Nara Lokesh: ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు.. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలతో ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. సిడ్నీలో ఆస్ట్రేలియా ప్రముఖ వ్యాపారవేత్తలతో లోకేష్ సమావేశమై, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ సీఈవో ఆంటోనీ షా, అమెజాన్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ మైఖేల్ కూలే, సిస్కో వైస్‌ప్రెసిడెంట్ జెట్టి మురళి, ఎర్నెస్ట్ యంగ్ భాగస్వామి రిచర్డ్ వాట్సన్, గ్రెయిన్‌కార్ప్ సీఈవో రాబర్ట్ స్పర్వే, హెచ్‌సీఎల్ టెక్ అసోసియేట్ వైస్‌ప్రెసిడెంట్ గీతేష్ అగర్వాల్, మాస్టర్‌కార్డ్ వైస్‌ప్రెసిడెంట్ టాన్యా స్టోయానాఫ్, మెల్‌బోర్న్ యూనివర్సిటీ వైస్‌ప్రెసిడెంట్ ముత్తుపాండ్యన్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. విజనరీ సీఎం చంద్రబాబునాయుడు పెట్టుబడిదారులకు ఊతమిచ్చే పారిశ్రామిక విధానాలను ప్రకటించారని, దీంతో కేవలం 16 నెలల్లోనే ఏపీకి రూ.10లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో 1,051 కి.మీ.ల సువిశాల తీరప్రాంతంతో పాటు రోడ్లు, అధునాతన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నం డేటా సిటీగా రూపుదిద్దుకుంటుందని, అనేక ఐటీ, డిజిటల్ కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయని చెప్పారు. ఈ దిశగా, ఏపీ ప్రభుత్వం ఇన్వెస్టర్లకు తక్షణ అనుమతులు, సింగిల్-విండో క్లియరెన్స్ సిస్టమ్, సులభతర ట్యాక్స్ విధానం వంటి సౌకర్యాలను అందిస్తోందని వెల్లడించారు.
ఒకసారి ఆంధ్రప్రదేశ్ తో ఎంవోయూ చేసుకున్నాక ఆ పరిశ్రమను మాదిగా భావించి అవసరమైన అన్ని అనుమతులు, ప్రోత్సహకాలు అందిస్తామని లోకేష్ తెలిపారు. ఆంధ్రపదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం భారీ పెట్టుబడులతో డేటా సిటీగా అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. ఏపీలో నెలకొన్న పరిశ్రమల అనుకూల వాతావరణం, అమలుచేస్తున్న సులభతర వాణిజ్య విధానాలను తెలుసుకునేందుకు వచ్చే నెల 14,15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే పార్టనర్ షిప్ సమ్మిట్ కు రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
Also Read: హైదరాబాద్ వ్యాప్తంగా స్వీట్ షాప్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..
సమావేశంలో పాల్గొన్న ఆస్ట్రేలియా బిజినెస్ లీడర్లు ఏపీ రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి భద్రతపై ప్రశంసలు వ్యక్తం చేశారు. వారు ఆంధ్రప్రదేశ్‌లోని అగ్రి-ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడి అవకాశాలను పరిశీలించడానికి ఆసక్తి చూపారు.