AP CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం విజయవాడలోని బీసెంట్ రోడ్డులో పర్యటించారు. ఈ పర్యటన దీపావళి పండుగ సందర్భంగా జరిగింది, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన జీఎస్టీ సంస్కరణల (GST 2.0) ఫలితాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడమే లక్ష్యమన్నారు.
బీసెంట్ రోడ్డు, విజయవాడలోని ప్రసిద్ధ వ్యాపార కేంద్రం, దీపావళి విక్రయాలతో కళకళలాడుతోంది. సీఎం చంద్రబాబు చిరు వ్యాపారులు, వీధి వర్తకులతో నేరుగా మాట్లాడారు. తాను ప్రస్తుతం ప్రమిదల వ్యాపారం చేస్తున్నానని దుర్గారావు తెలిపారు. వీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటారని సీఎం ప్రశ్నించగా… పదిమంది చిరు వ్యాపారులు కలిసి మద్రాసు మార్కెట్ నుంచి తెచ్చుకుని విక్రయిస్తుంటాని తెలిపారు. జీఎస్టీ తగ్గింపు వల్ల నెలకు రూ.1,000 ఆదా అవుతోందని ఆయన సీఎంకు చెప్పారు. గతంలో మందుల కొనుగోలుకు రూ.2,000 ఖర్చవుతుండగా, ఇప్పుడు రూ.1,500కే లభిస్తున్నాయని, ఎక్స్-రేలకు రూ.2,000 నుంచి రూ.1,600కు తగ్గిందని, మొత్తంగా రూ.900 మిగులుతోందని వివరించారు. అంతేకాకుండా, తనకు ఉచిత గ్యాస్ సిలిండర్, మనవళ్లకు ‘తల్లికి వందనం’ పథకం లబ్ధి చేకూరిందని దుర్గారావు తెలిపారు.
అనంతరం సీఎం మరిన్ని వ్యాపారులతో మాట్లాడారు. చెప్పుల షాపు యజమాని చదలవాడ వెంకటకృష్ణారావుతో వ్యాపారం నడుస్తున్న తీరు, చెప్పులపై జీఎస్టీ తగ్గింపు ప్రభావం, విక్రయాల పెరుగుదల గురించి అడిగారు. కిరాణా షాపు నిర్వాహకుడు బొడ్డు శ్రీనివాస్‌తో నిత్యావసర వస్తువుల ధరల వ్యత్యాసం, గతానికి ఇప్పటికీ మార్పులు తెలుసుకున్నారు. బట్టల షాపులో సేల్స్ గర్ల్ గొడవర్తి లక్ష్మీతో ముచ్చటించారు. మరో వీధి వ్యాపారి యక్కలి బాలకృష్ణతోనూ సంభాషించారు. దీపావళి ప్రమిదలు విక్రయిస్తున్న ఒక మహిళతో మాట్లాడి, మట్టి ప్రమిదలు కొంటున్నారా అని అడిగారు. అవునని మహిళలు సమాధానమిచ్చారు. సీఎంను కలిసినందుకు సంతోషంగా ఉందని వారు తెలిపారు.
ఈ పర్యటనలో సీఎం కొనుగోలుదారులతోనూ మాట్లాడారు. వారితో చేతులు కలిపి, సెల్ఫీలు దిగారు. పిల్లలకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో శని, ఆదివారాలు ఆహ్లాదకర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జీఎస్టీ తగ్గింపు వల్ల దసరా-దీపావళి విక్రయాలు పెరిగాయా అని వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సంస్కరణలు ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇలు, గృహోపకరణాలు, ఔషధాలు వంటి రంగాల్లో ప్రయోజనాలు చేకూరుస్తున్నాయని వ్యాపారులు చెప్పారు.
Also Read: ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ.. సీఎం రేవంత్ దీపావళి శుభాకాంక్షలు
మొత్తంగా, ఈ పర్యటన డబుల్ ఇంజిన్ సర్కార్ సమన్వయంతో జరుగుతున్న సంస్కరణలను ప్రజలకు చేరువ చేయడంలో భాగం అన్నారు. సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా రాష్ట్రంలో 65,000 ఈవెంట్లు నిర్వహించి జీఎస్టీ ప్రయోజనాలను ప్రచారం చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. ఈ సంస్కరణలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ పర్యటనతో స్థానికులు, వ్యాపారులు ఉత్సాహంగా ఉన్నారు..
చిరు వ్యాపారులను నేరుగా కలిసిన సీఎం చంద్రబాబు..
జీఎస్టీ సంస్కరణల కారణంగా ప్రజలు, వ్యాపారులకు కలుగుతున్న లబ్ధిని తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదివారం బీసెంట్ రోడ్డులో పర్యటించారు. ఈ సందర్భంగా చింతలపూడి దుర్గారావు అనే వీధి వ్యాపారితో ముఖ్యమంత్రి మాట్లాడారు.… pic.twitter.com/OVfPs4LxIl
— BIG TV Breaking News (@bigtvtelugu) October 20, 2025