Free Parking in Malls: నగరాలు, పట్టణాల్లో పార్కింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది. దీనివల్ల వాహనాలు రోడ్లపై పెడుతున్నారు. ఫలితంగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని మల్టీపెక్సులు, షాపింగ్ మాల్స్‌లో అయితే ప్రత్యేకంగా పార్కింగ్ పేరిట ఫీజు వసూలు చేస్తున్నారు. ఈ సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఉచిత పార్కింగ్‌పై కొత్త జీవో
కొన్నాళ్లుగా పార్కింగ్ ఫీజుల పేరుతో అడ్డగోలు దోపిడీ ఏపీలో జరుగుతోంది. ఈ వ్యవహారంపై వినియోగదారుల కమిషన్లు, న్యాయస్థానాల్లో కేసులు నమోదు అయినా నిబంధనల్లో లొసుగుల్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. షాపింగ్ మాల్స్‌లో ప్రజల నుంచి పార్కింగ్ పేరుతో వసూళ్లు చేస్తున్నాయి. ఈ దోపిడీకి ఏపీ సర్కార్ అడ్డుకట్ట వేసింది.
పార్కింగ్ ఫీజులపై స్పష్టత ఇస్తూ జీవో నంబర్ 44ను పురపాల శాఖ జారీ చేసింది. ఇకపై మాల్స్‌లో షాపింగ్ బిల్లు, సినిమా టికెట్ ఉంటే పార్కింగ్ సదుపాయాన్ని ఉచితంగా కల్పించాలన్నది అందులోని ప్రధాన పాయింట్.
నార్మల్‌గా అయితే రైల్వేస్టేషన్లలో మాదిరిగానే గంటలు పెరిగిన కొద్దీ పార్కింగ్ ఫీజును ఇబ్బడి ముబ్బడిగా పెంచేస్తున్నారు మాల్స్. టూ వీలర్స్ కనీస ధర రూ.20 కాగా, కార్లకు రూ.50 గా నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి ప్రజల నుంచి మాల్స్ దోపిడీపై భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ALSO READ: ఉత్తరాంధ్రకు వైభోగం.. ఫారెన్ యూనివర్సిటీ రాక
కీలక పాయింట్లు ఏంటి?
పరిస్థితి గమనించిన మున్సిపల్ శాఖ.. షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్స్ థియేటర్లలో పార్కింగ్ ఫీజుల్ని క్రమబద్ధీకరించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుపై స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు జీవో 44ను మున్సిపల్ శాఖ విడుదల చేసింది.
వాణిజ్య సముదాయాలు, మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్లలోని పార్కింగ్ స్థలాల్లో అర గంట వరకు ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదు ఫస్ట్ పాయింట్. ఇక మాల్స్‌లోని షాపుల్లో ఏమైనా వస్తువులు కొన్నట్టు బిల్లు చూపిస్తే 30 నిమిషాల నుంచి గంటలోపు వారి నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదన్నది సెకండ్ పాయింట్.
మాల్స్‌లో థియేటర్లు ఉంటే సినిమా టికెట్ లేదా అక్కడ ఉండే షాపుల్లో పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువ విలువైన వస్తువులు కొన్నట్టు బిల్లులు చూపిస్తే చాలు. గంట కంటే ఎక్కువ సేపు వాహనాన్ని పార్కింగ్‌లో ఉంచినా పార్కింగ్ ఫీజు మినహాయిస్తారు. కొత్త ఆదేశాలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే బిల్లులు, సినిమా టికెట్లు చూపని వారి నుంచి రుసుము ఎంత వసూలు చేయాలన్న దానిపై ఆ శాఖ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.