Fine Rice Distribution: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఓ శుభవార్త చెప్పింది. ఎంతోకాలంగా ప్రతిపాదనలలో ఉన్న సన్నబియ్యం పంపిణీ పథకం ఇప్పుడు కార్యరూపం దాల్చుతోంది. సన్నబియ్యాన్ని జనానికి అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వచ్చే జూన్ 12వ తేదీ నుంచి ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నారు.
ముందుగా పాఠశాలలు – వసతి గృహాలకు పంపిణీ
ఈ పథకం ప్రారంభ దశలో రాష్ట్రంలోని 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ వసతి గృహాలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. మిడ్ డే మీల్ (మధ్యాహ్న భోజన పథకం) లో భాగంగా పిల్లలకు నాణ్యమైన బియ్యం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మంచి పోషక విలువలతో ఉండే ఈ బియ్యం పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంది.
రేషన్ కార్డుదారులకు ఎప్పుడంటే?
ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం, పాఠశాలలు, హాస్టళ్ల తర్వాత రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇందుకోసం స్టాక్‌ను సిద్ధం చేయడంలో అధికారులు బిజీగా ఉన్నారని చెప్పవచ్చు. రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీకి టోకెన్లు, రికార్డులు ముందుగానే సెట్ చేస్తున్నారు.
ఎందుకు ప్రత్యేకం ఈ సన్నబియ్యం?
సన్నగా ఉండే ఈ బియ్యం రుచిగా ఉండటమే కాకుండా, తేలికగా జీర్ణమవుతుంది. బలవర్థక పోషకాలు ఎక్కువగా ఉండటంతో, పిల్లలకు, వృద్ధులకు ఆరోగ్య పరంగా ఎంతో ఉపయోగకరం. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించడం వల్ల రైతులకు కూడా లాభం చేకూరుతుంది. అలాగే ఇప్పటి వరకు సాగుతున్న రేషన్ అక్రమ రవాణాను కూడా ఈ అమలుతో అడ్డుకట్ట వేయవచ్చు.
పథకం ద్వారా ప్రయోజనం పొందే వారు
పాఠశాలలో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులు, సంక్షేమ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు, రేషన్ కార్డుదారులైన కోట్లాది మంది పౌరులు ఈ పథకంతో లబ్ది పొందనున్నారు.
ప్రజల నుంచి భారీ స్పందన
ఈ నిర్ణయం ప్రజల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే చాలామంది తాము ఎప్పుడెప్పుడు ఈ సన్నబియ్యం పొందుతామా అని ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మధ్య తరగతి, పేద కుటుంబాల వారు దీనిపై అధిక ఆసక్తి చూపుతున్నారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ ఏమి చెప్పారంటే..
ఇటీవల రైస్ కార్డులపై మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. పక్కనే గల తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారని, అలా ఏపీలో అమలు ఎప్పుడు అంటూ మీడియా ప్రతినిధి అడిగారు. తాము దశల వారీగా సన్నబియ్యం పథకాన్ని అమలు చేస్తామని, మొదట విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించారు.
ముఖ్యమంత్రిపై ప్రశంసల వెల్లువ
పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందించడం, రేషన్ దారులకు మంచి బియ్యం సరఫరా చేయడంపై సీఎం చంద్రబాబు పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
వైసీపీ హయాంలో..
వైసీపీ ప్రభుత్వ హయాంలో సన్నబియ్యం గురించి పెద్ద రచ్చే సాగింది. అసెంబ్లీలో దూషణల వరకు వెళ్ళింది. సన్నబియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి, ఆ హామీని పట్టించుకోలేదన్నది నాటి ప్రతిపక్షంలో గల టీడీపీ వాదన. ప్రస్తుతం అదే కూటమి ప్రభుత్వంలో సన్నబియ్యం అమలుకు శ్రీకారం చుట్టడం విశేషం.