AP Free Bus Scheme: రాష్ట్రంలోని మహిళలకు ఎంతో ఉపయోగకరంగా మారబోయే ‘స్త్రీశక్తి’ పథకం ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానుంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ఈ పథకంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అధిక రద్దీ ఉండే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, భద్రత అంశంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. మహిళలతో పాటు ప్రయాణికులందరితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆర్టీసీ సిబ్బందికి సూచించారు. ఫిర్యాదులు రాకుండా ప్రతీ చిన్న విషయాన్నీ పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రయాణికుల నుండి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ సేకరించి, దానికి అనుగుణంగా పథకాన్ని మెరుగుపరచాలని చెప్పారు. సేవలందించడానికి సర్వీస్ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల సహకారం తీసుకోవాలని సూచించారు.
ఈపోస్ మిషన్లలో జీపీఎస్ తప్పనిసరిగా ఎనేబుల్ చేసి, బస్సుల లొకేషన్‌ను ట్రాక్ చేస్తూ ప్రయాణికులకు సమాచారం అందించాలని సూచించారు. సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేలా సిస్టమ్ సిద్ధంగా ఉండాలని అన్నారు. బస్ స్టేషన్ల పరిశుభ్రతపై కూడా సీఎం దృష్టి సారించారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని, టాయిలెట్లను ప్రతి రెండు గంటలకు ఒకసారి శుభ్రపరచాలని ఆదేశించారు. తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, రూ.30 కోట్లతో జరుగుతున్న బస్ స్టేషన్ల మరమ్మతులు, పెయింటింగ్ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని సూచించారు. అవసరమైన చోట కొత్త ఫ్యాన్లు, కుర్చీలు ఏర్పాటు చేసి, 24 గంటలు ఆర్టీసీ సిబ్బంది బస్ స్టేషన్లలో అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు.
బ్రేక్‌డౌన్‌లు జరగకుండా ముందుగానే బస్సులకు అవసరమైన మరమ్మతులు చేశామని అధికారులు తెలిపారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. జీరో ఫేర్ టికెట్ కోసం ఈపోస్ మిషన్ల సాఫ్ట్‌వేర్‌ను ఆగస్ట్ 14 నాటికి అప్‌డేట్ చేస్తామని, సిబ్బందికి శిక్షణ పూర్తి చేశామని వివరించారు. ఆగస్ట్ 15న మధ్యాహ్నం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. సమీక్షలో ఆటో డ్రైవర్లకు సంబంధించిన సాయంపై కూడా చర్చ జరిగింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలతో పాటు రాష్ట్రం నుంచి కొత్త పథకం రూపొందించేందుకు సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ఈ విధంగా రాష్ట్రంలోని లక్షలాది మహిళలు ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణ కల, స్వాతంత్ర్య దినోత్సవం రోజున నిజం కానుంది.