Vangaveeti Radha: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోరులో వంగవీటి రాధాకృష్ణ ఘనవిజయం నమోదు చేశారు. కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన రాధా.. వైసీపీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మిపై లక్షా 30 వేలకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 4లక్షల 46వేల 21 ఓట్లు పోలవగా, రాధాకృష్ణకు 2లక్షల 65వేల 888 ఓట్లు లభించాయి. వైసీపీ అభ్యర్థికి లక్ష 35,016 ఓట్లు రాగా.. స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు 12,642 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
మళ్లీ మారుమోగిన రంగా పేరు..
బెజవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దివంగత వంగవీటి మోహనరంగా 1985లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన హత్యానంతరం 1989, 1994 ఎన్నికల్లో రత్నకుమారి వరుసగా విజయం సాధించారు. ఆ తర్వాత రత్నకుమారి టీడీపీలో చేరగా, 1999లో ఆ స్థానం నుంచి సినీ నటుడు కోట శ్రీనివాసరావు గెలుపొందారు. మోహనరంగా, రత్నకుమారిల వారసుడిగా రాధాకృష్ణ విజయం సాధించడంతో రంగా కుటుంబం పేరు మరోసారి మారుమోగుతోంది.
25 ఏళ్లకు ఎమ్మెల్యే.. 47 ఏళ్లకు బెజవాడ మేయర్!
25 ఏళ్ల చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టిన రాధాకృష్ణ.. ఇప్పుడు 47 ఏళ్ల వయసులో విజయవాడ మేయర్‌గా ఎన్నికవడం మరో స్పెషల్. జనసేన తరఫున పోటీ చేసి విజయం సాధించిన ఆయన.. విజయవాడ నగర సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. రంగా ఆశయ సాధనే లక్ష్యంగా బెజవాడ నగర ప్రథమ పౌరుడిగా రాధాకృష్ణ సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
Also Read: చిల్లర వివాదం.. మహిళా కండక్టర్ మృతి.. నిందితురాలిపై హత్య కేసు నమోదు!