Tirupati News: ఆ ఇంటికి కరెంట్ తో షాక్ కొట్టలేదు కానీ, కరెంట్ బిల్ తో షాక్ కొట్టింది. ఔను మీరు విన్నది నిజమే.. ఆ ఇంటికి వచ్చిన బిల్ చూసి, ఆ ఇంటి యజమాని ఖంగుతిన్నాడు. అదేదో రూ. 100 నుండి రూ. 300 బిల్ వచ్చిందనుకుంటే పొరపాటే. భారీ స్థాయిలో ఆ ఇంటికి బిల్ వచ్చింది. ఆ బిల్ చేతిలో పట్టుకున్న సదరు యజమాని, నేరుగా కరెంట్ ఆఫీస్ దారి పట్టాడు.
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం కోవూరుపాడు గ్రామంలో మారెయ్య అనే వ్యక్తి నివసిస్తున్నారు. ఈయన ఇంటికి గత ఏడాది డిసెంబర్ నెలలో రూ. 830 లు కరెంట్ బిల్ వచ్చింది. ఆ బిల్లును మారెయ్య చెల్లించారట. ఆ తర్వాత జనవరి నెల రానే వచ్చింది. రావడం రావడంతోటే షాకిచ్చింది. కరెంట్ బిల్ తీసేందుకు ఇంటికి విద్యుత్ సిబ్బంది వచ్చారు. అలా బిల్ తీసి, ఇలా చేతిలో పెట్టారట.
అప్పుడు బిల్ చూసిన మారెయ్య షాక్ తిన్నారు. కరెంట్ తగిలితే షాక్ కంటే, ఆ బిల్ ఇచ్చిన షాక్ కి దిమ్మతిరిగిందట మారెయ్యకు. ఇంతకు బిల్ ఎంత వచ్చిందో తెలుసా, అక్షరాల రూ. 47932 మాత్రమే. తన ఇంటికి ఏమిటి? ఈ బిల్ ఏమిటి అంటూ మారెయ్య లబోదిబోమన్నారు. అతనికి వచ్చిన కరెంట్ బిల్ చూసి, స్థానికులు కూడ ఆశ్చర్యపోయారు. ఇదేదో షాపులకు వచ్చినట్లు బిల్ రావడంతో, మారెయ్య వరదయ్యపాలెం విద్యుత్ సబ్ స్టేషన్ బాట పట్టాడు.
Also Read: TTD Chairman BR Naidu: ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ.. టీటీడీ చైర్మన్ ఏం చేశారంటే?
తనకు అధిక బిల్ వచ్చిందని, తాను అలా చెల్లించలేనంటూ మారెయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బిల్ చూసిన విద్యుత్ అధికారులు కూడ ఖంగుతిని, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారట. సాధారణంగా ఇలాంటి ఘటనలు జరగడం పరిపాటి. కానీ సామాన్య ప్రజానీకం అవగాహన లేక భయాందోళనకు గురవుతారు. విద్యుత్ శాఖ అధికారులు ఇటువంటి పొరపాట్లు జరగకుండ, ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని విద్యుత్ వినియోగదారులు కోరుతున్నారు. మరి మారెయ్య సమస్య పరిష్కారమవుతుందో, లేదో మరికొన్ని రోజులు వేచిచూడాలి.