APPSC Group-1 Scam: వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే కల్తీ లడ్డు, లిక్కర్ స్కామ్ వెంటాడుతుండగా ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్-1 వ్యవహారం వంతైంది. ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగేసింది. బుధవారం ఉదయం నుంచి ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో సోదాలు చేపట్టింది. దీంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా షాకయ్యారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన అక్రమాల కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో బుధవారం ఉదయం ఊహించని మలుపు తిరిగింది. ఇందులో మనీలాండరింగ్ కోణాన్ని నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగేసింది ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్. బుధవారం ఉదయం నుంచి ఏపీ- తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఏడు చోట్ల ఈడీ సోదాలు చేస్తోంది. రంగారెడ్డి జిల్లా కాశీమ్‌బౌలిలో ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు నివాసంతోపాటు పలు చోట్ల సోదాలు చేపట్టింది.
హైదరాబాద్ పంచవటి కాలనీ, పంజాగుట్ట, నేరేడ్‌మెట్, సికింద్రాబాద్‌లో ట్రూగ్రేడర్ సంస్థ, అల్వాల్‌లోని వెంకటాపురంలో తనిఖీలు ముమ్మరం చేసింది. దీనికితోడు గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో హాయ్‌ల్యాండ్‌లోని ఆవాస రిసార్ట్‌లో సోదాలు జరుగుతున్నాయి. సోదాల్లో భాగంగా డిజిటల్ పరికరాలు, హార్డ్ డిస్క్‌లు, ఆర్థిక లావాదేవీల రికార్డులు, రీ-వాల్యుయేషన్‌కు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
గత టీడీపీ ప్రభుత్వ హయంలో 169 గ్రూప్-1 పోస్టుల భర్తీకి 2018లో నోటిఫికేషన్ ఇచ్చింది. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. మరుసటి ఏడాది అంటే 2020 డిసెంబర్‌లో మెయిన్స్ పరీక్ష జరిగింది. డిజిటల్‌తోపాటు 2 దశల్లో మాన్యువల్ పద్దతిలో మూల్యాంకనం జరిగినట్లు ఇటీవల సిట్ తన నివేదికలో ప్రస్తావించింది. హాయ్‌ల్యాండ్ రిసార్ట్‌లో దాదాపు మూడు నెలలపాటు జవాబు పత్రాల మూల్యాంకనం జరిగినట్లు గుర్తించింది. అర్హత లేకుండా 66 మందితో గ్రూప్-1 జవాబు పత్రాల ఇచ్చి మూల్యాంకనం చేయించారని పేర్కొంది. అందుకోసం క్యామ్ సైన్ మీడియాకు రూ.1.14 కోట్లు, డిజిటల్ మూల్యాంకన సంస్థలకు రూ.1.38 కోట్లు చెల్లించినట్లు గుర్తించింది.
ALSO READ: అన్నీ తానై పార్టీని నడిపించిన లోకేష్.. లోకల్‌లో కూటమి సత్తా, తండ్రికి గిఫ్ట్ ఇచ్చినట్టే!
అంతేకాదు 287 బార్‌కోడ్ అసమానతలు, 169 స్లిప్పుల్లో కరెక్షన్ ఫ్లూయిడ్ వినియోగించినట్లు బయటపెట్టింది సిట్. మూల్యాంకన అక్రమాలపై గతేడాది ఏప్రిల్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పీఎస్ఆర్ ఆంజనేయులు, క్యామ్‌సైన్ మీడియా డైరెక్టర్ మధుసూదనరావు అరెస్ట్ చేసింది. సిట్ దర్యాప్తు దృష్ట్యా గత నెలలో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో బుధవారం సోదాలు చేపట్టింది. ఆర్థిక లావాదేవీల వెనుక ఉన్న అంశాలపై లోతుగా దర్యాప్తు చేయనుంది. ఈ విషయం తెలియగానే వైసీపీలోని కొందరు నేతల్లో వణుకు మొదలైంది. మా అధినేతను వరుసగా కేసులు చుట్టుముట్టడంపై జీర్ణించుకోలేకపోతున్నారు.