వర్షాల సమయంలో అమరావతి మునిగిపోయిందని, అది రాజధానిగా పనికి రాదంటూ వైసీపీ చేసిన ప్రచారం పూర్తిగా ఆ పార్టీకే రివర్స్ అయింది. అక్కడ నీరు నిలబడలేదని చెబుతూనే ఉన్న సమస్యను ఒక్క రోజులోనే ప్రభుత్వం పరిష్కరించింది. తాజాగా మరింత కసితో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సిద్ధమైంది. మంత్రి నారాయణ అక్కడే మకాం వేశారు. తాజాగా ఆయన నిర్మాణ పనుల్ని మరోసారి పర్యవేక్షించారు. మంత్రి నారా లోకేష్ అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనానికి శంకుస్థాపన చేశారు. ఈ పనులన్నీ పూర్తి చేసి ఎన్నికల నాటికి అమరావతి గ్రాఫిక్స్ కాదు, నిజం అని చూపిస్తూ ఓట్లు అడిగేందుకు ఇప్పట్నుంచే కూటమి ప్రయత్నాలు మొదలు పెట్టింది.
కూటమి ప్రభుత్వం, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరావతిలోని తుళ్లూరు-పెదపరిమి మధ్య ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల విస్తీర్ణంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహంతో పాటు ఆడిటోరియం, స్మృతివనం నిర్మాణానికి శంకుస్థాపన చేశాను. అమరజీవి… pic.twitter.com/V1M9ikzZ1P
— Lokesh Nara (@naralokesh) September 3, 2025
శరవేగంగా పనులు..
రాజధానిలో నేలపాడు లో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల క్వార్టర్స్ ని మంత్రి నారాయణ పరిశీలించారు. వర్షాల తర్వాత అమరావతిలో నిర్మాణ పనులు తిరిగి వేగవంతం అయ్యాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం 13 వేల మంది కార్మికులు అమరావతిలో పనులు చేస్తున్నారని చెప్పారు. క్రేన్లు, జేసీబీలు.. ఇలా మొత్తం 2500 యంత్ర పరికరాలు అమరావతి పనుల్లో ఉన్నాయని అన్నారు. 720 ప్లాట్లు గ్రూప్-1 అధికారుల కోసం రెడీ అవుతున్నాయని, వాటి నిర్మాణం నవంబర్ నెలాఖరులోగా పూర్తవుతుందన్నారు. అక్టోబర్ లో గ్రూప్-డి లో ఉన్న నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. వచ్చే ఏడాది మార్చిలోగా అమరావతిలో 4వేల ఇళ్లను అధికారులు సిబ్బందికి అప్పగిస్తామన్నారు. ఆ లోగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అమరావతి నగరంలో మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టిపెట్టిందన్నారు మంత్రి నారాయణ. అమరావతిలో ఏం జరగడం లేదని, అదంతా గ్రాఫిక్స్ అంటూ కొంతమంది అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, వారిని ప్రజలు క్షమించరని, అమరావతి సేఫ్ సిటీ అని, అనుమానం లేదని చెప్పారు.
అమరజీవికి విగ్రహం..
తుళ్ళూరు – పెదపరిమి గ్రామాల మధ్య అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకి తాజాగా శంకుస్థాపన జరిగింది. మంత్రి నారా లోకేష్ ఈ విగ్రహ శంకుస్థాపనలో పాల్గొన్నారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణం ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి నారాయణ. ఆయన ఆత్మత్యాగం తోనే తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. ఈ ఆలోచన నారా లోకేష్ ది అని, ఆయన సూచించిన వెంటనే సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆఘమేఘాల మీద స్థలాన్ని కేటాయించామన్నారు. విగ్రహం తో పాటు ఇతర నిర్మాణాలకు 6.8 ఎకరాలను సీఆర్డీయే కేటాయించిందని స్మారకం అద్భుతంగా తయారవుతుందని చెప్పారు. వచ్చే ఏడాది శ్రీరాములు జయంతి నాటికి విగ్రహం పూర్తి చేస్తే అమరావతిలో ఇదే తొలి విగ్రహం అవుతుందన్నారు నారాయణ.
అమరావతిపై ఫోకస్..
కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది. అదే సమయంలో కూటమి నుంచి ప్రజలు రాజధాని నిర్మాణాన్ని కూడా ఆశిస్తున్నారు. 2014-2019 మధ్య కాలంలో అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు పూర్తయ్యాయి. ఆ తర్వాత వైసీపీ పాలనలో ఒక్క ఇటుక కూడా పడలేదనే విషయం తెలిసిందే. మూడు రాజధానుల పేరుతో అసలు ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు. తిరిగి కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి రాజధాని అమరావతిపై ప్రజల అంచనాలు, ఆశలు పెట్టుకున్నారు. ఆ అంచనాలు నిజం చేయడానికి కూటమి ప్రభుత్వం ఆచరణలోకి దిగినట్టు స్పష్టమవుతోంది. ఇటీవల అమరావతి వరదల్లో మునిగిపోతుందంటూ ప్రచారం జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాజాగా పొట్టి శ్రీరాములు స్మారకంతో మరో అడుగు ముందుకు పడినట్టయింది.