Elephant Attacks: ఆ గజరాజు పేరే దేవుడు. హఠాత్తుగా దాడికి పాల్పడి ఇద్దరి మృతికి కారణమైంది. అయితే ఇక్కడే ఆ గజరాజు భావోద్వేగం బయటపడింది. దురదృష్టవశాత్తు జరిగిన ఘటనతో చిన్నబుచ్చుకున్న ఆ ఏనుగు ఆహారమే స్వీకరించడం మానేసిందట. ఓ వైపు మృతుల బంధువుల రోదనలు వినిపిస్తుండగా, మరో వైపు గజరాజు ఆహారం కూడా వద్దనుకుందని భక్తులు తెలుపుతున్నారు. ఈ ఘటన తమిళనాడు లోని తిరుచెందూర్ సుబ్రమణ్య స్వామి ఆలయంలో సోమవారం జరిగింది.
తిరుచెందూర్ సుబ్రమణ్య స్వామి ఆలయంలో 2006 నుండి దేవనై అనే పేరు 26 ఏళ్ల ఆడ ఏనుగు ఉంటోంది. ఈ ఏనుగును అందరూ దేవుడి ఏనుగుగా పిలుస్తారు. ఈ ఏనుగుకు రాజగోపురం ప్రాంతంలో బసను సైతం ఏర్పాటు చేశారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు మొదట్లో ఏనుగుకు పండ్లు, చెరకు తినిపించడం, సెల్ ఫోన్ లో ఫోటోలు తీసుకోవడం జరుగుతుండేది. అయితే ఏనుగు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఏనుగు చుట్టూ వలలను ఏర్పాటు చేసి, భక్తులను దరికి చేరకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.
ఈ ఏనుగుకు రాధాకృష్ణన్, సెంథిల్ కుమార్, ఉదయ్ కుమార్ లు కాపలాగా పనిచేస్తున్నారు. సోమవారం రోజువారీ మాదిరి గానే, గజరాజుకు ఆహారం అందించి రాధాకృష్ణన్ తన ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఉదయ్ కుమార్, అతని సమీప బంధువు శిశుబాలన్ తో కలిసి గజరాజు వద్దకు రాగా, హఠాత్తుగా గజరాజు దాడికి పాల్పడింది. దీనితో వారివురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆలయ సిబ్బంది వెంటనే వారిని తిరుచెందూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అప్పటికే శిశుపాలన్, ఉదయ్ కుమార్ లు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆలయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుసుకున్న స్థానికులు వందల సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో, వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. దీంతో ఆలయాన్ని మూసివేసిన అధికారులు 45 నిమిషాల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఆలయం వద్దకు చేరుకుని ఘటన జరిగిన తీరును స్థానికుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.
Also Read: Lady Aghori: కారులో లేడీ అఘోరీ తాంత్రిక పూజలు? ఆగ్రహంతో అద్దాలు బద్దలు కొట్టిన ప్రజలు?
అనంతరం వారు మాట్లాడుతూ.. దేవుడి ఏనుగుగా పిలవబడే దేవనై ఏనుగు చాలా ప్రశాంతంగా ఉండేదని, ఇప్పటివరకు ఈ ఏనుగు విషయంలో ఎటువంటి ఘటనలు జరగలేదన్నారు. అయితే దురదృష్టకర సంఘటన జరిగిన అనంతరం, భావోద్వేగానికి గురైన ఏనుగు కన్నీరు కారుస్తూ.. ఆహారాన్ని తీసుకోవడం లేదని వారు తెలిపారు. తొండము, కాళ్లతో దాడి చేయడంతో శిశుబాలన్, ఉదయ్ కుమార్ లు మృతి చెందినట్లు, ఈ ఘటనపై సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలపనున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఏది ఏమైనా ఏనుగు దాడి చేయడంతో ఇరువురు మృతిచెందగా, దురదృష్టకర ఘటనతో ఏనుగు సైతం ఆవేదన చెందుతూ ఆహారం తీసుకోకపోవడం విశేషం.