Andhra Pradesh: చంద్రబాబు విజన్.. పవన్ కల్యాణ్ పవర్.. లోకేష్ ఆలోచనలు.. ఇవన్నీ కలిస్తే కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో కీలకంగా మారాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకోవడంతో పాటు ప్రధానిగా నరేంద్ర మోడీకి పుష్కరకాలం పూర్తయిన సందర్భంగా తిరుపతిలో సంక్షేమం పేరుతో భారీ విజయోత్సవ సభ జరగనుంది. సంక్షేమం, అభివృద్ధి, నమ్మకం ఈ స్లోగన్ ను కూటమి ప్రభుత్వం ప్రొజెక్ట్ చేస్తోంది.
రెండేళ్ల అభివృద్ధి–సంక్షేమంపై సభ
తిరుపతి రూరల్ మండలం దామినేడులోని ఇందిరమ్మ గృహాల సమీపంలో బహిరంగ సభ జరగనుంది. రాష్ట్రప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు అందించిన సుపరిపాలన, చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఈ సభ ద్వారా కూటమి నేతలు వివరించనున్నారు. రెండేళ్ల క్రితం ప్రభుత్వం కొలువుదీరిన జూన్ 12న విజయోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయ్. కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు 50 వేల మంది ప్రజలు పాల్గొనేలా రెడీ చేశారు.
అమరావతి–పోలవరంపై కూటమి ఫోకస్..
ఈ రెండేళ్లలో అన్ని రంగాలపై కూటమి ప్రభుత్వం ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. రాజధాని అమరావతి, జీవనాడి అయిన పోలవరంపై మొదటగా ఫోకస్ చేసిన ప్రభుత్వం ఆ రెండింటినీ ప్రాధాన్యాంశాలుగా తీసుకుంది. రాజధానికి ఏ అడ్డంకులూ ఉండకూడదని పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026 బిల్లు ద్వారా అమరావతిని ఏపీ ఏకైక, శాశ్వత రాజధానిగా చట్టబద్ధ హోదా కల్పించడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది. అమరావతి నిర్మాణ పనుల కోసం 50 వేల కోట్లకు పైగా నిధుల సమీకరణతో మళ్లీ పనులు పరుగులు పెట్టించడం, కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీలు తేవడం ద్వారా ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగింది. అటు ఆంధ్రాకు జీవనాడి అయిన కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ పనులకు కూడా బూస్ట్ లభించింది.
ఉత్తరాంధ్ర–రాయలసీమపై ప్రత్యేక దృష్టి..
మరోవైపు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం త్రీ-రీజియన్ మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తూ ప్రాంతీయ సమతుల్యతకు, అభివృద్ధి వికేంద్రీకరణకు కూటమి ప్రభుత్వం మొగ్గు చూపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో ఉన్న సంక్షేమ పథకాలను రద్దు చేయకుండా వాటిని మరింత బలోపేతం చేసింది. ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను 4 వేల రూపాయలకు పెంచి ప్రతి నెల ఒకటో తేదీనే లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి ఇవ్వడం.. జనంలో ఒక నమ్మకాన్ని కలిగించింది. తల్లికి వందనం కింద 10 వేల కోట్లు తల్లుల ఖాతాల్లో వేయడం, దీపం-2 పథకం ద్వారా మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ సక్సెస్ ఫుల్ గా సాగుతున్నాయి. అలాగే పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించి.. రుచిగా, శుచిగా 4 కోట్లకు పైగా భోజనాలను అందించడం క్షేత్రస్థాయిలో ప్రజలను మెప్పించింది.
డ్రగ్స్‌పై ఉక్కుపాదం..
అటు శాంతిభద్రతలపైనా ఫోకస్ పెంచింది. గంజాయి, డ్రగ్స్ రవాణాపై ఈగిల్ టాస్క్ ఫోర్స్ ద్వారా కఠినంగా వ్యవహరిస్తూ క్రైమ్ రేటును తగ్గించగలిగారు. పోలీస్ మోడ్రనైజేషన్ లో భాగంగా ప్రతి జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను, 3 వేల కొత్త వాహనాలను ప్రవేశపెట్టారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వాట్సప్ గవర్నెన్స్, డేటా ఆధారిత నిర్ణయాల ద్వారా టెక్ విప్లవాన్ని తీసుకొచ్చారు మంత్రి నారా లోకేష్. అటు పంచాయతీ రాజ్, పర్యావరణశాఖల మంత్రిగా పవన్ కల్యాణ్ గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం గ్రామీణ ఓటర్ల ప్రశంసలు అందుకుంది.
నిరుద్యోగులకు ఉద్యోగ భరోసా..
మెగా డీఎస్సీ ద్వారా 15,491 టీచర్ పోస్టుల భర్తీ, 5,757 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయడం నిరుద్యోగులకు పెద్ద ఊరటనిచ్చింది. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో 800 కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయని ప్రభుత్వం ప్రకటించింది. రెండేళ్లలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు.. వాటి ద్వారా 23 లక్షల మందికి ఉపాధి లభించనుంది.
పెట్టుబడుల హబ్‌గా ఏపీ..
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అమలు చేయడం, కేవలం 36 రోజుల్లోనే యుద్ధ విమానాల ప్రాజెక్టును తీసుకురావడం, రాష్ట్రానికి గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు, ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు పరిశ్రమ వంటి భారీ ప్రాజెక్టులు రావడం, వివిధ సంస్థలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల్లో 68.02 శాతం ఇప్పటికే ప్రాసెస్‌లోకి రావడం, డీపీఆర్ నుంచి గ్రౌండింగ్ దశకు చేరిన ఎంవోయూలు 60.44 శాతంగా ఉండడం ఇవన్నీ శుభ శకునాలే అంటున్నారు. దేశానికి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 23.5 శాతం ఏపీకి దక్కడం, ఎంవోయూల అమలును పర్యవేక్షించేందుకు మూడు రీజియన్లకు నోడల్ అధికారుల నియామకం.. ఇలా ప్రతి అంశం పకడ్బందీగా సాగుతోంది.
చంద్రబాబు విజన్.. పవన్ పవర్..
సో రెండేళ్ల కూటమి పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక కొత్త ఆశను, నమ్మకం దిశగా అడుగులైతే వేయించిందంటున్నారు. అభివృద్ధి – సంక్షేమం రెండింటినీ సమతుల్యం చేయడానికి గట్టిగానే ప్రయత్నించింది. సీఎం చంద్రబాబు నాయుడి అనుభవం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజాదరణ, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ డబుల్ ఇంజన్ సపోర్ట్ ఏపీకి పెద్ద ప్లస్ పాయింట్లుగా మారాయ్. రాష్ట్ర ఆర్థిక వనరుల కొరత కారణంగా కొంత ఇబ్బందులు ఉన్నా.. పాజిటివ్ సిగ్నల్స్ తో స్వర్ణాంధ్ర 2047 విజన్ తో ముందుకెళ్లే దిశగా అడుగులు వేస్తోంది కూటమి సర్కార్.
Also Read: పెట్రోల్ బంకుల్లో కొత్త రూల్స్.. చమురు విక్రయాలపై కఠిన ఆంక్షలు.. పరిమితి విధింపు!