Kandukuru Case: నెల్లూరు జిల్లా కందుకూరు హత్య కేసు విచారణపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. బాధితులను పరామర్శించిన హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి పి.నారాయణ, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో సచివాలయంలో సీఎం సమావేశమయ్యారు. బాధితులకు సీఎం చంద్రబాబు పరిహారం ప్రకటించారు. మృతుడు లక్ష్మీ నాయుడు భార్యకు 2 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదు పరిహారం, ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, రూ.5 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
లక్ష్మీ నాయుడు పిల్లలను చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, కారు దాడిలో గాయపడ్డ పవన్‌కు 4 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదుతో పాటు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని సీఎం ప్రకటించారు. భార్గవ్‌కు రూ.3 లక్షల నగదు, ఆసుపత్రి ఖర్చులు చెల్లించాలని కూడా నిర్ణయించారు. ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి ఈ వ్యవహారంపై వేగంగా దర్యాప్తు పూర్తి చేయించాలని ఆదేశించారు.
లక్ష్మీనాయుడు హత్య అత్యంత హేయమైన చర్య అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. సీఎంతో సమావేశం అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. హత్య కేసు నిందితులపై కఠినమైన సెక్షన్లు పెట్టి, ఇప్పటికే అరెస్టు చేశామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశామని చెప్పారు. నిందితుల ఆస్తుల జప్తునకు సిఫార్సు చేశామన్నారు. మరో పక్క లక్ష్మీనాయుడు సతీమణికి 2 ఎకరాలు, రూ.5 లక్షల పరిహారం, ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి ఇచ్చి, పిల్లల పేరిట రూ.5 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామన్నారు. ఇదే ఘటనలో గాయపడిన పవన్, భార్గవ్‌లకు పరిహారం ఇస్తామన్నారు.
నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలోని దారకానిపాడు గ్రామంలో దసరా రోజున దారుణ హత్య జరిగింది. 25 ఏళ్ల తిరుమలశెట్టి లక్ష్మీనాయుడును హరిచంద్రప్రసాద్ అనే వ్యక్తి కారుతో కొట్టి అతి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనలో లక్ష్మీనాయుడు సోదరులకు కాళ్లు, చేతులు విరిగిపోయాయి. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే ఈ హత్యపై రాజకీయ వివాదం నెలకొంది. కొందరు కులాల ప్రస్తావన తెచ్చారు.
Also Read: Pawan Kalyan: పవన్ కల్యాణ్ కి కోపం తెప్పించిన డీఎస్పీ.. డీజీపీ వద్ద పంచాయితీ
కందుకూరు హత్యను కులాల మధ్య వివాదంగా సృష్టించే ప్రయత్నం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ, కాపు నేతలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లక్ష్యంగా విమర్శలు చేసింది. లక్ష్మీ నాయుడి హత్యపై పవన్ స్పందించలేదని, ఆయన తీరుపై సరికాదంటూ విమర్శలు చేశారు. అయితే ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన ఘటనను కులాల కుంపటిగా మార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని జనసేన మండిపడుతుంది. దీనిని పవన్ కు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.