ఆ పాపం అటవీశాఖదే!
⦿ తిరుమలలో అన్యమత ప్రచారంపై స్వేచ్ఛ-బిగ్ టీవీ కథనం
⦿ రంగంలోకి దిగిన ఫారెస్ట్, పోలీసు, టీటీడీ విజిలెన్స్
⦿ అనుమతికి మించి దుకాణాలు ఉన్నట్లు గుర్తింపు
⦿ ఇదంతా ఫారెస్ట్ సిబ్బంది దందానే అని తేలిన వైనం
⦿ ఇంతవరకూ స్పందించని అటవీశాఖ అధికారులు
తిరుమల, స్వేచ్ఛ:
Big TV Effect: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో అన్యమత ప్రచారం జరిగిందని ‘స్వేచ్ఛ-బిగ్ టీవీ’ ప్రచురించిన ప్రత్యేక కథనం పెను సంచలనమైంది. పాపవినాశనం ప్రాంతంలోని దుకాణదారుల అన్యమత ప్రార్థనలపై వచ్చిన కథనానికి టీటీడీ స్పందించింది. వెంటనే రంగంలోకి దిగిన ఫారెస్ట్, పోలీసు, టీటీడీ విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా దుకాణాలలో తనిఖీలు చేశారు.
ఈ సోదాల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. అనుమతికి మించి దుకాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 52 దుకాణాలకు మాత్రమే అనుమతి ఉండగా 120 దుకాణాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. గత ఐదేళ్లు అడ్డగొలుగా దుకాణాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తేల్చారు. ఆఖరికి రెడ్‌జోన్‌లో కూడా దుకాణాలకు అనుమతులు ఇచ్చినట్లు గుర్తించామని అధికారులు చెబుతున్నారు. ఇదంతా ఫారెస్ట్ సిబ్బంది దందానే అని నిగ్గు తేలింది. దుకాణానికి రూ. 3 వేలు రెంట్ కాగా, ప్రతి దుకాణం నుంచి అటవీశాఖ సిబ్బంది మామూళ్లు రూపంలో రూ.1500 వసూలు చేసింది.
మాకేం తెలియదు!
మరోవైపు అన్యమత ప్రచారం, అనుమతి లేని దుకాణాలు, రెడ్ జోన్ దుకాణాల వ్యవహారంపై అటవీశాఖ ఇంతవరకూ స్పందించలేదు. తమ సిబ్బంది లేదని అటవీశాఖ ఉన్నతాధికారులు చెబుతూ తిన్నగా చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై లోతుగా విచారణ చేపడుతామని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం నిషిద్ధం. అయితే పాపవినాశనం దగ్గర ఓ మతానికి చెందిన కొంతమంది, తమ మతం గురించి ప్రచారం చేశారనే వదంతులు వ్యాపించాయి.
మొత్తం 20 మందికి పైగా పాపవినాశనం దగ్గర పాటలతో రీల్స్ చేసినట్లుగా ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ అన్యమత ప్రచారం చేయడంలో అటవీశాఖ అధికారులు సహకారం ఉందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో ఈ విషయంలో వాస్తవాలు నిగ్గు తేల్చడానికి టీటీడీ విజిలెన్స్ యాక్షన్‌లోకి దిగింది. తిరుమల పరిసర ప్రాంతాలలో అన్యమత ప్రచారం నిషేధమైనప్పటికీ ఇలాంటి పనులు సర్వసాధారణంగా మారాయి.