Tirumala Diwali Asthanam: తిరుమల శ్రీవారి సన్నిధిలో దీపావళి పర్వదినం సోమవారం ఘనంగా నిర్వహించారు. స్వామి దర్సనానికి వచ్చిన భక్తులు పండుగ ఉత్సాహంలో మునిగిపోయారు. అర్చకులు, టీడీపీ బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులు, విశిష్ట అతిథులు ఈ శాస్త్రోక్త కార్యక్రమంలో పాల్గొన్నారు.
దీపావళి ఆస్థానం ప్రారంభం కావడానికి ముందు.. ఆలయంలోని శ్రీవారి ప్రధాన సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ మలయప్పస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను గరుడాళ్వార్ సన్నిధిలో ఆవాహన చేసి ఆస్థానం నిర్వహించారు. అర్చక స్వాములు ఆగమ శాస్త్రాల ప్రకారం కర్పూర, పుష్ప, ధూప, దీప నైవేద్యాలు సమర్పించి మంగళహారతులు నివేదించారు.
ఈ సందర్భంగా పట్టు వస్త్ర సమర్పణను ప్రధానంగా నిర్వహించారు. మూలవిరాట్టు స్వామివారికి, ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం రూపాయి హారతి, ప్రత్యేక దీపారాధన, మంగళహారతులతో పూజా కార్యక్రమాలు ముగిశాయి. ఈ విధంగా దీపావళి ఆస్థానం వైభవంగా, అర్చకుల ధార్మిక నిబంధనల ప్రకారం విజయవంతంగా పూర్తయింది.
దీపావళి పండుగ సందర్బంగా తిరుమలలో భక్తుల రద్దీ కనిపించింది. కాగా స్వామివారి ఆలయంలో బంగారు వాకిలి, ముక్కోటీ దీపాలతో ప్రకాశించింది.
ఇదిలా ఉంటే.. దీపావళి ఆస్థానం కారణంగా ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ దీపావళి పండుగ కాంతులతో మెరిసింది. భక్తులు తమ ఇళ్లలో దీపాలను వెలిగించి స్వామివారి దర్శనం తర్వాత పర్వదినాన్ని జరుపుకున్నారు. ఆలయ ప్రధాన గోపురం, బంగారు వాకిలి, అర్చన మండపం పూలతో, పట్టు వస్త్రాలతో అద్భుతంగా అలంకరించారు.
Also Read: కానిస్టేబుల్‌ని చంపిన రియాజ్ ఖతం
దీపావళి పర్వదినం సందర్భంగా తిరుమలలో సాంస్కృతిక ప్రదర్శనలు, వేదపారాయణం, భజన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో దీపాల కాంతులు, భజనల నాదం, ధూపదీపాల వాసన కలగలిసి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.