⦿ అమృత్ టెండర్ల స్కామ్ అంటూ నిరాధార ఆరోపణలు
⦿ ప్రజలను తప్పుదోవ పట్టించేలా విమర్శలు
⦿ లీగల్ నోటీసులు ఇచ్చినా మారని తీరు
⦿ నాంపల్లి కోర్టులో కేటీఆర్‌పై క్రిమినల్ పిటిషన్ దాఖలు
⦿ అనవసర ఆరోపణలతో చిక్కుల్లో కేటీఆర్
⦿ అమృత్ టెండర్ల స్కీమ్‌పై ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్లాన్
⦿ ఢిల్లీకి పోయి మరీ హడావుడి
⦿ నోటీసులు ఇచ్చినా తీరు మారకపోవడంతో సృజన్ రెడ్డి ఫైర్
⦿ నాంపల్లి స్పెషల్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు
⦿ పారదర్శకమైన టెండర్ కేటాయింపుపై ఆరోపణలా?
⦿ టెండర్ల ప్రక్రియపై అవగాహన ఉన్నా కూడా కుట్రలా?
⦿ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇదంతా
⦿ కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్
⦿ అసలు, టెండర్ల ప్రక్రియ ఎలా జరిగింది?
⦿ కేటీఆర్ చెబుతున్న దాంట్లో నిజానిజాలేంటి?
స్వేచ్ఛ క్రైంబ్యూరో: పదేళ్లు అధికారాన్ని అనుభవించి సడెన్‌గా ప్రతిపక్షంలో కూర్చోవాలంటే బాధగానే ఉంటుంది. అలాగని, ఆ ఫ్రస్ట్రేషన్‌ను జనం మీద రద్దుదామంటే కుదరదు. కొత్త చిక్కులు రాక మానవు. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిస్థితి అలాగే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మొదలు, ఏదో ఒక అంశాన్ని పట్టుకుని విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు కేటీఆర్. ముందూ వెనుకా ఆలోచించకుండా ఆ టెండర్, ఈ స్కామ్ అంటూ నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. అలా, అమృత్ స్కీమ్‌కు సంబంధించి కొద్ది రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి లబ్ధి చేకూర్చేలా టెండర్ ప్రక్రియ వెనుక లాబీయింగ్ జరిగిందన్నారు. దీన్ని ప్రభుత్వ వర్గాలు వెంటనే ఖండించాయి. టెండర్ ప్రక్రియను రూల్స్ ప్రకారమే జరిపినట్టు చెప్పాయి. అయినా కూడా కేటీఆర్ పదేపదే దీనిపై విమర్శలు చేస్తుండడంతో, ఆయన ఆరోపణలు చేస్తున్న వ్యాపారవేత్త సృజన్ రెడ్డి అదే రీతిలో కౌంటర్ ఇచ్చారు. ఇంతకుముందు లీగల్ నోటీసులు పంపి హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో తాజాగా నాంపల్లి స్పెషల్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు.
Also read: నా ప్రజలను ఇబ్బంది పెట్టను.. అది ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ పార్క్.. వామపక్ష నేతలతో సీఎం
పిటిషన్‌లో సృజన్ రెడ్డి పేర్కొన్న విషయాలు
అమృత్ టెండర్లపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుండడంతో కోర్టుకెక్కిన సూదిని సృజన్ రెడ్డి, ప్రజలను తప్పుదారి పట్టించేలా కేటీఆర్ మాట్లాడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2011లో శోధ కన్‌స్ట్రక్షన్స్ ప్రారంభమయ్యిందన్న ఆయన, ఈ కంపెనీ ఎండీగా కందాల దీప్తి రెడ్డి వ్యవరిస్తున్నారని తెలిపారు. సంస్థలో తనకు ఎలాంటి షేర్లు లేవని, తాను డైరెక్టర్‌ను కూడా కాదని చెప్పారు. శోధ కన్‌స్ట్రక్షన్స్‌తో తనను లింక్ చేస్తూ కేటీఆర్ అందర్నీ తప్పుదారి పట్టిస్తున్నారని తెలిపారు. అమృత్ 2లో ప్యాకేజ్ 1 కాంట్రాక్ట్‌ను ఏఎంఆర్ – శోధ – ఐహెచ్‌పీ జాయింట్ వెంచర్‌గా దక్కించుకున్నట్టు చెప్పారు. ఇందులో కేటీఆర్ చెబుతున్నట్లు శోధకు 80 శాతం కాకుండా 29 శాతమే వాటా ఉందన్నారు. అమృత్ పనులకు ఈ – టెండర్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రక్రియ కొనసాగిందని, పారదర్శకమైన విధానంలోనే కేటాయింపు జరిగినా కేటీఆర్ కావాలనే కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు సృజన్ రెడ్డి. మంత్రిగా చేసిన ఆయనకు టెండర్ల విధానంపై స్పష్టమైన అవగాహన ఉందని, అయినా కూడా తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఆరోపణలు చేస్తున్నారన్నారు. లీగల్ నోటీసులు ఇచ్చినా తీరు మార్చుకోనందుకే క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశానని తెలిపారు సృజన్ రెడ్డి.
ఇంతకీ.. అసలేం జరిగింది?
గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమృత్ స్కీమ్ టెండర్లకు ఆహ్వానించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రతిమ ఇన్‌ఫ్రా, మేఘా ఇంజనీరింగ్, పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్, గజా ఇంజినీరింగ్‌లకు వాటిని కట్టబెట్టింది. ఈ కంపెనీలన్నీ టెండర్ ధరపై 3.99 శాతం అధికంగా కోట్ చేశాయి. దీంతో సదరు కంపెనీలన్నీ సిండికేట్ అయ్యాయన్న ఆరోపణలు వినిపించాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వం ఏర్పడ్డాక, ఈ అమృత్ స్కీమ్ టెండర్లను రద్దు చేసింది. కొత్తగా మళ్లీ టెండర్లకు పిలిచింది. రూ.1,137 కోట్ల పనులను ఏఎంఆర్ – ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ, శోధా కన్‌స్ట్రక్షన్స్ జాయింట్ వెంచర్ ద్వారా దక్కించుకున్నాయి. రెండు శాతం తక్కువ ధరకే కోట్ చేసి పనులను సాధించుకున్నాయి. ఇందులో రూ.330 కోట్ల విలువైన పనులకే శోధా కన్‌స్ట్రక్షన్స్ పనులు చేస్తోంది. కానీ, రూ.8,888 కోట్ల స్కామ్ జరిగిందంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఇదంతా తప్పుడు ప్రచారమని గతంలోనే సృజన్ రెడ్డి స్పష్టం చేశారు. తనపై అనవసర ఆరోపణలు చేశారంటూ కేటీఆర్‌కు లీగల్ నోటీసులు పంపిన సందర్భంగా మండిపడ్డారు. అయినా కూడా కేటీఆర్ తీరు మార్చుకోకపోవడంతో నాంపల్లి స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నందున తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.