AP Capital Amaravati Devlopment: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని నిర్మాణంలో మళ్లీ సింగపూర్ ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. సింగపూర్ ప్రభుత్వాన్ని కలిసి ప్రస్తుత పరిస్థితిని వివరించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జరిగిన విషయాలను వివరించి, సరిదిద్ది పరస్పర నమ్మకంతో మునుపటిలా కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో రాష్ట్రం చేసుకున్న ఒప్పందాలను అకస్మాత్తుగా వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడం వల్లనే రాష్ట్ర ప్రతిష్టకు గండిపడిందని టీడీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి నిర్ణయాలు రాష్ట్రానికి అంతర్జాతీయస్థాయిల తీవ్రనష్టం కలిగించాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
Also read: మాజీ మంత్రి కేటీఆర్ పై క్రిమినల్ కేసు..ఆ ఆరోపణలపై సృజన్ రెడ్డి సీరియస్
ఆగిపోయిన సంప్రదింపులను తిరిగి మొదలుపెట్టి పరస్పర చర్చలతో కలిసి పనిచేసే అవకాశాల కోసం కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే గతంలో టీడీపీ హయాంలోనే చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించి పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తరవాత ప్రభుత్వం మారడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ అమరావతిని రాజధానిగా కొనసాగించకుండా మూడు రాజధానులు నిర్మిస్తున్నామని చెప్పి కాలయాపన చేయడంతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది.
ఫలితంగా మొన్నటి ఎన్నికల్లో ప్రజలు మరోసారి టీడీపీకి భారీ విజయాన్ని కట్టబెట్టారు. దీంతో రాజధాని నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆగిపోయిన రాజధాని నిర్మాణ పనులను తిరిగి ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వాటర్స్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్వార్టర్లు ఎప్పుడు పూర్తవుతాయనే వివరాలను వెల్లడించారు. 2027 నాటికి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రకటించారు.
ఇక 2014 నుండి 2016 వరకు అమరావతి నిర్మాణం కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం సింగపూర్ మంత్రి ఈశ్వరణ్ తో అనేక ఒప్పందాలు చేసుకుంది. హోటల్స్ నిర్మాణం, ఇతర నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించారు. ఆ తరవాత వచ్చిన వైసీపీ సర్కార్ ఒప్పందాలు అన్నీ రద్దు చేయడంతో రాజధాని నిర్మాణానికి పుల్ స్టాప్ పడింది. ఇక ఇప్పుడు మరోసారి సింగపూర్ ను భాగస్వామ్యం చేయాలని చంద్రబాబు భావించారు. వారం రోజుల్లో సింగపూర్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ఉగాది నాటికల్లా సింగపూర్ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేయనున్నాయని సమాచారం అందుతోంది.