హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల. అసలు బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉంటే ఎంత? లేకపోతే ఎంత అని అన్నారు. వరుసుగా మూడు సార్లు హిందూపూర్ లో గెలిచాను అని గొప్పలు చెప్పుకునే బాలకృష్ణ నియోజకవర్గంలో ఎన్ని రోజులు కనపడతారని నిలదీశారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలేంటో ఆయనకు తెలుసా అన్నారు. బాలకృష్ణ ప్రజలు ఇచ్చిన తీర్పుతో గెలవలేదని, ఏపీలో కూటమి ఎలా గెలిచిందో అందరికీ తెలుసన్నారు శ్యామల. సత్యసాయి జిల్లాలో జరిగిన వైసీపీ మీటింగ్ లో మాట్లాడిన ఆమె బాలయ్యతోపాటు పవన్ కల్యాణ్ పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉంటే ఎంత? లేకపోతే ఎంత : శ్యామల
వరుసుగా మూడు సార్లు గెలిచాను అని గొప్పలు చెప్పుకునే బాలకృష్ణ హిందూపురంలో ఎన్ని రోజులు కనపడతారు?
హిందూపురం నియోజకవర్గంలో అసలేం సమస్యలు ఉన్నాయో ఆయనకు తెలుసా?
బాలకృష్ణ ప్రజలు ఇచ్చిన తీర్పుతో గెలవలేదు
– వైసీపీ అధికార… pic.twitter.com/ivQ7rNRRdp
— ChotaNews App (@ChotaNewsApp) June 20, 2025
రెచ్చగొట్టే వ్యాఖ్యలు
వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ తరపున గొంతు వినిపిస్తున్న అతి కొద్దిమందిలో యాంకర్ శ్యామల కూడా ఒకరు. ఆమధ్య తెలంగాణలో బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కేసులో పోలీసుల ముందు విచారణకు హాజరైన ఆమె.. కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు పార్టీ తరపున కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఆమె కౌంటర్లిస్తుంటారు. ఈరోజు సత్యసాయి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో కూడా పవన్ కల్యాణ్ కళ్లకు గంతలు కట్టి ఉన్న ఫొటోని చూపిస్తూ ఆయన కనపడటం లేదంటూ విమర్శించారు శ్యామల. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఉంటే ఎంత, లేకపోతే ఎంత అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు.
శ్యామల వ్యాఖ్యలపై విమర్శలు..
శ్యామల వ్యాఖ్యలపై బాలయ్య అభిమానులు, టీడీపీ నేతలు మండిపడుతున్నారు. బాలకృష్ణను విమర్శించే స్థాయి శ్యామలకు లేదంటున్నారు. కూటమి గెలుపుని అపహాస్యం చేస్తున్న శ్యామల వైసీపీకి ఆ 11 సీట్లు ఎలా వచ్చాయో వివరిస్తారా అని అడుగుతున్నారు. వైసీపీ ఆ 11 సీట్లలో గెలిచినట్టే కూటమి 164 సీట్లలో గెలిచిందంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా మాట్లాడటం సరికాదంటున్నారు. మూడుసార్లు హిందూపురం నుంచి గెలిచి, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణను ప్రజలు ఆదరిస్తున్నారని, ఆ ఆదరణను తట్టుకోలేక వైసీపీ నేతలు శ్యామలను పిలిపించి ఇలాంటి వ్యాఖ్యలు చేపిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఓవైపు జగన్ రప్పా రప్పా వ్యాఖ్యలతో జనంలో పలుచన అయ్యారని, మరోవైపు ఆ పార్టీ నేతలు కూడా అలాంటి చౌకబారు వ్యాఖ్యలతో జనాలకు దూరమవుతున్నారని టీడీపీ అంటోంది. హిందూపురంలో వైసీపీకి అంత సీన్ లేదని అంటున్నారు. బాలకృష్ణ ఎమ్మెల్యేగా బాగా పనిచేయబట్టే వరుసగా మూడుసార్లు అదే నియోజకవర్గం నుంచి ఎన్నిక కాగలిగారని వివరిస్తున్నారు. ఇక శ్యామల వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో బాలయ్య అభిమానులు ఘాటుగా స్పందిస్తున్నారు.
ప్రమాణం..
వైసీపీ కార్యక్రమంలో పాల్గొన్న శ్యామల, తన వ్యాఖ్యలతో అక్కడున్న కార్యకర్తల్ని ఉత్సాహపరిచారు. అదే సమయంలో వారందరితో ప్రమాణం కూడా చేయించారు. స్వార్థ రాజకీయాలు చేయకుండా పార్టీ కోసం, జగన్ గెలుపుకోసం నిజాయితీగా కష్టపడి పనిచేస్తామని, ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతూ, రాష్ట్రమంతా ఏకమై మళ్లీ జగన్ ని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ప్రమాణం చేయించారు.