AB Venkateswara Rao: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాజకీయ ప్రయోగం ఘోరంగా విఫలమైంది. వామపక్షాలు, కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగిన ఆయన కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. మొత్తం 4లక్షల 46వేల 21 ఓట్లు పోలవగా.. కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ 2లక్షల 65వేల 888 ఓట్లతో ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మికి లక్ష 35వేల 16 ఓట్లు రాగా, ఏబీవీకి కేవలం 12,642 ఓట్లు మాత్రమే లభించి డిపాజిట్ కూడా గల్లంతైంది.
పార్టీల మద్దతు ఉంటే సరిపోదు..
ఎన్నికల్లో కేవలం పార్టీలు మద్దతు ప్రకటించడం సరిపోదని, ఆ మద్దతు క్షేత్రస్థాయిలో ఓట్లుగా మారడంలోనే విజయం ఉంటుందని ఈ ఫలితాలు నిరూపించాయి. స్థానిక ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి ఇమేజ్‌తో పాటు డివిజన్ల వారీగా బలమైన యంత్రాంగం అవసరం. కాంగ్రెస్, వామపక్షాల మద్దతు ఉన్నప్పటికీ ఆయా పార్టీల ఓటు బ్యాంకు ఏబీవీకి బదిలీ కాలేదు. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలం, డివిజన్ స్థాయిలో నాయకుల సమన్వయం వంగవీటి రాధ విక్టరీకి రూట్ క్లియర్ చేశాయి.
ఏబీవీకి షాకిచ్చిన విజయవాడ ఓటర్లు
నగర సమస్యల పరిష్కారం, పన్నుల భారం తగ్గింపు లాంటి హామీలు ఇచ్చినా ఓటర్లు ఏబీవీ వైపు మొగ్గు చూపలేదు. ప్రత్యామ్నాయ రాజకీయాలు అంటూ ప్రచారం చేసినా క్షేత్రస్థాయి సమీకరణాలను అనుకూలంగా మార్చుకోవడంలో ఆయన ఫెయిలయ్యారు. నాయకులు, పార్టీల సపోర్ట్ ఉన్నంత మాత్రాన విజయం రాదని.. క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్, వ్యూహం లేకపోతే పరాజయం తప్పదని బెజవాడ మేయర్ తీర్పు మరోసారి స్పష్టం చేసింది.
Also Read: బెజవాడ బాద్‌షా వంగవీటి రాధా.. రికార్డు మెజారిటీతో మేయర్ పీఠం కైవసం!