BigTV English

Ambati Rayudu: ఐపీఎల్‌కు ఆల్విదా.. ఏపీ పొలిటికల్ లీగ్‌లో చెలరేగుతాడా?

Ambati Rayudu: ఐపీఎల్‌కు ఆల్విదా.. ఏపీ పొలిటికల్ లీగ్‌లో చెలరేగుతాడా?
ambati rayudu

Ambati Rayudu: అంబటి రాయుడు.. క్రికెట్‌ ప్రపంచంలో పరిచయం అక్కరలేని పేరు. టీమిండియాలో ఒకప్పుడు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న తెలుగు క్రికెటర్‌గా అంబటి రాయుడు అందరికీ సుపరిచితమే. కాలక్రమంలో కొన్ని పరిణామాలు, రాజకీయాల నేపథ్యంలో టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోయిన రాయుడు.. ఐపీఎల్‌లో మాత్రం తనదైన శైలిలో రాణిస్తూ వచ్చాడు. పోయినేడాది మాత్రం ఐపీఎల్‌కు కూడా రిటైర్‌మెంట్‌ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే.. సీఎస్కే మేనేజ్‌మెంట్‌ జోక్యంతో తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న రాయుడు.. తాజాగా మరోసారి రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. ఇప్పుడు మాత్రం యూటర్న్‌ తీసుకొనేది లేదని స్పష్టం చేశాడు.


16వ సీజన్‌ ఐపీఎల్‌లో గుజరాత్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్ తలపడే మ్యాచ్‌ తనకు కూడా ఫైనల్‌ అని అంబటి రాయుడు స్పష్టం చేశాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో అంబటి రాయుడు ప్రకటన చేశాడు. 2010 నుంచి తనను ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలని.. ఐపీఎల్‌లో ముంబై, చెన్నై జట్ల తరఫున 204 మ్యాచ్‌లు ఆడానని.. 14 సీజనల్లో 11 ప్లేఆఫ్స్‌, 8 ఫైనల్స్‌లో ఆడే అవకాశం వచ్చిందని.. ఇప్పటి వరకు 5 ట్రోఫీల విజయంలో భాగస్వామ్యం అయ్యానని. ఆరో ట్రోఫీ గెలుస్తానని ఆశిస్తున్నా అంటూ అంబటి రాయుడు ట్వీట్‌ చేశాడు. గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు తొలి నుంచి దూకుడైన మనస్తత్వం కలిగిన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడిగా ధోని సారధ్యంలో ప్రత్యేక గుర్తింపు పొందాడు అంబటి రాయుడు. అంతకు ముందు ముంబై ఇండియన్స్‌ జట్టు తరఫున ఆడిన రాయుడు.. టైటిళ్లు గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. ఇప్పటివరకు 204 మ్యాచ్‌లు ఆడిన రాయుడు.. 28.29 సగటుతో 4వ వేల 329 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో ఓ సెంచరీ కూడా నమోదైంది. 2010-2017 వరకు ముంబై ఇండియన్స్‌ జట్టుకు అంబటి రాయుడు ప్రాతినిధ్యం వహించాడు. నిలకడగా ఆడుతూ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. మిడిలార్డర్‌లో జట్టును ఆదుకుంటూ వచ్చాడు. ఈ సీజన్‌లో మాత్రం రాణించలేకపోయాడు.


మరోవైపు ముంబైకి ఆడినప్పుడు ఎన్నో మ్యాచ్‌ల్లో ఒంటి చేత్తో జట్టును గెలిపించిన అంబటి రాయుడు.. ఇప్పటివరకు ఐదు టైటిల్స్‌ను గెలుచుకున్న జట్లలో భాగస్వామ్యం అయ్యాడు. ముంబై తరపున మూడు.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున రెండు టైటిల్స్‌ను అందుకున్న జట్టులో భాగమయ్యాడు. 2018లో సీఎస్కే ఛాంపియన్‌గా నిలవడంలో రాయుడిదే అత్యధిక పాత్ర ఉంది. ఆ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడి 43 సగటుతో 602 పరుగులు చేశాడు. అదే సీజన్‌లో ఐపీఎల్‌లో సెంచరీ కూడా నమోదు చేశాడు రాయుడు.

ఈ ఐపీఎల్‌తో అంబటి రాయుడు క్రికెట్‌ ప్రస్థానం ముగిసింది. ఇక సొంత రాష్ట్రానికి ఏమైనా చేయాలనే బలమైన ఆకాంక్ష ఉన్న అంబటి రాయుడు.. ఇటీవలే పొలిటికల్‌ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. మొన్నామధ్య ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన రాయుడు.. వైసీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌ తర్వాత నేరుగా ఏపీలోని తాడేపల్లికి చేరుకున్న అంబటి రాయుడు.. సీఎం జగన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంలోనే తన ఎంట్రీని ఖాయం చేశారని టాక్‌ వినిపించింది.

కొన్ని రోజులుగా అతడి ఆటతీరు కంటే పొలిటికల్‌ ఎంట్రీపైనే ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. ట్విట్టర్‌లో ఏపీ సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించిన అంబటి రాయుడును.. ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి చెందిన సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేశారు. ప్రతిపక్షానికి చెందిన మీడియాలోనూ వివిధ రకాలుగా వార్తలు ప్రసారం అయ్యాయి. సీఎంను కలిసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తారనే ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. తాజాగా రాయుడు క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించడంతో ఆ ప్రచారమే నిజమని అభిమానులు నమ్ముతున్నారు.

Related News

Nellore News: ఆస్పత్రిలో ఖైదీ రాసలీలలు.. ఏకంగా హాస్పిటల్ బెడ్ పైనే.. ఏంటీ దారుణం?

Weather News: వాయుగుండంగా అల్పపీడనం..! ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతవారణశాఖ

RK Roja: వార్-2 సినిమాను అడ్డుకుంటారా..? రోజా సంచలన వ్యాఖ్యలు

Vizag Rainfall: మరో 3 రోజుల వర్షాలు.. విశాఖ వాసులకు టెన్షన్ పెంచుతున్న వాతావరణం!

NTR fans protest: అనంతపురంలో ఉద్రిక్తత.. బహిరంగ క్షమాపణకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్!

MLA Daggubati Prasad: ఆ ఆడియో నాది కాదు.. కానీ సారీ అంటూ ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే!

Big Stories

×