Borugadda Anil : సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టుల మీద పోస్టులు పెట్టిన వైసీపీ యాక్టివిస్ట్ బోరుగడ్డ అనిల్ వ్యవహారం ఇప్పుడూ అదే తీరుగా నడుస్తోంది. అయితే.. పోస్టుల విషయంలో కాదు.. అప్పుడు పెట్టిన పోస్టుల కేసుల్లో. ఒక కేసు ముగియగానే, మరొకటి.. అది అయిపోగానే ఇంకొకటి.. బోరుగడ్డను ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. తాజాగా.. ఓ కేసులో మంగళ గిరి కోర్టుకు హాజరైన బోరుగడ్డ అనిల్ .. రేపు మరోకేసులో అరెస్ట్ అవ్వనున్నాడు.
రెండు రోజుల క్రితం రాజమహేంద్ర వరం జైలు నుంచి ఏలూరు జిల్లా వేలేరుపాడు పోలీసుల విచారణకు హాజరైన బోరుగడ్డ అనిల్ ను ఇవ్వాళ మంగళగిరి పోలీస్ కోర్టులో హజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో.. అక్కడి నుంచి రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తున్నారు. అయితే.. రిమాండ్ లో ఉన్నప్పడే.. తమకు కస్టడీకి ఇవ్వాలంటూ తుళ్లూరు పోలీసులు కోర్టును కోరారు. అందుకు అంగీకరించిన కోర్టు.. రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ సందర్భంగా జరిగిన విషయాలు.. ఎలా ఉండే బోరుగడ్డ ఎలా అయ్యాడు అనేలా చేస్తున్నాయి. ఇంతకీ ఏమైందంటే..
గతంలో సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో.. ప్రత్యర్థి పార్టీల వారికి వార్నింగ్ ఇస్తూ అనేక డైలాగులు వాడారు. జగన్ కు వ్యతిరేకంగా వస్తే.. హ్యాంగర్ కి ఉన్న షర్టు వేసుకొస్తా, చూసుకుందాం అంటూ బీరాలు పలికిన వాడే.. ఇప్పుడు జ్వరంగా ఉంది బాబోయే.. నాకు ఓ రోజు సెలవు ఇప్పించండి అంటూ వేడుకుంటున్నాడు. అప్పుడు.. మక్కెలె ఇరుగుతాయి జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చిన.. బోరుగడ్డ.. నేను ఈ విచారణకు హాజరుకాలేను,నన్ను వదిలిపెట్టండి అని అభ్యర్థించాడు. అయినా.. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. ఎవరికైనా.. వైద్య నివేదికలే ముఖ్యం అంటూ.. నీకు జ్వరం లేదని డాక్టర్లు చెప్పారు, నువ్వు విచారణకు రావాల్సిందే అని చెప్పాల్సి వచ్చింది.
ఓ కేసు విచారణ నిమిత్తం మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు.. బోరుగడ్డకు ప్రభుత్వ వైద్య శాలలో ఆరోగ్య పరీక్షలు చేయించారు. ఆ రిపోర్టుల ఆధారంగా.. రిమాండ్ కోరారు. దాంతో.. మంగళగిరి కోర్టు బోరుగడ్డను రాజమహేంద్రవరం జైలుకు తరలించింది. అయితే.. కోర్టులో ఉన్నప్పుడే.. తుళ్లూరు పోలీసులు సైతం బోరుగడ్డను కస్టడీకి కోరారు. దాంతో.. న్యాయమూర్తితో తనకు జ్వరం ఉందని చెప్పిన బోరుగడ్డ, రాజమహేంద్రవరం జైలు నుంచి విచారణకు రాలేనని చెప్పాడు. ఒక్కరోజు విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించాడు. కానీ.. డాక్టర్లు జ్వరం ఉందని చెప్పలేదన్న న్యాయమూర్తి.. రేపు విచారణకు హాజరుకావాల్సిందేనని చెప్పింది. దాంతో.. ఇవ్వాళ రాత్రికి రాజమహేంద్రవరం వెళ్లనున్న బోరుగడ్డ, మళ్లీ ఉదయమే.. మంగళగిరి కోర్టుకు రావాల్సి ఉంటుంది.
Also Read : తిరుమలలో అన్యమత ప్రచారంపై బిగ్ టీవీ-స్వేచ్ఛ కథనం.. రంగంలోకి దిగిన అధికారులు.. చివరకు?
బోరుగడ్డ అనిల్ పై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. గత ఏడాది మార్చి 31.. రాజధాని రైతులకు సంఘీభావం తెలిపేందుకు సత్యకుమార్ వచ్చారు. దారిలో ఆయనపై.. వైసీపీ శ్రేణులు దాడికి దిగాయి. ఆ దాడుల్లో కొందరు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఆ కేసులో.. అప్పటి ఎంపీ నందిగం సురేష్ ప్రధాన ముద్దాయిగా ఉండగా, అనిల్ తరుపరి నిందితుడిగా ఉన్నాడు. అప్పట్లో ఈ కేసు విచారణ సరిగా జరగలేదనే ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక.. ఈ కేసులో కదలిక రాగా.. బోరుగడ్డ సహా అనేక మంది జైలుకు వెళ్లాల్సి వచ్చింది.