వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కుమార్ టెర్రర్ వాతావరణం సృష్టించాడు. జగన్ హయాంలో అతని అరాచకానికి హద్దే లేకుండా పోయింది. ప్రభుత్వం అండతో పోలీసులు సైతం అతనికి వీఐపీ ట్రీట్‌మెంట్ కల్పించారు. బోరుగడ్డ అనిల్.. జగన్‌కు తొత్తుగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలు, ప్రతిపక్షనేతలపై అసభ్య పదజాలంతో సోషల్ మీడియా, టీవీ డిబేట్‌లలో ఇష్టానుసారం దూషణలు చేశాడు. జగన్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడినా వారిపై బూతులతో విరుచుకుపడేవాడు. జగన్‌ను వ్యతిరేకిస్తూ మాట్లాడితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగేవాడు. చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్, లోకేశ్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ప్రతిపక్షాలకు చెందిన మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడి దూషించేవాడు.
ప్రభుత్వం మారక అనిల్ సెటిల్‌మెంట్లు, దూషణలకు సంబంధించి వరుసగా కేసులు నమోదవుతున్నాయి . తాజాగా రిమాండ్‌లో ఉన్న అనిల్‌పై మరో కేసు నమోదవ్వడంతో అతన్ని పోలీసులు కర్నూలుకు తీసుకెళ్లారు. పీటీ వారెంట్‌పై త్రీ టౌన్ పోలీసులు ఇక్కడకు తీసుకువచ్చినట్లు సమాచారం. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును చంపుతానని అనిల్ బెదిరించాడు. దీనిపై బోరుగడ్డ అనిల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు త్రీ టౌన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనిల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
మరోవైపు బోరుగడ్డ అనిల్ కుమార్‌పై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. గత ఏడాది మార్చి 31వ తేదీన బీజేపీ నేత, ప్రస్తుత మంత్రి సత్యకుమార్‌పై దాడి జరిగింది. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో బోరుగడ్డ అనిల్ ఏ2గా ఉన్నాడు. రాజధాని రైతులకు సంఘీభావం తెలిపి వస్తుండగా సత్యకుమార్‌పై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఆ దాడిలో కొందరు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. సురేష్, అనిల్‌తో సహా 25 మందిని నిందితులుగా ఈ కేసులో చేర్చారు. రాజమండ్రి జైలులో ఉన్న అనిల్‌పై కేసు నమోదు చేశారు.
Also Read: ఒకటికి వంద సార్లు ఆలోచించుకో.. ఈ సారి వదిలేదే లేదు.. పవన్ ఆగ్రహం
2021లో ఒకర్ని రూ. 50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించిన కేసులో బోరుగడ్డ అనిల్ రాజమండ్రి జైలులో ఉన్నారు. దాంతోపాటు ఏపీ సీఎం చంద్రబాబును దూషించిన కేసు కూడా అనిల్ మీద ఉంది. కాగా.. అందరినీ అసభ్య పదజాలంతో ధూషించిన బోరుగడ్డ అనిల్ కుమార్‌పై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. ఏఈఎల్‌సీ చర్చి వివాదం కేసులో అనిల్‌ను పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని మేజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చారు.
ఇటీవల అనిల్‌పై తుళ్లూరు పోలీసుస్టేషన్ పరిధిలో గతంలో నమోదైన రెండు కేసులకు సంబంధించి పోలీసులు అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. రిటర్న్‌లో అతనికి ఎస్కార్ట్‌గా వెళ్లిన ఏడుగురు పోలీసుల టీమ్ దారిలో ఓ రెస్టారెంట్ వద్ద వాహనాన్ని ఆపి, అనిల్‌ను అత్యంత గౌరవంగా లోపలికి తీసుకెళ్లి, బిర్యానీలు, చికెన్, మటన్‌లతో భోజనం పెట్టించారు. అతనితో కలిసి సరదాగా విందు ఆరగించారు. నిబంధనల ప్రకారం ఖైదీని వాహనంలోనే ఉంచి ఆహారం అందివ్వాలి. అయితే వారు అనిల్‌కు రాచమర్యాదలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. గుంటూరు స్టేషన్లో కూడా ఆ రౌడీషీటర్‌ని పోలీసులు అతిధిలా చూసుకున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని గుంటూరు ఎస్పీ సతీష్ వివరణ ఇచ్చారు. అనిల్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పడుకోవడానికి ఒక టేబుల్ ఏర్పాటు చేశామని, కోర్టు ఆదేశాల మేరకే అవి కూడా ఏర్పాటు చేశామని ఎస్పీ చెప్పుకొచ్చారు
అంత వివాదాస్పదమైన రౌడీషీటర్ అనిల్ ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అతని ఆగడాలపై బాధితులు ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ తాజాగా ప్రకటించారు. అనిల్‌పై ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 17 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అనిల్‌ను పోలీస్ కస్టడీకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారించాల్సిన అవసరం ఉంది. ఆయన వెనుక అదృశ్య శక్తులు ఇంకా ఎవరైనా ఉన్నారో గుర్తించాల్సి ఉంది. ఆ క్రమంలో బాధితులు ఒకొక్కరుగా బయటకు వచ్చికేసులు పెడుతుండటంతో .. అనిల్‌కు జైలు జీవితం నుంచి ఇప్పట్లో మోక్షం లేనట్లు గానే కనిపిస్తుంది.