Aadabidda Nidhi Scheme: కూటమి ప్రభుత్వానికి రెండో ఏడాదిని ‘పథకాల ఇయర్’గా వర్ణిస్తున్నారు. తొలి ఏడాది అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సమయం కేటాయించింది. ఇచ్చిన హామీల మేరకు ఒక్కో పథకం అమలు చేసుకుంటూ పోతోంది. తొలుత తల్లికి వందనం పేరుతో మహిళల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. రేపో మాపో ఆడ బిడ్డ నిధి పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.
ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చ దిశగా అడుగులు ముందుకు వేస్తుంది. ఇప్పటికే తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. ఈ క్రమంలో మరో పథకాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఒకవిధంగా చెప్పాలంటే రాష్ట్రంలోని మహిళలకు ఇదొక శుభవార్త.
18 ఏళ్లు నిండిన మహిళల ఖాతాలో రూ.18 వేలు జమ చేసేందుకు సిద్ధం అవుతోంది. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఆర్థిక సాయం చేయనుంది. బీపీఎస్ కుటుంబానికి చెందినవారు అర్హులు. ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయనుంది. ఈ పథకాన్ని త్వరలో సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందాలనుకున్న లబ్ధిదారులు ఆన్‌లైన్, మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ALSO READ: జగన్ కొత్త ఆలోచన, స్టాలిన్ చట్టం పరిశీలన
దీనికి ఆధార్ కార్డ్, వయసు నిర్ధారణ కోసం డాక్యుమెంట్లు, బ్యాంక్ పాస్ బుక్ తప్పనిసరిగా ఉండాలి. ఆడబిడ్డ పథకం కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. ఏకంగా రూ.3,341.82 కోట్లు నిధులు రెడీ చేసింది. అందులో బీసీ మహిళలకు రూ.1069.78 కోట్లు కేటాయించనున్నారు. మిగతాలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల కోసం రూ.629.37 కోట్లు ఇవ్వనుంది.
అలాగే మైనారిటీ మహిళలకు రూ.83.79 కోట్లు ఇవ్వనుంది. మిగిలిన నిధులను ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం కేటాయించింది. అర్హులైన మహిళలు వారి సామాజిక, ఆర్థిక నేపథ్యాల ఆధారంగా ఆయా నిధులను జమ చేయనుంది.
ఈ పథకానికి సంబంధించి ap.gov.in/aadabiddanidhi వెబ్ పోర్టల్‌ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి అధికారిక వెబ్‌సైట్ ఇంకా అందుబాటులోకి రాలేని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.