AP : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ఒక డీఏను మంజూరు చేసింది. 2022 జనవరి నుంచి ఇవ్వాల్సిన డీఏను 2.73 శాతం మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులకు డీఏను మంజూరు చేస్తూ జీవో 66ను, పెన్షనర్లకు డీఏను మంజూరు చేస్తూ జీవో 67ను విడుదల చేశారు.
పెంచిన డీఏను ఈ ఏడాది జూలై 1 నుంచి అమలు చేస్తారు. ఆగస్టు 1న వేతనాలతో కలిపి నగదు రూపంలో చెల్లిస్తారు. జనవరి 2022 నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలను ఈ ఏడాది సెప్టెంబర్, డిసెంబర్, వచ్చే ఏడాది మార్చిలో 3 సమాన వాయిదాల్లో ఉద్యోగుల జీపీఎఫ్‌లో జమ చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
తాజాగా మంజూరు చేసిన డీఏతో కలిపి ఉద్యోగుల, పెన్షనర్ల మొత్తం డీఏ 22.75 శాతానికి చేరింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెంచిన డీఏ బకాయిలను పదవీ విరమణ బెనిఫిట్స్‌లో కలిపి చెల్లిస్తారు. డీఏ పెంపు జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సమితి, 2022లో సవరించిన రెగ్యులర్ స్కేళ్లు పొందుతున్న వర్క్ చార్జ్‌డ్ ఉద్యోగులకు వర్తిస్తుంది.
2022లో సవరించిన రెగ్యులర్ స్కేళ్లు పొందుతున్న ఎయిడెడ్ ఇనిస్టిట్యూషన్స్ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, ఎయిడెడ్ పాలిటెక్నిక్, యూనివర్సిటీ సిబ్బంది, ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ, వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి డీఏ పెంపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.