AP Investments: సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. స్వచ్ఛ షహర్ కేటగిరిలో దేశంలోనే అత్యంత శుభ్రమైన నగరంగా విశాఖ నిలిచిందని అన్నారు. ఇలాంటి అత్భుతమైన నగరంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించుకున్నామని, వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, కేంద్ర మంత్రులు భాగస్వామ్య సదస్సుకు హాజరయ్యారని తెలిపారు. నేవిగేటింగ్ ద న్యూ వరల్డ్ ఆర్డర్ అనే థీమ్ తో ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్, థాట్ లీడర్పిష్ పేరిట రెండు రోజుల సదస్సు జరిగిందని అన్నారు.
కేంద్ర సహకారంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు పూర్తి చేసుకున్నామని, విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ వంటి ప్రాజెక్టులను కూడా కేంద్ర సాయంతో సాకారం చేసుకున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఐఐ భాగస్వామ్య సదస్సుతో పాటు 6 సన్నాహక సమావేశాల ద్వారా పెట్టుబడులు ఆకర్షించామని, రాష్ట్రంలోని ప్రతీ ప్రాంతానికి పెట్టుబడులు తీసుకురావడం, ప్రాజెక్టులను గ్రౌండ్ చేయడమే మా సంకల్పం అని, చేనేత క్లస్టర్స్ నుంచి ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులు తీసుకువస్తున్నామన్నారు. గతంలో ఐటీ విప్లవాన్ని అందుకుని తెలుగువారిని ప్రపంచ నిపుణులుగా నిలిపామని చంద్రబాబు గుర్తు చేశారు.
ఇప్పుటు వన్ ఫ్యామిలీ వన్ ఏఐ అనే విధానం ద్వారా నిపుణుల్ని తయారు చేస్తాం. అలాగే పునరుద్పాదక ఇంధనంలో ప్రతీ ఇంటిపైనా సౌర ఫలకాలను ఏర్పాటు చేసి అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేస్తామని, 500 గిగావాట్ల విద్యుత్ జాతీయ లక్ష్యం కాగా ఏపీ ఒక్కటే 160 గిగావాట్ల లక్ష్యాన్ని పెట్టుకున్నామన్నారు. కేంద్రం సహకరిస్తే ఆ లక్ష్యాన్ని మించి మేం విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సిద్దంగా ఉన్నామని, మహిళా పారిశ్రామిక వేత్తలను తయారు చేసేందుకు డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహం కల్పిస్తున్నామన్నారు. ఈ భాగస్వామ్య సదస్సులో 303 ప్రతిపాదనల ద్వారా రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామన్నారు.
Also read: హెచ్‌ఐసీసీ భారత్ సమ్మిట్‌లో.. మంత్రి సీతక్క భావోద్వేగ ప్రసంగం!
తయారీ రంగం, ఫుడ్ ప్రాసెసింగ్, విద్య, వైద్య రంగాలు, ఏవియేషన్, ఆటోమొబైల్ తదితర రంగాల్లో పెట్టుబడులు వచ్చాయి. కియా సంస్థ ఏడాదికి మరో 2 లక్షల కార్లు అదనంగా తయారు చేసేందుకు రూ.18,800 కోట్లకు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. రిలయన్స్ సంస్థ రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలతో ఒప్పందం చేసుకుంది. 2024 నుంచి వచ్చిన 714 ప్రతిపాదనల్లో 522 ప్రతిపాదనలు రియాలిటీలోకి వస్తున్నాయని, నాలా యాక్టును రద్దు చేశామని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అమలు చేస్తున్నామని అన్నారు. కేవలం 13 లైసెన్సుల ద్వారా 5 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామన్నారు.
ఆటోమేటిక్ అప్రూవల్స్, సెల్ఫ్ సర్టిఫికేషన్ అనే విధానాలు తెచ్చామని, ఏ ప్రాజెక్టు అయినా నిర్దేశిత గడువులోగా అనుమతులు ఇచ్చే విధానం అమలు చేస్తున్నామన్నారు. నిన్నటి నుంచి పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతా అమల్లోకి వచ్చింది. పారిశ్రామిక సంస్కరణల్లో ఎస్క్రో ఖాతా ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుందని, పెట్టుబడుల రక్షణ కోసం ఇన్వెస్ట్మెంట్ ప్రోటెక్షన్ యాక్టును కూడా అమల్లోకి తెస్తామన్నారు. ఈ చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తే పెద్దఎత్తున పెట్టుబడుల ప్రవాహం వస్తుందని చంద్రబాబు అన్నారు.
ఈ సంస్కరణ దిశగా మనం అంతా కలిసి పనిచేయాల్సి ఉంది. పెట్టుబడుల్ని ఆకర్షించటమే కాదు వాటిని సంరక్షించటం, గ్రౌండింగ్ చేయటం కూడా అత్యంత కీలకం అని మేం భావిస్తామని, ప్రతీ పౌరుడికి గౌరవ ప్రదమైన జీవన ప్రమాణాలు తీసుకురావాలన్నదే మా లక్ష్యం అని.. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా ‘యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్’లో ఏపీ దేశంలో రెండో స్థానంలో నిలిచిందని, ప్రజలందరికి సామాజిక, ఆర్ధిక భద్రతను అందించటంలో మేం అగ్రస్థానంలో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
Also read: భారత్ సమ్మిట్ వేదికగా రాజకీయ రగడ.. వీసాల రద్దు వెనుక మోడీ సర్కార్ వ్యూహమేంటి?