు ఉన్నాడో పోయాడో తెలీట్లేదు. ఉలుకూపలుకు లేకుండా అలానే బిగించి కూర్చున్నాడు. ఇక లాభం లేదనుకుని.. ఢాం ఢాం అంటూ ఒంట్లోని బలమంతా కూడ దీసుకుని.. బలంగా బాదేశాడు. అలా 10 దెబ్బలు పడ్డాక.. ఆ కొబ్బరి బొండాం రెండు ముక్కలైంది. ఆ తంతు ముగిసింది. అదేం ఆనందమో కానీ.. అలా పెళ్లికొడుకు తలమీద కొబ్బరి బొండాం కొడుతుంటే పక్కనే ఉన్న బంధువులు కరెన్సీ నోట్లను వరుడిపై విసురుతున్నారు. శెభాష్ అన్నట్టు నోట్ల వర్షంతో ఎంకరేజ్ చేశారు. దెబ్బలు తింటున్నోడికి తెలుస్తుంది ఆ బాధేంటో.. చూసే వాళ్లదేముందు.. ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ నోట్లు చల్లుతుండటం మరింత వింతగా ఉంది.
ఆచారమా? హత్యాయత్నమా?
అప్పటికే చచ్చేంత పనైంది ఆ పెళ్లికొడుక్కి. కానీ, చావలేదు. బతికే ఉన్నాడు. ఇలా బొండాం పగిలిందో లేదో.. అలా కొట్టినతని కాళ్ల మీద పడిపోయాడు వరుడు. ఇక చాల్లేరా అయ్యా అనుకున్నాడో ఏమో.. నన్ను వదిలేయమంటూ వేడుకున్నట్టు ఉంది ఆ సీన్. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదేం ఆచారంరా బాబూ అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇది ఎక్కడ జరిగిందంటూ ఆరా తీస్తున్నారు. మీ పిచ్చి సంప్రదాయం మీరు.. పెళ్లికొడుకు తల పగిలి ఉంటే ఏం చేస్తార్రా? అంటూ ప్రశ్నిస్తున్నారు. పెళ్లి వేడుక కాస్తా.. చావు ఘటనగా మారేదంటూ చాలామంది తప్పుబడుతున్నారు. ఆ పెళ్లి వాళ్లపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
?utm_source=ig_web_copy_link