AP Assembly sessions: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ కాసేపట్లో మొదలుకానున్నాయి. సోమవారం నుంచి పది రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడనుంది.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశంలో జరగనుంది. అందులో సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలి, ఏఏ అంశాలపై చర్చించాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఈసారి అసెంబ్లీలో ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని భావిస్తోంది కూటమి సర్కార్.
ముఖ్యంగా సోషల్ సైకోలకు చెక్ పెట్టే విధంగా ఓ చట్టం తీసుకురానుంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనికితోడు భూ ఆక్రమణ నిరోధానికి ప్రత్యేక చట్టం తీసుకొచ్చేలా ఆలోచన చేస్తోంది.
గతంలో తీసుకొచ్చిన కొన్ని చట్టాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి తీసుకు రానుంది కూటమి ప్రభుత్వం. దేవాదాయ శాఖలోని పాలకమండళ్లలో మరో ఇద్దరు సభ్యుల నియామకం, వైసీపీ తీసుకొచ్చిన జ్యూడీషియల్ ప్రివ్యూ కమిషన్ రద్దు, జ్యుడీషియల్ అధికారుల వయస్సు పెంపు వంటివి ఇందులో ఉండనున్నాయి.
మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు తొలిరోజు దూరంగా ఉండాలని ఆలోచన చేస్తోంది వైసీపీ. బడ్జెట్‌కు దూరంగా ఉండాలని భావిస్తోంది. సమావేశాలకు దూరంగా ఉండాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ అసెంబ్లీకి వచ్చినా కేవలం అటెండెన్స్ ఇచ్చి వెళ్లిపోనున్నారట.
ALSO READ: బోరుగడ్డ అనిల్ చాప్టర్ క్లోజేనా..?
మంగళవారం నుంచి వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రశ్నలు లేవనెత్తినప్పుడే హాజరు కావాలన్నది ఆలోచన. అయితే మండలి సమావేశాలకు యథావిధిగా హాజరుకావాలని నిర్ణయించింది. కూటమి సర్కార్ తీసుకొస్తున్న బిల్లులను మండలిలో నిలువరించాలన్నది ఆ పార్టీ ప్లాన్. అందుకే మండలికి సై చెప్పిందని అంటున్నారు.
మరోవైపు అసెంబ్లీ ఆవరణలో అలజడి చేయాలని కొంతమంది ప్లాన్ చేస్తున్నారన్న వార్తల ఈ నేపథ్యంలో బందోబస్తుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమీక్ష జరిపారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు, శాసనసభ సెక్రటరీ సూర్యదేవర ప్రసన్నకుమార్ తోపాటు పలువురు అధికారులు హాజరయ్యారు. సభలో మంచి వాతావరణం, అలాగే భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన చేశారు.