CM Chandrababu : ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. వరుసగా కేంద్రమంత్రులను కలుస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో చంద్రబాబు సమావేశం అయ్యారు. కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై గంటన్నర సేపు సమాలోచనలు జరిపారు. అంతకుముందు, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయాలని సీఎం కోరారు. పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఆర్థికశాఖకు ప్రతిపాదించారు. ప్రాజెక్ట్‌కు కేంద్ర మద్దతు కోరారు. గోదావరిలోని అదనపు నీటిని దక్షిణ మధ్య ప్రాంతాల్లోని నీటి ఎద్దడి ఏరియాలకు తరలించడం ఈ ప్రాజెక్ట్‌ల లక్ష్యం అన్నారు. ఈ ప్రాజెక్ట్ కరువు పీడిత ప్రాంతాల్లోని కోట్లాది మందికి ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. జూన్ 2025కల్లా డీపీఆర్ తయారీ పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
రాజ్‌నాథ్‌తో భేటీ..
ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన సీఎం చంద్రబాబు ఆయనకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టులపై చర్చించారు. BEL డిఫెన్స్ కాంప్లెక్స్, ఏపీలో వ్యూహాత్మక ఏరోస్పేస్ ప్రాజెక్టులను రక్షణమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రక్షణ తయారీ, ఏరోస్పేస్ ఆవిష్కరణల్లో రాష్ట్రం దేశానికి ప్రధాన కేంద్రంగా ఎదగడానికి అవసరమైన వ్యూహాన్ని వివరించారు చంద్రబాబు.
ఏపీలో స్పేస్ సిటీస్..
ఆంధ్రప్రదేశ్‌ను శాటిలైట్ ఉపగ్రహాల ఉత్పత్తి, తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నారు సీఎం చంద్రబాబు. అంతరిక్ష ఆవిష్కరణలకు, తయారీ కేంద్రంగా.. ఏపీని తీర్చిదిద్దేందుకు మద్దతివ్వాలని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేందర్‌ను కోరారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే రెండు స్పేస్ సిటీల అభివృద్దికి సహకారం అందించాలన్నారు. వీటిలో ఒకటి షార్ అంతరిక్ష కేంద్రం సమీపంలో, మరొకటి లేపాక్షి వద్ద ఏర్పాటు చేస్తున్నామని.. వీటి ఏర్పాటుకు సహకరించాలని కోరారు. వీటి ద్వారా ఉపగ్రహాల ఉత్పత్తి, ప్రయోగ వాహనాల అభివృద్ధి, పరిశ్రమల సహకారానికి ఇవి సమగ్ర కేంద్రాలుగా ఉపయోగపడతాయని జితేంద్ర సింగ్‌కు వివరించారు.
కరువు ప్రాంతాలకు గోదావరి నీళ్లు..
ఇటు జల్‌శక్తి మంత్రి CR పాటిల్‌ను కలిశారు సీఎం. పోలవరం-బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదనను సమర్పించారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి వరద నీటిని కరువు ప్రాంతాలకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు వివరించారు. జల్ జీవన్, బ్లూ రివల్యూషన్, మేకిన్ ఇండియా లాంటి జాతీయ మిషన్ల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు మరింత దోహదం చేస్తుందని చెప్పారు చంద్రబాబు. పోలవరం-బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల డీపీఆర్ త్వరలో సమర్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పనులను త్వరగా ముందుకు తీసుకెళ్లడానికి తక్షణ అనుమతులు మంజూరు చేయాలని అభ్యర్థించారు సీఎం.
సోలార్ ప్యానెల్స్ ప్లీజ్
అంతకు ముందు ప్రహ్లాద్ జోషీతో సమావేశమయ్యారు చంద్రబాబు. పీఎం సూర్యఘర్ యోజన కింద ఏపీకి సాయం అందించాలని రిక్వెస్ట్ చేశారు. రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ కేటాయింపుపై ప్రతిపాదనలను కేంద్ర మంత్రికి అందించారు. ఎస్సీ ఎస్టీ గృహాలకు 20 లక్షల సోలార్ ప్యానల్స్, బీసీ గృహాలకు 2 కిలో వాట్ల వరకు అమర్చుకునేలా 10 వేల సబ్సిడీ అందించాలని రిక్వెస్ట్ చేశారు. పునరుత్పత్తిక ఇంధన వినియోగంలో ఏపీని బెంచ్ మార్క్ స్టేట్ గా మార్చేందుకు సహకరించాలని కోరారు సీఎం.